Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Polls 2025: నీరు, విషం, మద్యం.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కీలక అంశాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం చివరి ఘట్టానికి చేరింది. మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో నీరు, విషం, మద్యంతో పాటు ఉచిత హామీలు, శీష్ మహాల్ అంశాలు కీలకంగా మారాయి. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించి.. 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Delhi Polls 2025: నీరు, విషం, మద్యం.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కీలక అంశాలు
Delhi Assembly Elections 2025
Follow us
Janardhan Veluru

| Edited By: TV9 Telugu

Updated on: Jan 31, 2025 | 1:01 PM

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం చివరి అంకానికి చేరింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌‌ల అభ్యర్థులు, నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరనున్న ఎన్నికల్లో 699 మంది అభ్యర్తులు బరిలో నిలుస్తున్నారు. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొనగా.. కొన్ని స్థానాల్లో స్వతంత్రులు గట్టి పోటీ ఇస్తున్నారు. ఓటర్ల మూడ్‌ను నిర్ణయించేది కావడంతో మూడు ప్రధాన పార్టీలు చివరి రౌండ్‌ ప్రచారాన్ని అత్యంత కీలకంగా భావిస్తున్నాయి.

ప్రచారంలో నీరు, విషం..

ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని యమునా నదిలో విషం కలుపుతున్నారని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం మొదలైంది. దీనిపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. హర్యానా ప్రజలు దేశభక్తులని, వారిపై ఇలాంటి ఆరోపణలు సరికాదని ప్రధాని అన్నారు. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.. దీనిపై వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. మొత్తానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నీరు, విషం అంశాలు కీలకంగా మారాయి.

ప్రచారంలో మద్యం అంశం

మద్యం అంశం కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాంశంగా మారింది. లిక్కర్ స్కామ్‌ను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తొలిసారిగా ఆమ్‌ ఆద్మీ పార్టీని ఇరుకున పెట్టారు. పట్‌పర్‌గంజ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ చౌదరి తరపున ప్రచారానికి వచ్చిన రాహుల్.. మద్యం కుంభకోణానికి మనీష్ సిసోడియా సూత్రధారి అంటూ ధ్వజమెత్తారు. అరవింద్ కేజ్రీవాల్‌ను కార్నర్ చేసిన అర్వింద్ కేజ్రివాల్.. శీష్‌ మహల్‌లో నివసించే వారికి ప్రజల కష్టాలు కనిపించడం లేదన్నారు. ప్రధాని మోదీ, కేజ్రీవాల్‌ దొందూ దొందే అన్నారు. అద్దాల మేడల్లో ఉంటున్న వారు ఇతరుల ఇళ్లపై రాళ్లు రువ్వుతున్నారంటూ ఆప్ కౌంటర్ ఇచ్చింది. శీష్ మహల్ ను ప్రధాని నరేంద్ర మోదీ కూడా టార్గెట్ చేశారు. మురికివాడలను ప్యాలెస్‌లుగా మారుస్తామంటూ అధికారంలోకి వచ్చిన వారు అద్దాల ప్యాలెస్‌లో నివసిస్తున్నారంటూ అర్వింద్ కేజ్రివాల్‌ను టార్గెట్ చేశారు.

ప్రచారంలో ఉచిత హామీలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వినిపిస్తున్న మరో కీలక అంశం ఉచిత హామీలు. ఢిల్లీ ప్రజలకు 15 హామీలను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఆప్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఈ హామీల గురించి చెబుతున్నారు. ఆ పార్టీకి చెందిన బడా నాయకులు కూడా హామీలను ప్రస్తావిస్తూ ఓట్లు అడుగుతున్నారు.

పట్పర్‌గంజ్ ర్యాలీలో ప్రధాని మోదీ కూడా హామీల గురించి ప్రస్తావించారు. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేరుస్తుందని ప్రధాని చెప్పారు. బీజేపీ హామీలను మోదీ హామీలుగా పరిగణించాలని..ప్రతి పని పూర్తి అవుతుందని చెప్పారు.

ఢిల్లీ ఎన్నికల చివరి రౌండ్‌లో కాంగ్రెస్ కూడా 5 హామీలతో ప్రచారం చేస్తోంది. రూ.500 గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ.2500 భృతి వంటి హామీలను కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది.

ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2015 నుంచి ఆప్ ఇక్కడ అధికారంలో కొనసాగుతోంది. మరోసారి అక్కడ అధికార పగ్గాలు కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే కేజ్రీవాల్‌ను అక్కడ గద్దె దించి అధికార పీఠాన్ని సొంతం చేసుకోవాలని కమలనాథులు పట్టుదలగా ఉన్నారు. ఢిల్లీలో మెరుగైన ఫలితాలతో పరువు నిలుపుకోవాలని కాంగ్రెస్ ఆశిస్తోంది.