ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం.. వర్షం ఇచ్చిన ఊరటకు దీపావళి టపాసులు బ్రేక్

వీటితో పాటు 'ఆడ్-ఈవెన్' విధానాన్ని అమలు చేయాలని భావించినప్పటికీ.. ఈ విధానం ద్వారా కాలుష్యం తగ్గినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల న్యాయస్థానం తప్పుబట్టింది. అయితే వర్షం కాలుష్యాన్ని తగ్గిస్తుంది కాబట్టి కృత్రిమంగా వర్షం కురిపించి వాయుకాలుష్యం స్థాయులను తగ్గించాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సుప్రీంకోర్టును అనుమతితో పాటు.. కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరింది.

ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం.. వర్షం ఇచ్చిన ఊరటకు దీపావళి టపాసులు బ్రేక్
Delhi Air Crisis
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 13, 2023 | 12:42 PM

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయుకాలుష్యం నుంచి వర్షం ఉపశమనం కలిగించిందని సంతోషపడేలోపే మళ్లీ కాలుష్యం స్థాయులు పెరిగాయి. వాయు కాలుష్యాన్ని మరింత పెంచే ప్రమాదకర రసాయనాలతో కూడిన బాణాసంచాపై సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధించినా సరే.. నగరంలో ఎక్కడికక్కడ టపాసుల విక్రయాలు, కొనుగోళ్లు, వినియోగం యదేచ్ఛగా సాగాయి. ఫలితంగా వాయుకాలుష్యం మళ్లీ పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షం కురిపించే యత్నాలను ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. సుప్రీంకోర్టుకు అందజేసిన అఫిడవిట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వం, కృత్రిమ వర్షంతో కాలుష్యాన్ని కట్టడి చేయాలని చూస్తోంది.

ఢిల్లీ గాలి విషపూరితం..

ఢిల్లీ సహా ఉత్తరాదిన అనేక నగరాలను శీతాకాలంలో తీవ్రమైన వాయుకాలుష్యం వేధిస్తోంది. ప్రకృతిపరంగా ఎదురయ్యే పరిస్థితులకు మానవ తప్పిదాలు తోడై నానాటికీ వాయుకాలుష్యం స్థాయిలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. పంజాబ్, హర్యానా సహా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ పంట ముగిసిన తర్వాత పంటవ్యర్థాలను తగులబెట్టడం వల్ల పరిస్థితి మరింత జఠిలంగా మారుతోంది. పంటవ్యర్థాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను ఆశ్రయించాలంటూ అటు సుప్రీంకోర్టు, ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి ఆచరణకు నోచుకోవడం లేదు. పంటవ్యర్థాలను కాల్చడం హత్యతో సమానం అంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసినా సరే.. పరిస్థితిలో ఇప్పటికిప్పుడు మార్పు వచ్చే అవకాశం లేదు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. దీపావళి పర్వదినం సందర్భంగా వినియోగించే బాణాసంచా ఢిల్లీ గాలిని మరింత విషతుల్యంగా మార్చుతోంది. ఈమధ్య కాలంలో చైనా నుంచి అక్రమమార్గాల్లో దిగుమతి చేసుకుంటున్న టపాసుల్లో అత్యంత ప్రాణాంతక రసాయన మిశ్రమాలున్నాయని అనేక అధ్యయన నివేదికలు తేల్చాయి. ఈ సందర్భంగా తొలుత చైనా టపాసులపై, ఆ తర్వాత కాలుష్యాన్ని వెదజల్లే టపాసులపై న్యాయస్థానం నిషేధం విధిస్తూ వచ్చింది. గ్రీన్ క్రాకర్స్ పేరుతో కాలుష్యాన్ని వెదజల్లని టపాసులకు మినహాయింపునిచ్చింది. ఈ ముసుగులో వ్యాపారుల నుంచి వినియోగదారులు కాలుష్యకారక టపాసులను వినియోగించి కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నారు.

దీపావళి తర్వాత ఢిల్లీలో…

ఢిల్లీలో సూర్యోదయాన్ని సైతం అడ్డుకునేస్థాయిలో వాయుకాలుష్యం, పొగమంచు కలిసిపోయాయి. శీతాకాలంలో పొగమంచు ఏర్పడడం సహజమే. కానీ వాయుకాలుష్యం అందులో కలిసిపోయి ‘విజిబిలిటీ’ని సైతం ప్రభావం చేస్తుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ఏర్పాటు చేసిన మీటర్ల ప్రకారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) మళ్లీ పూర్ క్వాలిటీకి చేరుకుంది. గత ఏడాదితో పోల్చితే ఈసారి బాణాసంచా వినియోగం చాలా వరకు తగ్గినప్పటికీ.. ప్రజలు చాలా చోట్ల టపాసులు కాల్చారు. నగరంలో టపాసుల మోత అర్థరాత్రి వరకు వినిపించింది. దీంతో ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియల్ పరిధిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) దాదాపు 300కు చేరుకుంది. ఆనంద్ విహార్ వద్ద 296, ఆర్కేపురం వద్ద 290, ఐటీవో వద్ద 263 పాయింట్లు నమోదైంది. అక్టోబర్ నెల నుంచే ఢిల్లీలో కాలుష్యం స్థాయులు పెరుగుతూ వచ్చాయి. పర్టిక్యులేట్ మ్యాటర్ (P.M 2.5) స్థాయులు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కంటే 20 రెట్లు అధికంగా ఉన్నాయి. ఈ కారణంగానే ఢిల్లీ పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కాలుష్యకారక వాహనాలు, భవన నిర్మాణ పనులపై నిషేధం విధించింది. స్మాగ్ గన్లు (నీటిని తుంపరగా మార్చి వెదజల్లే యంత్రాలు) వినియోగిస్తూ వాయుకాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది.

వీటితో పాటు ‘ఆడ్-ఈవెన్’ విధానాన్ని అమలు చేయాలని భావించినప్పటికీ.. ఈ విధానం ద్వారా కాలుష్యం తగ్గినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల న్యాయస్థానం తప్పుబట్టింది. అయితే వర్షం కాలుష్యాన్ని తగ్గిస్తుంది కాబట్టి కృత్రిమంగా వర్షం కురిపించి వాయుకాలుష్యం స్థాయులను తగ్గించాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సుప్రీంకోర్టును అనుమతితో పాటు.. కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..