ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ 8 గంటల పాటు విచారించింది. ఆ తరువాత సిసోడియాను అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీని రూపొందించడంలో సిసోడియా కీలక పాత్ర పోషించారు. అయితే, స్కామ్‌కి సంబంధించి బ్యూరోక్రాట్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో అధికారులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్టు చేసినట్లు పేర్కొంటున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన సమయం నుంచే లిక్కర్ వ్యాపారులతో మంతనాలు జరిపినట్లు సమాచారం.లిక్కర్ వ్యాపారులు, సౌత్ గ్రూపు నుంచి ముడుపులు తీసుకున్న విజయ్ నాయర్.. ఆ ముడుపుల్లో కొంత భాగం గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్టు చార్జిషీట్లో వెల్లడించారు. సీఎం కేజ్రీవాల్ సైతం ఫేస్ టైమ్‌లో లిక్కర్ సిండికేట్ వ్యాపారులతో మాట్లాడినట్టు దర్యాప్తు సంస్థలు చార్జిషీట్ లో పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త లిక్కర్ పాలసీలో ముడుపుల వ్యవహారంపై సిసోడియాను సీబీఐ గుచ్చిగుచ్చి ప్రశ్నించి.. అదుపులోకి తీసుకుంది. కాగా.. అంతకుముందు సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సిసోడియాను విచారిస్తున్న క్రమంలో ఆప్ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌ను ముట్టడించారు.సీబీఐ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న ఎంపీ సంజయ్‌సింగ్‌తో సహా ఆప్ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి పలు స్టేషన్లకు తరలించారు.
అయితే, సీబీఐ విచారణకు హాజరయ్యే ముందు సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ప్రధాని మోదీ తనను అరెస్ట్ చేయించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. ఏడెనిమిది నెలలు నేను జైల్లో ఉంటా నా గురించి చింతించకండి అని మనీశ్ సిసోడియా అన్నారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరాగా ఆయన లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారణకు హాజరయ్యారు. మీ పోరాటాన్ని కొనసాగించండని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇంట్లో తన భార్య అనారోగ్యం ఉందని, ఆమెను చూసుకోండని విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఫిబ్రవరి 19న విచారణకు రావాలని సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. కాని, ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్ తయారీలో ఉన్నానని, ఒక వారం గడువు కావాలని సిసోడియా కోరడంతో సీబీఐ అంగీకరించింది.
Delhi | CBI arrests Delhi Deputy CM Manish Sisodia in connection with liquor policy case. pic.twitter.com/gFjHPV33ZG
సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు సిసోడియా రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. మరో వైపు సిసోడియా విచారణ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ వరుస ట్వీట్స్ చేసింది. ఒక్క మనీశ్ సిసోడియాను అరెస్టు చేస్తే సత్యం కోసం పోరాటం చేసేందుకు 100 మంది మనీశ్ సిసోడియాలు వస్తారని ఆప్ ట్వీట్ చేసింది. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాను చూసి బీజేపీ భయపడుతోందని ట్వీట్ చేసింది. మరో వైపు తాము గాంధీ అనుచరులమే కాదు భగత్ సింగ్ వారసులం కూడా అని ప్రకటించింది.