చిన్నారికి ప్రాణం పోసిన సామాన్యులు, నెలన్నర రోజులలోపే 16 కోట్ల విరాళాల సేకరణ
ఎంత సంపాదిస్తే ఏం లాభం? అవసరానికి ఆదుకునే మనసు లేకపోతే! చేతనైనంత సాయం చేయాలనే సహృదయం ఉండాలి.. అహ్మదాబాద్‌కు చెందిన ఓ చిన్నారి విషయంలో మనలో ఇంకా ఆ మానవత్వం ఉందని రుజువైంది.
ఎంత సంపాదిస్తే ఏం లాభం? అవసరానికి ఆదుకునే మనసు లేకపోతే! చేతనైనంత సాయం చేయాలనే సహృదయం ఉండాలి.. అహ్మదాబాద్‌కు చెందిన ఓ చిన్నారి విషయంలో మనలో ఇంకా ఆ మానవత్వం ఉందని రుజువైంది. ధైర్యరాజ్ సింగ్ రాథోడ్ అనే ఈ బాబు ప్రాణాలు కాపాడేందుకు చాలా మంది ముందుకొచ్చారు. ఆ చిన్నారి వైద్య ఖర్చులు సమకూర్చారు. ఒకటో రెండో లక్షలనుకునేరు. ఏకంగా 16 కోట్ల రూపాయలను తమ మంచి మనసుతో ఇచ్చారు. పాపం ఆ పిల్లోడు పుట్టుకతోనే అత్యంత అరుదైన స్పైనల్ మస్కులార్ ఆంట్రోపీ టైప్-1 అనే వ్యాధి కమ్ముకుంది. ఆ రోగం నుంచి ఆ పిల్లోడిని బయటపడేయడానికి డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు. సరైన సమయంలో వైద్యం అందించలేకపోతే ప్రాణానికి ప్రమాదం అని గ్రహించారు.
నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఈ వ్యాధితో బాధపడేవారు రెండేళ్ల కంటే ఎక్కువ కాలం బతకలేరన్న కఠోర వాస్తవాన్ని పేరంట్స్‌కు వివరించారు. ప్రాణాలు కాపాడాలంటే జోల్ జెన్‌స్మా అనే ఇంజెక్షన్ ఇవ్వాలని, దీనిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి ఉంటుందన్నారు. పైగా ఈ ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. ఈ మాట విన్న తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. అంత డబ్బు ఎక్కడ్నుంచి తేగలరు? ఆస్తులన్నీ అమ్ముకున్నా అంత రాదు.. ఇక బాబును బతికించుకోవడం కష్టమేననుకున్నారు. దేవుడు మీద భారం వేశారు. అయితే దాతలు దేవుడి రూపంలో వచ్చి ఆదుకున్నారు. ఆ ఖరీదైన ఇంజెక్షన్‌కు అవసరమైన 16 కోట్ల రూపాయలను 42 రోజులలో సమకూర్చారు. వైద్యులు ఆ బాబుకు ఇంజెక్షన్ ఇచ్చారు.
ఇప్పుడు బాబు ప్రాణాలు సురక్షితం. అన్నట్టు ఈ విరాళాల సేకరణలో ఇంపాక్ట్ గురు అనే స్వచ్ఛంద సంస్థ కీలక పాత్ర వహించింది. విరాళాలు ఇచ్చింది కోటీశ్వరులు కాదు.. కేవలం సామాన్య ప్రజలే! మొత్తం 2.64 లక్షల మంది విరాళాలిచ్చి తమ చిన్నారి ప్రాణం కాపాడారని, వారి రుణం తీర్చుకోలేనిదని తల్లిదండ్రులు అన్నారు. జోల్‌జెన్‌స్మా అనే ఇంజెక్షన్‌ను అవెక్సిస్ అనే అమెరికా అంకుర సంస్థ డెవలప్ చేసింది. అమెరికాతో పాటు బ్రిటన్‌లో కూడా దీని వినియోగానికి అనుమతి లభించింది. వ్యాధిగ్రస్తుల శరీరంలోకి ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా చచ్చుబడిన ఎస్‌ఎంఎన్1 అనే జన్యువు యాక్టివ్ అవుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. పేరొందిన ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్