Delhi Liquor Scam: పాలసీ తయారీలో ఆయనదే కీలకపాత్ర.. విజయ్‌నాయర్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. నిందితులను మరో ఐదు రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించనుంది. ఇప్పటికే కీలక విషయాలు సేకరించిన ఈడీ..మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు రెడీ అయ్యింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరింత వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో కీలక నిందితులైనా అభిషేక్ బోయినపల్లి, విజయ్‌నాయర్‌లకు మరో ఐదు రోజులపాటు కస్టడీకి ఇస్తూ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 14న ఇచ్చిన ఐదు రోజుల గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో అభిషేక్ బోయినపల్లి, విజయ్‌నాయర్‌లను ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత మళ్లీ కస్టడీకి అనుమతిస్తూ, తదుపరి విచారణ ఈనెల 24కి వాయిదా వేసింది కోర్టు.
ఢిల్లీ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఓఎస్డీగా పరిచయం చేసుకున్న విజయ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కీలక అంశాలను వెల్లడించింది. ఢిల్లీ పెద్దలకు 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చింది విజయ్‌నాయరే అని ఈడీ స్పష్టం చేసింది. ఆప్ మంత్రి కైలాష్ గెహ్లాట్ నివాసంలోనే విజయ్‌నాయర్ బస చేశారని, ఢిల్లీ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఓఎస్డీగా అధికారులకు విజయ్‌నాయర్ పరిచయం చేసుకున్నారని ఈడీ తెలిపింది. ఆప్ మీడియా సెల్ ఇన్‌చార్జ్‌గా ఉన్న విజయ్‌నాయర్ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారని ఈడీ పేర్కొంది.
అభిషేక్,విజయ్ కలిసి ప్రభుత్వపెద్దలకు లంచాలు
హోల్‌సెలర్ల నుంచి డబ్బులు వసూలు చేసి అభిషేక్ బోయిన్‌పల్లి, విజయ్‌నాయర్‌లు కలిసి ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది ఈడీ. అంతేకాదు వీళ్లిద్దరే ప్రభుత్వంలోని పెద్దలకు 30 కోట్ల వరకు చెల్లించారని వెల్లడించింది. విజయ్‌నాయర్ ఎక్సైజ్ పాలసీని తమ వారికి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడని, పాలసీ తయారీకి 2 నెలల ముందే విజయ్‌నాయర్ చేతుల్లోకి వచ్చేసిందని ఈడీ తెలిపింది.
మరికొందరికి ఈడీ నోటీసులు పంపే ఛాన్స్
నిందితులకు మరోసారి కస్టడీతో లిక్కర్ స్కామ్‌లో ఈడీ మరిన్ని వివరాలు రాబట్టే ఛాన్స్ ఉంది. అభిషేక్, విజయ్‌నాయర్ వెనుక ఉన్న పెద్దలెవరనే దానిపైనే తదుపరి ఎంక్వైరీ కొనసాగనుంది. దాంతో మరికొందరికి ఈడీ నోటీసులు పంపే అవకాశం ఉందనే సమాచారం బడాబాబులను ఉలిక్కిపడేలా చేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం