New Covid Guidelines: పల్లెల్లో వైరస్ కట్టడికి కేంద్రం సరికొత్త గైడ్‌లైన్స్…:ఉత్తర్వులు జారీ.
New Covid Guidelines: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది కానీ..

New Covid Guidelines: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది కానీ మరణాల సంఖ్యే నాలుగు వేల దాటడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ధాటికి ఈసారి పల్లెలు కూడా అల్లాడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలకు కూడా కరోనా వ్యాపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు దాదాపు 30శాతం నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.. పల్లెలపై ప్రత్యే క దృష్టి పెట్టింది.. గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపర్చడం కోసం ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఎక్కడైతే కరోనా తీవ్రతరంగా ఉందో ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. కోవిడ్ కంటైన్మెంట్, నిర్వహణపై గైడ్‌లైన్స్ విడుదల చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని సూచించారు అధికారులు. గ్రామీణ ప్రజలలో అనారోగ్యంతో ఉన్నవారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని, వారిని ఏమైనా శ్వాస సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఇందుకోసం ఆశా వర్కర్ల, ఆరోగ్య కార్యకర్తల సేవలను వినియోగించుకోవాలని చెప్పింది.
ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే వెంటనే వారికి ప్రాథమిక వైద్య సిబ్బందితో టెలిమెడిసిన్ వైద్య సేవలందించాలని తెలిపింది. కరోనా సోకిన వారికి వేరే ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా వారిని జనరల్ హాస్పిటల్‌కు తరలించాలని చెప్పింది ఆరోగ్యశాఖ. మార్గదర్శకాలలో ఇంకా అనేకం ఉన్నాయి. కరోనాతో బాధపడుతున్నవారిని అవసరమైన సౌకర్యాలు కలిగించాలి. పేషంట్ల ఆక్సిజన్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి.. ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయని తెలిసిన మరుక్షణమే వారిని హాస్పిటల్‌లో చేర్పించి ఆక్సిజన్ అందించాలి. పల్లెల్లో పల్స్ ఆక్సీమీటర్లు, థర్మా మీటర్లను సరిపడినంత సమకూర్చాలి. ఆక్సీమీటర్లను వాడిన ప్రతీసారి వాటిని శానిటైజ్ చేయడం మర్చిపోకూడదు.. లేకపోతే కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంటుంది. కరోనా లక్షణాలు కనిపించగానే కంగారు పడాల్సిన అవసరం లేదు.. చాలా మందిలో ఈ లక్షణాలు చాలా స్వల్పంగానే ఉంటున్నాయి.. అలాంటప్పుడు అనవసరంగా హాస్పిటల్‌కు పరుగులు పెట్టకూడదు. ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటూ మందులు తీసుకోవాలి..మరీ ఇబ్బంది అనిపిస్తే ఆసుపత్రికి వెళ్లాలి. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా టెస్ట్ కిట్లను ఉంచాలి. కరోనా బాధితులకు హోమ్ ఐసోలేషన్ కిట్లు అందించాలి. కేసుల సంఖ్య పెరిగినట్టు అనిపిస్తే మాత్రం కాంటాక్ట్ ట్రేసింగ్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.