AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 2026 ఆవిష్కరణ

న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక మేళా–2026 ఘనంగా ప్రారంభమైంది. “భారతీయ సైనిక చరిత్ర: శౌర్యం & వివేకం @ 75” థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ మేళాలో.. 1857 స్వాతంత్ర్య సమరానికి చెందిన మరచిపోయిన అధ్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ‘కుడోపాలి గాథ’ పుస్తకం 13 భాషల్లో ఆవిష్కరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం భారత పఠన సంస్కృతికి కొత్త ఊపునిచ్చింది.

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 2026 ఆవిష్కరణ
Dharmendra Pradhan at New Delhi World Book Fair 2026
Ram Naramaneni
|

Updated on: Jan 10, 2026 | 5:54 PM

Share

ప్రపంచంలోనే అతిపెద్ద బీ2సీ (B2C) పుస్తక ప్రదర్శనగా పేరొందిన న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక మేళా–2026 ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కతార్ సాంస్కృతిక శాఖ మంత్రి అబ్దుల్‌రహ్మాన్ బిన్ హమద్ బిన్ జాసిం బిన్ అల్ థానీ, స్పెయిన్ సాంస్కృతిక శాఖ మంత్రి ఎర్నెస్ట్ ఉర్టాసున్ డొమెనెక్ సహా పలువురు విశిష్ట అతిథుల సమక్షంలో ఈ మేళాను ప్రారంభించారు. ఈ ఏడాది పుస్తక మేళాకు “భారతీయ సైనిక చరిత్ర: శౌర్యం & వివేకం @ 75” అనే థీమ్‌ను నిర్ణయించారు. కతార్, స్పెయిన్ వంటి దేశాల భాగస్వామ్యం ఈ సాంస్కృతిక, సాహిత్య వేడుకకు అంతర్జాతీయ ప్రాధాన్యతను మరింత పెంచింది. ప్రపంచ దేశాల ఆలోచనలు, సాహిత్యం, సంస్కృతులు ఒకే వేదికపై కలుసుకునే ఆలోచనల సంగమంగా ఈ మేళా నిలుస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా 1857 స్వాతంత్ర్య సమరానికి సంబంధించిన మరచిపోయిన అధ్యాయాన్ని ఆవిష్కరించే “కుడోపాలి గాథ: 1857 అనుశ్రుత కథ” పుస్తక అనువాదాలను విడుదల చేశారు. ఈ కృతి ఇప్పటికే హిందీ, ఇంగ్లిష్, ఒడియా భాషల్లో వెలువడగా.. తాజాగా బెంగాలీ, అస్సామీ, పంజాబీ, మరాఠీ, మలయాళం, ఉర్దూ సహా 9 భారతీయ భాషల్లోతో పాటు ఒక అంతర్జాతీయ భాష అయిన స్పానిష్‌లో విడుదలైంది. దీంతో ఈ పుస్తకం మొత్తం 13 భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

సంబల్పూర్ ప్రాంతంలోని కుడోపాలి గ్రామంలో జరిగిన పోరాటాన్ని ఆధారంగా చేసుకున్న ఈ గ్రంథం.. వీర సురేంద్ర సాయి, కుడోపాలి అమరవీరులకు సాహిత్య రూపంలో అర్పించిన ఘన నివాళిగా నిలుస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇది భారతదేశ బహుభాషా సంప్రదాయాన్ని, అంతర్జాతీయ సాహిత్య సంభాషణను మరింత బలపరుస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో దేశంలో పఠన సంస్కృతిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చే దిశగా ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ‘వికసిత భారత్’ దృష్టిలో మౌలిక వసతులు, సాంకేతికతతో పాటు ఆలోచించే, చదివే, చైతన్యవంతమైన తరం నిర్మాణమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఇదిలా ఉండగా NDWBF–2026లో స్పెయిన్ దేశపు సాహిత్య, సాంస్కృతిక ప్రపంచాన్ని అన్వేషించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇలాంటి సాంస్కృతిక మార్పిడులు భారత్–స్పెయిన్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పుస్తకాలు, సంస్కృతి, సంభాషణల ద్వారా దేశంలో పఠన సంస్కృతికి కొత్త ఉత్సాహం అందిస్తున్న ఈ మహత్తర కార్యక్రమానికి నేషనల్ బుక్ ట్రస్ట్కు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.