AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Metro: దేశంలో కలవరపెడుతున్న మెట్రో ప్రమాదాలు.. ఐదారుగురు మృతి

దేశంలో వరుసగా జరుగుతోన్న మెట్రో ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. ఢిల్లీ.. ముంబై, ఆగ్రా.. ఇలా వరుసగా.. మెట్రో నగరాల్లో.. మెట్రో పనుల్లో జరుగుతున్న ప్రమాదాలు షాకిస్తున్నాయి. ఐదారుగురు ప్రాణాలు కూడా కోల్పోవడం కలచి వేస్తోంది. ఇంతకీ.. ఈ ప్రమాదాలకు కారణాలేంటి?.. వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనల్లో నిర్లక్ష్యమెవరిది?.. కాంట్రాక్టర్లదా?.. అధికార యంత్రాంగానిదా?..

Metro: దేశంలో కలవరపెడుతున్న మెట్రో ప్రమాదాలు.. ఐదారుగురు మృతి
Metro
Ravi Kiran
|

Updated on: Feb 15, 2026 | 1:29 PM

Share

ముంబై ముల్లుంద్‌ వెస్ట్‌లో నిర్మాణంలో ఉన్న మెట్రో స్టేషన్‌ పిల్లర్‌ కూలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై ఒక్కసారిగా పిల్లర్‌ కూలడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో వెళ్తున్న నలుగురికి తీవ్ర గాయాలవగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుడ్ని రాంధన్‌యాదవ్‌గా.. గాయపడ్డవారు కూడా అతని కుటుంబానికే చెందినవారిగా గుర్తించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని బీఎంసీ అధికారులు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. ఈ మేరకు MMRDA హైలెవెల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఘటనాస్థలాన్ని ముంబై మేయర్‌ రీతా తావ్డే పరిశీలించారు. ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా మెట్రో నిర్మాణ పనుల్లోనూ ప్రమాదం జరిగింది. డ్రిల్లింగ్‌ మిషన్‌ క్రేన్‌.. పక్కనే ఉన్న భవనాలపై కూలింది. ఈ ప్రమాదంలో లిక్కర్‌ షాప్‌తోపాటు.. ఓ ఇల్లు కూడా ధ్వంసమైంది. అయితే.. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా క్రేన్‌ కూలినట్లు తెలుస్తోంది. మెట్రో అధికారులు ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ నెల 5న దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల నిర్లక్ష్యానికి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీ జనక్‌పురి ప్రాంతంలో జలమండలి అధికారులు.. నడిరోడ్డుపై స్విమ్మింగ్‌పూల్‌ సైజ్‌లో గొయ్యి తవ్వి వదిలేశారు. బైక్‌పై స్పీడ్‌గా వచ్చిన యువకుడు గొయ్యిలో పడిపోవడంతో స్పాట్‌లో చనిపోయాడు. యువకుడ్ని HDFC బ్యాంక్ రోహిణి బ్రాంచ్‌లో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్‌ కమల్‌గా గుర్తించారు. ఈ ఘటన ఢిల్లీలో సంచలనం రేపింది. బీజేపీ సర్కార్‌ నిర్లక్ష్యంతోనే యువకుడు చనిపోయాడని ఆప్‌ నేతలు ఆరోపించారు. ఢిల్లీలో తరచుగా ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నప్పటికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మరోవైపు.. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ముగ్గురు జలమండలి అధికారులపై వేటు వేసింది. కాంట్రాక్టర్లతో పాటు ముగ్గురు ఇంజనీర్లపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు.

అంతకుముందు.. గత నెలలో ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలోని ఢిల్లీ మెట్రో సిబ్బంది క్వార్టర్స్ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. వీరిలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్ కూడా ఉన్నారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మొత్తంగా.. దేశంలోని మెట్రోల్లో వరుస ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆయా ఘటనల్లో అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.