AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ ప్రాజెక్టులపై కీలక చర్చ..

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో జరిపిన గంటపాటు భేటీలో కీలక విషయాలపై చర్చించారు. ముఖ్యంగా తుమ్మిడిహట్టి బ్యారేజీకి మహారాష్ట్ర మెలిక వీడేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరడంతో పాటు.. పాలమూరు-రంగారెడ్డి, డిండి పనులకు పర్యావరణ అనుమతులపై కేంద్రానికి వినతిపత్రాలు అందజేశారు.

కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ ప్రాజెక్టులపై కీలక చర్చ..
Cm Revanth Reddy Meets Union Minister C.r. Patil
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Sep 29, 2026 | 9:12 PM

Share

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డితో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు సాగిన ఈ భేటీలో కృష్ణా, గోదావరి బేసిన్లలోని తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైన పలు ప్రాజెక్టుల అనుమతులు, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కేంద్రమంత్రికి వినతి పత్రాలు అందజేశారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వీలైనంత త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ కోరారు. బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించినట్లు సీఎం స్పష్టం చేశారు. ఈ బ్యారేజీని ఎఫ్‌ఆర్‌ఎల్ 152 మీటర్ల స్థాయిలో నిర్మించేందుకు రెండు రాష్ట్రాల మధ్య త్వరగా అంగీకారం కుదిరేలా కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ఆధారంగా నీటిని ఎల్లంపల్లికి తరలించడం సులువవుతుందని, దీనివల్ల విద్యుత్ వినియోగం, భారీ వ్యయం తగ్గుతుందని కేంద్ర మంత్రికి వివరించారు.

ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు వేగవంతం చేయాలి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్ బహుళార్ధక ప్రాజెక్టు, గౌరవెల్లి రిజర్వాయర్లకు సంబంధించిన పర్యావరణ అనుమతులను తక్షణమే మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రిని కోరారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా పర్యావరణ అనుమతులపై మార్గదర్శకాలను జారీ చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నారు. అనుమతుల్లో జాప్యం జరగడం వల్ల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరుగుతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం వద్ద పెండింగ్‌లో ఉన్న డీపీఆర్ అనుమతులను త్వరగా క్లియర్ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలపై అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుండి ఎన్‌వోసీ పొందేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని కేంద్ర మంత్రికి వివరించారు.

టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటు వేగవంతం

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో చేపట్టాల్సిన టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఆర్ పాటిల్‌ను సీఎం కోరారు. మొదటి దశ టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటుకు అవసరమైన రూ.4.15 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జమ చేసినట్లు గుర్తుచేశారు. మొదటి దశను త్వరగా పూర్తి చేయడంతో పాటు రెండు, మూడో దశలకు సంబంధించిన టెలీమెట్రీ యంత్రాలను కూడా సత్వరమే ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.

Follow Us