భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం? 21 మిలియన్ డాలర్ల ఫండ్..! డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
భారత ఎన్నికల్లో మరెవరినో గెలిపించే ప్రయత్నం చేశారా? భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని చూశారా? అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్‌పై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు 21 మిలియన్ డాలర్ల ఫండ్ అమెరికా ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా భారత దేశ రాజకీయాల్లో అగ్గి రాజుకుంది. అసలు ఆ ఫండ్స్ ఏంటి? ట్రంప్ వ్యాఖ్యల్లో అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం..

భారత దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంచేందుకు అమెరికా ఎందుకు 21 మిలియన్ డాలర్ల సాయం చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. తాజాగా ఇండియాకు ఫండ్ టూ బూస్ట్ ఓటర్ టర్న్ అవుట్‌ను ఇటీవలె డోజ్ రద్దు చేసింది. అంటే ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు, వారిని ఓటింగ్‌లో పాల్గొనేలా చేసేందు కోసం అమెరికా 21 మిలియన్ డాలర్ల ఫండ్ ఇస్తుందని, ఇది అమెరికాకు అనవసరపు ఖర్చు, దీన్ని రద్దు చేయాలంటూ అమెరికా డోజ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషీయన్సీ) విభాగం సూచించింది. ఈ డోజ్ ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. డోజ్ సూచనను ప్రెసిడెంట్ ట్రంప్ సమర్థించారు. అసలు అమెరికా ఎందుకు భారత దేశంలో ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనేలా అవగాహన కల్పించేందుకు నిధులు ఇవ్వాలి? అమెరికాలో ఎంత మంది ఓటర్లు ఓటింగ్ వేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. భారతదేశం దగ్గర కూడా బాగానే డబ్బులున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా పన్నులు విధించే దేశాల్లో ఇండియా ఒకటి, అలాగే ఆ దేశం సుంకాలు కూడా అధికంగానే విధిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అమెరికా ఎందుకు వాళ్లకు నిధులు ఇవ్వాలి. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికా? లేక అక్కడ మరెవరినో గెలిపించేందుకు ప్రయత్నాలు చేశారా అంటూ అమెరికా మాజీ అధ్యక్షడు జో బైడెన్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రజలు, ప్రధాని మోదీ అంటే తనకు గౌరవం ఉందని, అయినా కూడా ఈ ఓటర్ బూస్టింగ్ ఫండ్స్‌ను రద్దు చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇక్కడ విచిత్రకరమైన విషయం ఏంటంటే.. 2024 లోక్ సభ ఎన్నికల్లో భారత్ ఏకంగా 1.35 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే కూడా ఎక్కువ. అ లక్షా 35 వేల కోట్ల రుపాయాల్లో ఎన్నికల నిర్వహణ కోసం(పోలింగ్ సామాగ్రి, సిబ్బంది జీతాలు, సెక్యూరిటీ, ఓట్ వేయాలని ఓటర్లకు కల్పించే అవగాహన కార్యక్రమాలు) ఎన్నికల కమీషన్ పెట్టే ఖర్చు, పోటీలో ఉన్న అభ్యర్థులు పెట్టే ఖర్చు మొత్తం కలిపి ఉంటుంది.
ఇంత భారీగా ఖర్చు పెట్టే ఇండియాకు ఈ 21 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 182 కోట్లు ఏ మూలన సరిపోతాయంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టే దేశంలో 182 కోట్లతో ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందా అని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అజిత్ మాలవీయ స్పందిస్తూ.. “ఓటర్ల సంఖ్య పెంచేందుకు 21 మిలియన్ డాలర్లా? ఇది భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది. దీని వల్ల ఎవరు లాభపడ్డారు? కచ్చితంగా రూలింగ్ పార్టీ అయితే కాదు” అని పేర్కొన్నారు. కాగా, అసలు ఈ “ఫండ్ టూ బూస్ట్ ఓటర్ టర్న్” అంటే ఇండియా ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంచేందుకు అమెరికా ఎప్పటి నుంచి డబ్బులు ఇవ్వడం ప్రారంభించింది? ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇచ్చిది? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.