Digvijay Singh Comments: ఆర్టికల్ 370 అంశాన్ని మళ్ళీ లేవనెత్తిన డిగ్గీరాజా.. రీవోక్ చేస్తామంటూ ట్వీట్.. రాజకీయ దుమారం

కాంగ్రెస్ పార్టీలో నేతలకున్నంత స్వేచ్ఛ మరే పార్టీలోను వుండదేమో. కాంగ్రెస్ నేతలు పార్టీ స్టాండ్ ఏదైనా తమ సొంత అభిప్రాయాలను వెల్లడించేందుకు వెనుకాడరు. అంతటి స్వేచ్ఛ వుందా పార్టీలో...

Digvijay Singh Comments: ఆర్టికల్ 370 అంశాన్ని మళ్ళీ లేవనెత్తిన డిగ్గీరాజా.. రీవోక్ చేస్తామంటూ ట్వీట్.. రాజకీయ దుమారం
Artical 370
Follow us
Rajesh Sharma

|

Updated on: Jun 13, 2021 | 7:03 PM

Digvijay Singh Comments on article 370 political uproar: కాంగ్రెస్ పార్టీలో నేతలకున్నంత స్వేచ్ఛ మరే పార్టీలోను వుండదేమో. కాంగ్రెస్ నేతలు పార్టీ స్టాండ్ ఏదైనా తమ సొంత అభిప్రాయాలను వెల్లడించేందుకు వెనుకాడరు. అంతటి స్వేచ్ఛ వుందా పార్టీలో. ఈ విషయం జాతీయ స్థాయిలోను వర్తిస్తుందని నిరూపించారు మధ్యప్రదేశ్ డిగ్గీ రాజా దిగ్విజయ్ సింగ్. రెండేళ్ళ క్రితం అత్యంత పక్కా ప్రణాళికతో సుదీర్ఘ సమస్యకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముగింపు పలికితే.. ఆ సమస్యను తిరగదోడతామంటూ డిగ్గీరాజా ప్రకటనలిస్తున్నారు. ఈ వైఖరి సొంతపార్టీకే ఇబ్బందికరంగా మారినా ఆయన తన వైఖరి మార్చుకోలేదు సరికదా తనను విమర్శిస్తున్న వారిపై ఎదురు దాడికి దిగుతున్నారు.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కశ్మీర్ తేనెతుట్టెను కదిపేందుకు రెడీ అవుతున్నారు. 2019 ఆగస్టు 5న పార్లమెంటు వేదికగా చిరకాలంగా సమస్య  ఆర్టికల్ 370కి చరమగీతం పాడింది మోదీ ప్రభుత్వం. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ.. కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది ప్రభుత్వం. ఇందులో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం కాగా.. లద్ధాక్ ఎల్జీ పాలనలో కొనసాగే యూనియన్ టెర్రిటరీగా మారింది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్‌లో హింస .. 80 శాతం తగ్గింది. లద్ధాక్ అయితే పర్యాటక కేంద్రంగా మారేందుకు అన్ని హంగులు సంతరించుకుంటోంది. కరోనా వైరస్ దేశంలోకి రాకపోతే.. ఈపాటికి లద్ధాక్ పర్యాటకుల స్వర్గధామంగా మారిపోయేది.

ఇదంతా ఓవైపుంటే.. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాత్రం ఆర్టికల్ 370ని తిరిగి అమల్లోకి తెచ్చే అంశాన్ని పరిశీలించాలని తమ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే.. ఈ విషయాన్ని పరిశీలించాలంటున్నారు. అయితే.. దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. దిగ్విజయ్ సింగ్ ఓ పాకిస్తానీ జర్నలిస్టుతో మాట్లాడారని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు.. ఓ క్లబ్ హౌజ్‌లో జరిగిన సంభాషణను బహిర్గతం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయ్యాయి. దిగ్విజయ్ కామెంట్లపై సోనియా, రాహుల్ గాంధీలు స్పందించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. తన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగినా డిగ్గీ రాజా వెనక్కి తగ్గలేదు. కమల నాథులు అఙ్ఞానంతో కొట్టుకు చస్తున్నారంటూ మరో ట్వీట్ చేశారు.

ఇదిలా వుంటే.. దిగ్విజయ్ సింగ్‌కు పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేయడం అలవాటేనని ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. ఎంపీ బీజేపీ నేతలు డిగ్గీరాజా ఫోన్ కాల్స్‌ను జాతీయ దర్యాప్తు సంస్థచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన జితిన్ ప్రసాద్ కూడా తన మాజీ సహచరుని వ్యాఖ్యలను తప్పుపట్టారు. పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేయడం దిగ్విజయ్ సింగ్‌కు అలవాటేనని ఆయనన్నారు. పాకిస్తాన్‌ని ఓడించి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీని సైతం విమర్శించేందుకు దిగ్విజయ్ సింగ్ వెనుకాడరని జితిన్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇదిలా వుంటే.. ఆర్టికల్ 370 విషయంలో తమ విధానం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చేసిన తీర్మానం మేరకే వుంటుందని కాంగ్రెస్ చిన్న వివరణతో సరిపెట్టింది.

ALSO READ: జీ7 దేశాలను డ్రాగన్ వార్నింగ్.. చిన్న కూటములతో ప్రపంచాన్ని నిర్దేశించలేరన్న చైనా