ఉల్లిపాయల ధరలకు కళ్లెం.. ఏపీలో రూ.35కే కిలో
ఉల్లిపాయల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ఏపీ ప్రజలకు ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను రూ.35కే సబ్సిడీపై విక్రయించాలని నిర్ణయించింది. తొలిదశలో విజయవాడలోని అన్ని రైతు బజార్లలో ఈ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ..

ఉల్లిపాయల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. రైతు బజార్లలో సబ్సిడీపై కిలో ఉల్లిపాయలను కేవలం రూ.35కే విక్రయించాలని నిర్ణయించింది. తొలిదశలో విజయవాడలోని అన్ని రైతు బజార్లలో ఈ విక్రయాలను ప్రారంభించనుంది.
కుటుంబానికి నెలకు 2 కిలోలు
రేపటి నుంచి విజయవాడలో సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలు అందుబాటులోకి రానున్నాయి. ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు గరిష్ఠంగా రెండు కిలోల ఉల్లిపాయలను రూ.35 చొప్పున అందించనున్నారు. దీంతో మార్కెట్‌లో పెరుగుతున్న ఉల్లిపాయల ధరల భారాన్ని కొంతమేర తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.
డిమాండ్ పెరిగితే రాష్ట్రవ్యాప్తంగా..
ప్రస్తుతం విజయవాడలో ప్రారంభిస్తున్న ఈ సబ్సిడీ విక్రయాలను ప్రజల నుంచి వచ్చే స్పందన, డిమాండ్ ఆధారంగా రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరాన్ని బట్టి విక్రయాలను మరింత విస్తృతం చేసే అవకాశం ఉంది.
ఉల్లిపాయల ధరలు పెరగడంతో వినియోగదారులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు ధరలను స్థిరీకరించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సబ్సిడీ ప్రయోజనాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
