Gold Buying Tips: బంగారం ఇలా కొంటే నష్టపోతారు.. ఈ ట్రిక్స్ తెలియక ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నారో..
ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని అత్యధికంగా వాడే దేశాల్లో చైనా ముందంజలో ఉంది. భారతదేశం కూడా తక్కువేం కాదు. మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. గోల్డ్ ధరలు రికార్డ్ స్థాయిని దాటేస్తున్న కొనేవారు కొంటూనే ఉన్నారు. స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు భయపడేవారు. గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. కానీ, మీరు కొన్న బంగారం తర్వాత అమ్మాలనుకుంటున్నప్పుడు ఆ ధర రాకపోవడం లేదా బంగారం నాణ్యతలోనే సమస్యలు తలెత్తడం వంటివి చూస్తుంటాం. ఇక అలాంటప్పుడు మోసపోయామన్న భావన కూడా కలుగుతుంది. మరి ఇలా జరగకుండా ఉండాలంటే బంగారం ఎలా కొనాలో ముందుగా మీకు అవగాహన ఉండాలి.

ప్రపంచ దేశాల్లో బంగారం కొనుగోలు అంటే కేవలం పెట్టుబడి గురించి మాత్రమే చూస్తారు. భారతదేశంలో మాత్రం బంగారం అంటే ఆడవాళ్ల ఆభరణాలు గురించి మాత్రమే ఆలోచిస్తారు. అయితే ఆభరణాల కోసం బంగారం కొంటే చాలా నష్టపోతారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బంగారు ఆభరణాల కొనుగోలులో తరుగు, మజూరీ అనేది బంగారం ధరను చాలా ప్రభావితం చేస్తుంది.
మీరేప్పుడైనా బంగారు ఆభరణాలు కొనాలని వెళ్లినప్పుడు షాపు వాడు రకరకాల చార్జీలతో మోతెక్కిస్తాడు. పోనీ ప్యూర్ గోల్డ్ కొందామా అంటే.. దాని నాణ్యతపై రకరకాల సందేహాలుంటాయి. మళ్లీ వీటిని భద్రంగా దాచుకోవడం కూడా పెద్ద సవాలే. అందుకే ఇప్పుడు చాలా మంది. డిజిటల్ గోల్డ్ ను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక ఆభరణం కొన్నప్పుడు దాని మేకింగ్ చార్జీలను ఎలా నిర్ణయిస్తున్నారో మీరు ముందుగా తెలుసుకుంటే నష్టకోకుండా ఉంటారు. దీనికి కీలకం ఏమిటంటే ఒక ఆభరణాన్ని తయారు చేయడానికి పట్టే సమయం. సాధారణంగా, తయారీ చార్జీలు బంగారం ధరలో 10% నుండి 30% వరకు ఉంటాయి. ఇందులో రిటైలర్లకు సుమారు 10% కమిషన్ ఉంటుంది. ఎక్కువ డిజైన్లు ఉన్న ఆభరణాల ఉత్పత్తి చార్జీలు కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా, సింపుల్ డిజైన్లకు తక్కువ ఛార్జీలు ఉంటాయి. భారతదేశంలో బంగారు ఆభరణాల తయారీ రేట్లు బ్రాండ్‌ను బట్టి 5% నుండి 30% వరకు ఉంటాయి.
ప్రాసెసింగ్ ఫీజులు ఎలా లెక్కిస్తారు..?
ఒక ఆభరణం తుది ధర అనేక అంశాల ఆధారంగా లెక్కించబడుతుంది. బంగారం ధర (22 క్యారెట్లు, 18 క్యారెట్లు, మొదలైనవి) దాని బరువు (గ్రాములు) తో గుణిస్తారు. దీనితో పాటు, మేకింగ్ ఛార్జ్, 3% జీఎస్టీ కూడా అదనంగా యాడ్ చేస్తారు. ఉదాహరణకు, మీరు 9.6 గ్రాముల బరువున్న బంగారు గొలుసు కొన్నారనుకుందాం.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 78,900
మీ గొలుసు ధర; 1 గ్రాము బంగారం ధర = 78,900 / 10 = రూ. 7,890.
9.60 గ్రాముల బంగారు గొలుసు ధర = 7,890 x 9.60 = రూ. 75,744.
ప్రాసెసింగ్ ఫీజు (10%) = రూ. 7101
ఇప్పటివరకు మొత్తం = రూ. 86,001
3% జీఎస్టీ = రూ. 1032
మీరు చెల్లించాల్సిన మొత్తం = రూ. 87033
పై కాలిక్యులేషన్ ద్వారా ఏం తెలుసుకోవాలి.. ?
కస్టమర్లు బంగారం కొనేముందు ఎక్కువ శాతం దాని డిజైన్ కు ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. కానీ, పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది అంత మంచి ఉపాయం కాదు. ఎందుకంటే మీకు నచ్చిన డిజైన్ ను బట్టీ దాని తయారీ ఖర్చులు పెరుగుతుంటాయి. కానీ, దానిని అమ్మాలనుకున్నప్పుడు మీకు అంత రేటు లభించదు. దీంతో డిజైన్ కోసం వెచ్చించిన ఖర్చంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి సింపుల్ డిజైన్స్ ను తయారీ చార్జీలు తక్కువగా ఉన్నవాటిని ఎంచుకోవడం బెటర్. మరీ ముఖ్యంగా బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఆభరణాలకు బదులుగా బిస్కట్ బంగారాన్ని కొనుక్కోవడం ఎంతో మేలు.




