Crime rate: ఆ పది రోజుల్లో క్రైం రేటు భారీగా తగ్గింది.. అసలు కారణం ఏంటో తెలుసా..
Delhi Crime rate: జీ-20 సదస్సు కోసం ఢిల్లీ పోలీసులు చేపట్టిన భద్రతా చర్యల కారణంగా దేశ రాజధానిలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా మహిళలపై జరిగే అత్యాచారాలు వంటి నేరాలతో పాటు చైన్ స్నాచింగ్‌లు, దోపిడీలు, దొంగతనాలు తగ్గినట్టు ఈ 10 రోజుల్లో నమోదైన కేసులను బట్టి తెలుస్తోంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సెప్టెంబర్ మొదటి 10 రోజుల్లో స్నాచింగ్ కేసులు 25 శాతం తగ్గాయి.

ఢిల్లీ, 13 సెప్టెంబర్: దేశ రాజధాని ఢిల్లీలో క్రైమ్ రేట్ ఒక్కసారిగా తగ్గింది. అందుకు జీ-20 శిఖరాగ్ర సదస్సే కారణమైంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. గణాంకాలు మాత్రం ఇది నిజమే అని అంటున్నాయి. జీ-20 సదస్సు కోసం ఢిల్లీ పోలీసులు చేపట్టిన భద్రతా చర్యల కారణంగా దేశ రాజధానిలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా మహిళలపై జరిగే అత్యాచారాలు వంటి నేరాలతో పాటు చైన్ స్నాచింగ్‌లు, దోపిడీలు, దొంగతనాలు తగ్గినట్టు ఈ 10 రోజుల్లో నమోదైన కేసులను బట్టి తెలుస్తోంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సెప్టెంబర్ మొదటి 10 రోజుల్లో స్నాచింగ్ కేసులు 25 శాతం తగ్గాయి.
ఓ జాతీయ మీడియా సంస్థ చేపట్టిన అధ్యయనం ప్రకారం మహిళలపై నేరాల కేసులు 22.4 శాతం తగ్గినట్లుగా తేలింది. అలాగే ఈ పది రోజుల్లో హత్య కేసుల సంఖ్య కూడా బాగా తగ్గింది. సెప్టెంబర్ 8 – 10 మధ్య అత్యాచార కేసులు 57 శాతం తగ్గాయని ఆ నివేదిక పేర్కొంది. కారణమేదైనా సరే ఆ సమయంలో నేరాల సంఖ్య తగ్గడం రాజధాని వాసులకు ఊరటనిచ్చే అంశమే అని చెప్పవచ్చు. అయితే ఇదే తరహా పరిస్థితి ఆ తర్వాత కూడా కొనసాగుతుందన్న నమ్మకం మాత్రం ప్రజల్లో లేదు.
విజిబుల్ పోలీసింగ్..
నేరాలను అదుపు చేయడం, నేరం జరిగిన తర్వాత నేర పరిశోధన చేసి దోషులకు శిక్ష పడేలా చేయడం.. పోలీసుల ప్రాథమిక కర్తవ్యం. నేరం జరిగిన తర్వాత దోషులను గుర్తించి, పట్టుకుని, శిక్ష పడేలా చేయడం కంటే నేరాలను అదుపు చేయడమే వారి ముందున్న అత్యుత్తమ మార్గం. ఇందుకోసం ఒక్కో పోలీస్ బాస్ ఒక్కో విధానాన్ని అనుసరిస్తుంటారు.
కొందరు అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసొచ్చి మరీ ఇక్కడ అమలు చేస్తుంటారు. కొందరు టెక్నాలజీని విరివిగా వాడుకుని నేరాలను అదుపు చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా డీజీపీగా నియమితులైన ఏకే మహంతి నేరాలను అదుపుచేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ఇందుకోసం ఆయన సంప్రదాయ పోలీసింగ్ విధానాలనే విరివిగా అమలు చేసేవారు.
ఏకే మహంతి ఏం చేశారంటే..
అందులో కీలకమైనవి ‘విజిబుల్ పోలీసింగ్’, ‘నాకాబందీ’. విజిబుల్ పోలీసింగ్ అంటే పోలీసులు ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉండడమే. పోలీసు విభాగాల్లో లా అండ్ ఆర్డర్ విభాగంలో పనిచేసే సిబ్బంది. వారికి అనుబంధంగా ఉండే రిజర్వ్ పోలీసులు, స్పెషల్ బెటాలియన్లు చివరకు హోంగార్డుల సేవలను కూడా ఇందుకోసం వినియోగించవచ్చు. గడప దాటి బయటికొచ్చాక ప్రతి మూలన పోలీసులు కనిపిస్తే.. రోడ్లపై జరిగే చైన్ స్నాచింగ్, మహిళలపై నేరాలు చేసేవారు వెనుకడుగు వేస్తారు. దొరికిపోతామన్న భయం నేరస్తుల్లో నెలకొంటుంది. అదే జరగబోయే నేరాలను నియంత్రిస్తుంది. ఏకే మహంతి ఈ విధానాన్ని అమలు చేసినప్పుడు హైదరాబాద్ నగరంలో నేరాలు కూడా ఇదే తరహాలో తగ్గుముఖం పట్టాయి. చాలా నేరాలను జరుగుతున్న దశలోనే నియంత్రించడం సాధ్యపడింది.
హైదరాబాద్‌లో నిర్వహించిన నాకాబందీలో ఒక సందర్భంలో ఉగ్రవాదులు దొరికిపోయారు. నాకాబందీ అంటే బ్యారికేడ్లు పెట్టి వాహనాలను, వచ్చిపోయేవారిని తనిఖీ చేయడమే. దుశ్చర్యలకు, ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారు పోలీసు తనిఖీల్లో దొరికిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
జీ-20లో ఏం జరిగింది?
అగ్రరాజ్యాలు అమెరికా, యూకే, జర్మనీ, జపాన్ వంటి దేశాలతో పాటు జీ-20లోని సభ్యదేశాలు, భారత ప్రెసిడెన్సీలో ప్రత్యేక ఆహ్వానిత దేశాల అధినేతలు, ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ సంస్థల అధిపతులు ఒకే చోట సమావేశమయ్యే సందర్భం జీ-20 శిఖరాగ్ర సదస్సు కల్పించింది. అంత మంది వీవీఐపీలు ఢిల్లీ నగరానికి వస్తున్నారంటే భద్రతా చర్యలు సైతం అదే స్థాయిలో ఉండాలి. ఢిల్లీ పోలీసు విభాగంలో ఉన్న 80వేల పోలీసులకు తోడు మరో 45వేల మంది కేంద్ర పారామిలటరీ బలగాలు (సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్ వంటి బలగాలు)ను భద్రతా విధుల్లో నిమగ్నమయ్యాయి.
ఎక్కడికక్కడ తనిఖీలు
దాంతో ఢిల్లీలో ప్రతి 30-40 మీటర్లకు ఇద్దరు చొప్పున సాయుధ పోలీసులు, పారామిలటరీ బలగాలు కనిపించాయి. అలాగే సెంట్రల్ ఢిల్లీలో విస్తృతంగా లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ నిషేధాజ్ఞలు అమలయ్యాయి. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. వీటన్నింటి కారణంగా ఢిల్లీలో సగటున నమోదయ్యే వివిధ రకాల నేరాల సంఖ్య ఈ పది రోజుల్లో గణనీయంగా తగ్గింది. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన గణాంకాలతో పోల్చినా, గత నెలలో నమోదైన గణాంకాలతో పోల్చినా సరే.. జీ-20 భద్రతా చర్యలు మొదలుపెట్టిన తర్వాత నేరాల సంఖ్య తగ్గిందనేది నమోదైన కేసులే చెబుతున్నాయి.
వీవీఐపీ సెక్యూరిటీ దృష్ట్యా పోలీసుల ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్‌కు వచ్చే ఫోన్ కాల్స్ సంఖ్య మాత్రం పెరిగింది. సగటున రోజువారీగా వచ్చే ఫోన్ కాల్స్ కంటే 6 రెట్లు అధికంగా.. రోజుకు సగటున 2,500 వరకు ఫోన్ కాల్స్ వచ్చాయి. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా అంబులెన్సులు, ఇతర ఎమర్జెన్సీ సర్వీసుల సేవలకు ఎక్కడా విఘాతం కలగలేదని ఢిల్లీ పోలీసు యంత్రాంగం వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం
