AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DRAUPADI MURMU: ద్రౌపది ముర్ము విజయం లాంఛనమే.. నామినేషన్ పర్వంలోనే ఆధిక్యం చాటిన ఎన్డీయే అభ్యర్థిని.. యశ్వంత్ వ్యాఖ్యలు ఆసక్తికరం

విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను గిరిజనేత నేతను అయినప్పటికీ గిరిజన వర్గాల అభ్యున్నతికి తాను చేసినంత కృషి అదే సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము చేయలేదని యశ్వంత్ కామెంట్ చేశారు. తన పొలిటికల్ కెరీర్‌ను...

DRAUPADI MURMU: ద్రౌపది ముర్ము విజయం లాంఛనమే.. నామినేషన్ పర్వంలోనే ఆధిక్యం చాటిన ఎన్డీయే అభ్యర్థిని.. యశ్వంత్ వ్యాఖ్యలు ఆసక్తికరం
2022 Indian presidential election
Rajesh Sharma
|

Updated on: Jun 24, 2022 | 6:05 PM

Share

DRAUPADI MURMU WIN OBVIOUS AS NDA CANDIDATE SHOWS STRENGTH WHILE NOMINATION FILING: ద్రౌపది ముర్ము, ఒడిశా(Odisha)కు చెందిన గిరిజన మహిళ. టీచర్ ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి వచ్చిన 25 ఏళ్ళలోనే దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతిగా ఎన్నిక కాబోతున్నారు. ఆమె విజయం లాంఛనమేనని నామినేషన్ దాఖలు చేసిన ఘట్టం చూస్తేనే క్లారిటీ వచ్చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi), కేంద్ర హోం, రక్షణ మంత్రులు అమిత్ షా(Amit Shah), రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)ల సమక్షంలో జూన్ 24వ తేదీన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, ఎన్డీయే పక్షాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. సాధారణంగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత రాష్ట్రపతి అభ్యర్థులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పర్యటించి.. అక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేను కలిసి మద్దతు కోరతారు. కానీ ద్రౌపది ముర్ము నామినేషన్ ఘట్టానికే అటు ఆమె సొంత రాష్ట్రానికి చెందిన బీజూ జనతాదళ్(Biju Janata Dal) పార్టీ తరపున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ వైసీపీ తరపున ఎంపీ విజయసాయిరెడ్డి(MP Vijay Sai Reddy) హాజరయ్యారు. ఈ రెండు పార్టీల మద్దతు చాలు ద్రౌపది ముర్ము విజయానికి. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయే(NDA) కూటమికి కావాల్సిన మెజారిటీకి కేవలం 1.2 శాతం ఓట్లే తక్కువగా వున్నాయి. వైసీపీ, బీజూ జనతాదళ్ పార్టీలు నామినేషన్ ఘట్టానికే హాజరయ్యారు. నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. సో.. ఈ రెండు పార్టీల సహకారంతో ఎన్డీయే అభ్యర్థిని ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికవడం ఇక లాంఛనమేనని తేలిపోయింది. మరోవైపు మహారాష్ట్ర(Maharashtra)లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం సైతం ఎన్డీయే అభ్యర్థినికి లాభించే సంకేతాలున్నాయి. ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) పట్టుదల కొనసాగి, అక్కడ అధికారం చేతులు మారితే.. శివసేన రెబల్ వర్గం పూర్తిగా ఎన్డీయే అభ్యర్థినికే మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. వారి మద్దతు కూడా లభిస్తే.. కాస్త అటూఇటూగా 60 శాతం ఓట్లతో ద్రౌపది ముర్ము విజయం సాధిస్తారు. జులై 25వ తేదీన దేశానికి 15వ రాష్ట్రపతిగా ఆమె పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.

నామినేషన్ దాఖలు చేయడానికి ఒక రోజు ముందే న్యూఢిల్లీకి చేరుకున్న ద్రౌపది ముర్ము.. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నివాసానికి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యారు. తనను దేశ అత్యున్నత పదవికి ఎంపిక చేసినందుకు ఆమె మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Vice President Venkaiah Naidu)ని, హోం మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు ద్రౌపది. జూన్ 24న ఉదయం నామినేషన్ దాఖలు చేసేందుకు పార్లమెంటుకు చేరుకున్న ద్రౌపది.. ముందుగా మహాత్మా గాంధీ (Mahatma Gandhi), అంబేద్కర్ (Ambedkar) విగ్రహాలకు నివాళులు అర్పించారు. నామినేషన్ ఘట్టం పూర్తైన తర్వాత ద్రౌపది ముర్ము వివిధ రాష్ట్రాలలో తాను జరపతలపెట్టిన పర్యటనపై కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రాల పర్యటన షెడ్యూలు జులై 1వ తేదీన మొదలవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె పర్యటనను కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి (G Kishan Reddy), గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhavat) పర్యవేక్షించనున్నారు. ఆమె నామినేషన్ దాఖలు వ్యవహారంతోపాటు ఎన్నికకు సంబంధించిన అంశాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) చూసుకుంటున్నారు. అయితే మొదటి ఉత్తరాది రాష్ట్రాలలో ద్రౌపది పర్యటించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముందుగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh), బీహార్ (Bihar) రాష్ట్రాలలో ఆమె పర్యటిస్తారని తెలుస్తోంది. చత్తీస్‌గఢ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు, ఉత్తరాఖండ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను యుపీ రాజధాని లక్నోకు, ఝార్ఖండ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను బీహార్ రాజధాని పాట్నాకు రప్పించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే తరహాలో ద్రౌపదికి మద్దతిచ్చే సభ్యులు తక్కువగా వున్న రాష్ట్రాలకు ఆమె నేరుగా వెళ్ళకుండా వారికి పొరుగున ఉన్న రాష్ట్రాలకు వారిని రప్పించి మద్దతు కోరతారని అంటున్నారు. తెలంగాణలో ఇప్పటికి ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 7 మాత్రమే. బీజేపీకి నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు వున్న విషయం తెలిసిందే. అటు తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేసే అవకాశాలు లేవు. ఈ రెండు పార్టీలు ఇప్పటికింకా తమ వైఖరిని వెల్లడించనప్పటికీ.. వారికి బీజేపీతో ఉప్పు-నిప్పులా వున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలు యశ్వంత్ సిన్హాకే ఓటేస్తాయని భావిస్తున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే అధికార వైసీపీ ఎన్డీయే అభ్యర్థికే మద్దతు ప్రకటించింది. ఆమె నామినేషన్ పర్వానికి హాజరైంది. ఇక అక్కడ అత్తెసరు ఓట్లున్న టీడీపీ (TDP) వైఖరి ఇంకా తేలలేదు. ఏపీలో టీడీపీకి ముగ్గురు లోక్‌సభసభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు, 19 మంది ఎమ్మెల్యేలు వున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు విపక్ష కూటమి నిర్వహించిన రెండు సమావేశాలకు టీడీపీకి అహ్వానం అందలేదు. విపక్ష కూటమి నుంచి ఆహ్వానం అందిన వైసీపీ.. ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. మరి చంద్రబాబు నాయుడు వైఖరి ఎలా వుంటుందన్నది ఒకింత ఆసక్తిరేకెత్తిస్తోంది.

అయితే, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను గిరిజనేత నేతను అయినప్పటికీ గిరిజన వర్గాల అభ్యున్నతికి తాను చేసినంత కృషి అదే సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము చేయలేదని యశ్వంత్ కామెంట్ చేశారు. తన పొలిటికల్ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా మంది మద్దతునిస్తున్నారని, క్రాస్ ఓటింగ్ జరిగి తానే రాష్ట్రపతిగా విజయం సాధిస్తానని యశ్వంత్ అంటున్నారు. జూన్ 27వ తేదీన నామినేషన్ వేసేందుకు యశ్వంత్ సిన్హా రెడీ అవుతున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన సొంత రాష్ట్రం బీహార్ నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అయితే.. తనను విపక్ష కూటమి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత యశ్వంత్.. కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలిచ్చారు. సాధారణ ఎన్నికల మాదిరిగా ప్రత్యర్థిపై ఆరోపణలు, విమర్శలు గుప్పించి సవాళ్ళు విసిరారు. ద్రౌపది ముర్ము తాను పదవుల్లో వున్నప్పుడు గిరిజనులకు ఎలాంటి మేలు చేశారని ఆయన నిలదీశారు. తనదైన ప్రత్యేక వ్యూహంలో ఎన్డీయే ఓట్లను చీల్చి.. విజయం సాధిస్తానని యశ్వంత్ ధీమా వ్యక్తం చేయడం విశేషం. పనిలోపనిగా తనను బయటకు సాగనంపిన బీజేపీ అధినాయకత్వంపై కూడా యశ్వంత్ విరుచుకుపడ్డారు. వాజ్‌పేయి (Vajpai) కాలంనాటి బీజేపీకి, మోదీ కాలంనాటి బీజేపీకి చాలా వ్యత్యాసం వుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఎన్డీయే అభ్యర్థివైపు ఎక్కువ పార్టీలున్నట్లు కనిపిస్తున్నా.. త్వరలోనే పరిస్థితి మారి, తనకు అనుకూలంగా పరిణమించబోతోందని యశ్వంత్ చెబుతున్నారు. యశ్వంత్ వ్యాఖ్యల్లో వాస్తవం వుందా లేదా అనేది త్వరలోనే తేటతెల్లం కానున్నది.