Edible Oil Prices: పండుగలవేళ కేంద్రం శుభవార్త.. దేశీయంగా తగ్గిన వంట నూనె ధరలు!
Edible Oil Prices: ఇండియాలో వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల కారణంగా నూనె ధరలు దిగివస్తున్నాయి.
Edible Oil Prices: ఇండియాలో వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల కారణంగా నూనె ధరలు దిగివస్తున్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం ధరలు పెరుగుతున్నాయి. ఓ వైపు పెట్రోలియం ధరల మోత, గ్యాస్ బండ బాదుడు.. మరోవైపు నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య పౌరుడికి కాస్త ఊరట లభించింది. పండగల వేళ ప్రజలకు ఉపశమనం కల్పిస్తూ.. ముడి పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం తొలగించింది. అంతేగాక వీటిపై ఉన్న అగ్రిసెస్‌ను కూడా తగ్గించింది. దీంతో దేశీయంగా వంట నూనె ధరలు కాస్త దిగిరానున్నాయి.
గత కొన్ని రోజులుగా దేశీయ మార్కెట్లో వంట నూనెల ధరలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఇక, పండగ సీజన్ కావడంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఊరటనిచ్చేందుకు దిగుమతి సుంకాలను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ముడి వంట నూనె రకాలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తొలగించడంతో పాటు అగ్రిసెస్‌ను కూడా తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో గత కొద్దికాలంగా వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం దిగుమతి పన్నును తగ్గించడంతో దేశీయంగా ఆ ప్రభావం ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో గత నెలరోజుల్లో సోయాబీన్, పొద్దు తిరుగుడు, పామాయిల్, ఆర్‌బీడీ పామోలిన్ ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే నూనెలపై సెప్టెంబర్ 11 నుంచి దిగుమతి పన్ను తగ్గించడంతో నూనె ధరలు(Edible Oil Prices)కూడా తగ్గాయి. హోల్‌సేల్, రిటైల్ ధరలు వరుసగా తగ్గుతూ వచ్చాయి. తాజా నిర్ణయంతో ముడి పామాయిల్‌పై అగ్రిసెస్ 7.5శాతానికి, ముడి సోయాబిన్ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనెపై 5.5శాతానికి దిగొచ్చింది. ఇక రిఫైన్డ్(శుద్ధీకరించిన) వంట నూనెలపైనా బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 32.5శాతం నుంచి 17.5శాతానికి తగ్గించారు. ఈ తగ్గింపు అక్టోబరు 14న అమల్లోకి వచ్చి 2022 మార్చి 31 వరకు కొనసాగుతుందని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
మొత్తంగా చూస్తే దీంతో ముడి పామాయిల్‌పై ఆధార దిగుమతి పన్ను 10% నుండి 2.5% కి తగ్గించింది కేంద్రం. ముడి సోయోయిల్, ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై పన్ను 7.5% నుండి 2.5% కి తగ్గింది. పామాయిల్, సోయోయిల్, పొద్దుతిరుగుడు నూనె శుద్ధి చేసిన గ్రేడ్‌లపై బేస్ దిగుమతి పన్ను 37.5% నుండి 32.5% కి తగ్గించారు. ఇదిలావుంటే, పామాయిల్‌ని అగ్రశ్రేణి ఉత్పత్తిదారులు ఇండోనేషియా, మలేషియా నుండి దిగుమతి చేసుకుంటుంది భారత్. సోయా, పొద్దుతిరుగుడు వంటి ఇతర నూనెలు అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యా నుండి దిగుమతి అవుతోంది.
Read Also…. Tata Motors: దుమ్మురేపిన టాటా మోటర్స్ షేర్లు.. ఒక్కరోజులో 20 శాతం జంప్.. షేర్ హోల్డర్లకు కనక వర్షం