Robert Vadra: ప్రియాంకా గాంధీ భర్తకు ఈడీ షాక్.. ఆ కేసులో రాబర్ట్ వాద్రాపై ఛార్జ్‌షీట్ దాఖలు..
ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. గుర్‌గ్రామ్ భూముల కొనుగోలు కేసులో ఈ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసింది. 3.53 ఎకరాల భూమిని అక్రమంగా కొనుగోలు చేశారని వాద్రాపై అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో రాబర్ట్ వాద్రాను 18 గంటల పాటు ఈడీ విచారించింది.

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ షాక్ ఇచ్చింది. గుర్‌గ్రామ్ భూముల కొనుగోలు కేసులో వాద్రాపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పలుసార్లు వాద్రాను విచారించిన ఈడీ.. ఎట్టకేలకు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2008లో గురుగ్రామ్‌లోని శికోపుర్ ఏరియాలో జరిగిన ల్యాండ్ డీల్ కేసులో ఈ ఛార్జ్‌షీట్ దాఖలైంది. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీ సుమారు 3.53 ఎకరాల స్థలాన్ని వేరే సంస్థ నుంచి కేవలం 7.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆ భూమిని తర్వాత డీఎల్ఎఫ్ కంపెనీకి సుమారు రూ.58 కోట్లకు అమ్మేసింది. ఎటువంటి డెవలప్‌మెంట్ చేపట్టకుండానే ఎక్కువ ధరకు ఆ భూమిని అమ్మేశారు. అక్రమ మార్గంలో రాబర్ట్ వాద్రా 50 కోట్లు లాభం పొందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో 18 గంటల పాటు ఆయన్ని ఈడీ విచారించింది.
హర్యానాలో హూడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ ల్యాండ్ డీల్ జరిగింది. 2012లో అశోక్ ఖేమ్కా అనే ఆఫీసర్ ఆ ల్యాండ్ ముటేషన్‌ను రద్దు చేయడంతో ఈ కేసు బయటకువచ్చింది. ఈ కేసుకు సంబంధించి 2018లో వాద్రాపై ఎఫ్ఐర్ నమోదైంది. వాద్రాతో పాటు అప్పటి హర్యానా సీఎం భూపేందర్ సింగ్ హుడా సహా డీఎల్ఎఫ్ కంపెనీలను ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. ఈ కేసును కక్షపూరితంగా పెట్టారని.. భూమికి సంబంధించి ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని వాద్రా చెప్పారు. గాంధీ కుటుంబ వ్యక్తిని కావడం వల్లే అక్రమకేసును నమోదు చేశారని ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




