Innova electric car: ఇన్నోవా ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది..జకార్తాలో నయా మోడల్ ప్రదర్శన
ప్రసిద్ద కార్ల తయారీ కంపెనీ టయోటా మోటార్స్ విడుదల చేసే కార్లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. మన దేశంలో కూడా ఈ కార్లు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిలో ఇన్నోవా కారు అంటే తెలియని వారుండరు. మంచి లుక్, మెరుగైన పికప్, ఎక్కువ మంది ప్రయాణంచే వీలు ఉండడంతో దీని విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్నోవా ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి టయోాటా సన్నాహాలు చేస్తుంది. ఇండోనేషియాలోని జకార్తాలో ఇటీవల జరిగిన ఇండొనేషియా ఇంటర్నేషనల్ మోటారు షో (ఐఐఎంఎస్)లో ఈ కారును ప్రదర్శించింది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అన్నికంపెనీలు ఆ విభాగంలో కార్లను తయారు చేసి, మార్కెట్ లో దూసుకుపోతున్నాయి. కానీ టయోటా ఈ విషయంలో వెనుకబడింది. ఈ నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసుకునేందుకు ఇన్నోవా ఎలక్ట్రిక్ కారుతో ముందుకు వచ్చింది. దీని తర్వాత మరిన్ని కార్లు విడుదల చేస్తుందని సమాచారం. ఇన్నోవా ఎంపీవీ పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన టయోటా కిజాంగ్ ఇన్నోవా బీఈవీ కాన్సెప్ట్ ను జకార్తాలో ప్రదర్శించారు. ఇన్నోవా ఎలక్ట్రిక్ కారులో 59.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీని నుంచి 700 ఎన్ఎం గరిష్ట టార్కు విడుదల చేసే 180 హెచ్ పీ ఎలక్ట్రిక్ మోటారు అమర్చారు. ఏసీ టైప్ 2, డీసీ సీసీఎస్ 2 చార్జింగ్ కు బ్యాటరీ మద్దతు ఇస్తుంది. అయితే కారు ఎన్ని కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందో, ఎన్ని గంటలకు బ్యాటరీ ఫుల్ చార్జింగ్ అవుతుందో స్పష్టంగా తెలియలేదు.
పాత ఇన్నోవా కారు మాదిరిగానే కొత్త ఎలక్ట్రిక్ కారు కనిపిస్తుంది. రెండింటికి పెద్దగా తేడా లేదు. కానీ ముందు గ్రిల్ స్థానంలో ఒకే ప్యానెల్ పై ఎల్ఈడీ స్ట్రిప్ ను ఏర్పాటు చేశారు. అప్ డేట్ చేసిన ఎల్ఈడీ డీఆర్ఎల్ లు, హెడ్ లైట్ యూనిట్లతో క్లోజ్డ్ గ్రిల్ అమర్చారు. ఎలక్ట్రిక్ కారు అని గుర్తించడానికి వీలుగా రెండు చివర్లలో బీఈవీ బ్యాడ్జింగ్ చేశారు. దీనిలోని 16 అల్లాయ్ వీల్స్ తో బయట నుంచి కారు చాలా అద్బుతంగా కనిపిస్తోంది. డోర్ హ్యాండిల్స్ పై క్రోమ్ గార్నిష్, కారు బ్యాక్ సైడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఎల్ఈడీ లైట్ స్ట్రిప్ ఆకట్టుకుంటున్నాయి. ఇంటిరీయల్ ను కూడా అత్యంత ఆకర్షణీయంగా రూపొందించారు. యాంబియంట్ లైటింగ్, బటన్లతో కూడిన లెదర్ స్టీరింగ్ వీల్, వైర్ లెస్ ఫోన్ చార్జర్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్, మధ్యలో కెప్టెన్ సీట్లు ఏర్పాటు చేశారు. మంచి ఆధునాతన ఫీచర్లతో పాటు లగేజీ పెట్టుకోవడానికి విశాలమైన స్థలం ఉండేలా ఏర్పాటు చేశారు.
ఇన్నోవా ఎలక్ట్రిక్ కారును తొలుత ఇండోనేషయాలో విడుదల చేసే అవకాశం ఉంది. మన దేశంలో ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై స్పష్టత లేదు. కానీ మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఇక్కడకు త్వరగా వచ్చేస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆసియా మార్కెట్ లో ఇన్నోవా కారుకు విపరీతమైన డిమాండ్ ఉంది. మన దేశంలో ఐసీఈ వెర్షన్ లో ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా అనే వేరియంట్లలో విక్రయాలు జరుగుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








