Ayodhya: అయోధ్య రామమందిరంలో చొరబడ్డ కశ్మీరీ వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
అయోధ్య రామమందిరంలో భారీ భద్రతా లోపం బయటపడింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన వ్యక్తి ఆలయంలోకి చొరబడి నమాజ్ చదివే ప్రయత్నం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. వేలాది మంది పోలీసులు, నిఘా కెమెరాల కళ్లు గప్పి అతను లోపలికి ఎలా వెళ్ళాడు? అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, అయోధ్య రామమందిరంలో జమ్ముకశ్మీర్‌కు చెందిన వ్యక్తి చొరబడడం తీవ్ర కలకలం రేపింది. ఆలయంలో నమాజ్ చదివేందుకు ప్రయత్నించిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో అహ్మద్‌షేక్ మతపరమైన నినాదాలు చేశాడు. జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాకు చెందిన అహ్మద్ షేక్ అనే యువకుడు శనివారం ఉదయం రామమందిర సముదాయంలోకి ప్రవేశించాడు. ఆలయ ప్రవేశ ద్వారం D-1 గేట్ గుండా లోపలికి వెళ్లిన అహ్మద్ షేక్, దక్షిణ ప్రాకారాల వద్ద నమాజ్ చేయడానికి యత్నించాడు. అక్కడ ఉన్న భక్తులు, భద్రతా సిబ్బంది దీనిని గమనించి వెంటనే అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో నిందితుడు మతపరమైన నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించాయి.
అరెస్ట్ చేసిన నిందితుడు అహ్మద్ షేక్‌ను అయోధ్య పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. కేవలం ప్రార్థన కోసమే వచ్చాడా? లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఈ ఘటన తర్వాత పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అయోధ్య నగరంలో కశ్మీరీ శాలువాలు, ఇతర వస్తువులు విక్రయిస్తున్న వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అత్యంత హై-సెక్యూరిటీ జోన్‌గా ఉన్న D-1 గేట్ నుంచి నిందితుడు లోపలికి ఎలా ప్రవేశించగలిగాడు? మెటల్ డిటెక్టర్లు, సీసీటీవీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ అతను ప్రార్థన చేసే వరకు ఎవరూ ఎందుకు గుర్తించలేదు? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ప్రస్తుతానికి అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. ఆలయ పరిసరాల్లో సోదాలు ముమ్మరం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
