రూ.2000 కోట్ల స్కామ్.. మళ్లీ ఆప్ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.. 37 చోట్ల ఈడీ సోదాలు..
ఢిల్లీ స్కూళ్ల నిర్మాణంలో జరిగిన స్కాంపై ఈడీ దూకుడు పెంచింది. 37 చోట్ల సోదాలు నిర్వహించింది. రూ. 2000 కోట్ల అవినీతి జరిగిందన్న ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆప్ మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్‌ను ఈ కేసులో నిందితులుగా చేర్చారు.

ఢిల్లీ స్కూళ్ల నిర్మాణంలో జరిగిన స్కాంకు సంబంధించి ఈడీ పలుచోట్ల సోదాలు నిర్వహించింది. 37 చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ లోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త తరగతి గదుల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ఆధారంగా ఈడీ సోదాలు చేపట్టింది. కాంట్రాక్టర్లు , బిల్డర్ల కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. స్కూల్ స్కామ్‌లో దాదాపు రూ.2000 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ను ఈ కేసులో ఏసీబీ విచారణకు పిలిచింది. సత్యేంద్రజైన్ అప్పట్లో పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్ మంత్రిగా పనిచేశారు. సత్యేంద్ర జైన్ కేజ్రీవాల్ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
అయితే కాంట్రాక్టర్లకు అక్రమంగా నిధులు చెల్లించారని ఆరోపణలు రావడంతో ఢిల్లీ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏప్రిల్ 30న మనీష్ సిసోడియాతో పాటు సత్యేంద్ర జైన్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ విచారణకు మనీష్ సిసోడియా హాజరుకాలేదు. 12000 తరగతి గదుల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఎసీబీ కేసు నమోదు చేసింది. అయితే ఈ ఆరోపణలను ఆప్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆప్ ప్రభుత్వ విద్యా విధానం దేశానికి ఆదర్శప్రాయని, కాని ఢిల్లీలో ప్రభుత్వ స్కూళ్లతో పేదలకు ఉచిత విద్యను అందించామని ఆప్ నేతలు అన్నారు.
ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పేదలకు తీరని అన్యాయం చేస్తోందంటూ ఆప్ నేతలు పేర్కొన్నారు. పేదలకు ఉచిత విద్య అందకుండా కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ తప్పుడు ఆరోపణలు తెరపైకి తెచ్చారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తమపై పెట్టిన కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటామన్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం కేజ్రీవాల్ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖలో భారీ అవినీతి జరిగిందని, అందుకు ఈ స్కాం నిదర్శనమంటూ పేర్కొంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




