మిమ్మల్ని కోటీశ్వరులను చేసే 115 ఏళ్ల నాటి రహస్యం.. డబ్బు మీ వెంట పడాలంటే ఇలా చేయండి..
మనం రోజూ డబ్బు వెంట పరుగెడుతుంటాం.. కానీ ఆ డబ్బే మన దగ్గరికి వచ్చేలా చేసే ఒక సూత్రం ఉందని మీకు తెలుసా? వాలెస్ డి. వాటిల్స్ రాసిన ది సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్ కేవలం ఒక పుస్తకం కాదు, అది కోటీశ్వరుల తయారీ ఫ్యాక్టరీ. ధనవంతులు కావడం అనేది మీ ప్రాథమిక హక్కు అని, అది మీ చేతుల్లోనే ఉందని ఈ పుస్తకం నొక్కి చెబుతోంది.

డబ్బు సంపాదించడం ఒక కళ అని మనకు తెలుసు.. కానీ అది ఒక సైన్స్ అని మీకు తెలుసా..? దాదాపు 115 ఏళ్ల క్రితమేవాలెస్ డి. వాటిల్స్ రాసిన “ది సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్” అనే పుస్తకం నేడు మళ్లీ సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ ది సీక్రెట్ పుస్తకానికి మాతృక అయిన ఈ గ్రంథం.. సంపద పట్ల మనకున్న పాత ఆలోచనలను పూర్తిగా మార్చేస్తోంది. పుస్తకం పేరులో సైన్స్ ఉన్నప్పటికీ.. ఇది ల్యాబ్‌లో చేసే ప్రయోగాం కాదు. ఇదొక ఆధ్యాత్మిక, మానసిక ప్రక్రియ. 100 ఏళ్లకు పూర్వమే చెప్పిన విషయాలు నేటికీ 100 శాతం వర్తిస్తాయంటే ఈ పుస్తకం ఎంత పవర్‌ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. ఇందులోని పదాల కంటే ఆ పదాల వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటేనే కోటీశ్వరులు అయ్యే మార్గం దొరుకుతుందని రచయిత వాట్లెస్ చెబుతారు.
సంపద పరిమితం కాదు.. అనంతం
మనలో చాలామంది డబ్బు అందరి దగ్గర ఉండదు.. ఒకరు ధనవంతులు కావాలంటే మరొకరు పేదవారు కావాలి అని నమ్ముతుంటారు. కానీ రచయిత దీనిని కొట్టిపారేశారు. విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరులు ఎవరి దగ్గరా డబ్బు తీసుకోలేదు. వారు ఉనికిలో లేని ఒక సరికొత్త వస్తువును సృష్టించారు. తద్వారా ప్రపంచానికి విలువను అందించారు. ధనవంతులు కావడం అంటే మరొకరి వద్ద ఉన్న దాన్ని లాక్కోవడం కాదు.. ఉనికిలో లేనిదాన్ని సృష్టించడం. ఈ విశ్వంలో సంపద అనంతమైన ఆకాశం వంటిది. ఇక్కడ అందరికీ సీట్లు ఉంటాయి, ఎవరైనా ఎంతైనా ఎగరవచ్చు.
పోటీ వద్దు.. సృజనాత్మకత ముద్దు
ఒక ముక్క రొట్టె కోసం పదిమంది కొట్టుకోవడం కాదు.. పదిమందికి సరిపడా రొట్టెలను తయారు చేయడమే నిజమైన సంపద సృష్టి. మీరు గొప్ప ఆవిష్కర్తలను చూస్తే, వారు ఉనికిలో లేని పరిష్కారాలను కనిపెట్టడం ద్వారానే లక్షాధికారులయ్యారు. పోటీ పడే మనస్తత్వం కంటే సృజనాత్మకంగా ఆలోచించే మనస్తత్వమే మిమ్మల్ని సంపన్నులను చేస్తుంది.
ధనవంతులు కావడం మీ జన్మహక్కు
ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికీ సంపూర్ణ శ్రేయస్సుతో, సంపదతో జీవించే హక్కు ఉంది. నేను ధనవంతుడిని కాగలను అనే నమ్మకం మీ మనస్సులో బలంగా పాతుకుపోతే.. సగం విజయం సాధించినట్లే. ఈ 100 ఏళ్ల నాటి రహస్యాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే, ఆర్థిక ఇబ్బందులు తొలగి శ్రేయస్సు లభించడం ఖాయం.
