కరోనా ఫోర్త్ వేవ్ ముంచుకొస్తుందా ?.. పెరుగుతున్న కేసులు దేనికి సంకేతం ..
ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాలలో కేసులు బాగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ. డాక్టర్లు చెబుతున్నట్టుగానే ఫోర్త్ వేవ్ మొదలయ్యిందనే అనుకోవాలి.
ఇప్పట్లో కరోనా మనల్ని వదిలేట్టుగా లేదు.. మనం తప్పు చేస్తున్నామా? లేక ఆ పీడ మనకు తప్పడం లేదా? తగ్గినట్టే తగ్గుతూ మళ్లీ జడలువిప్పుకోవడమేమిటి? తగ్గుముఖం పడుతున్నప్పుడు మనం కనబర్చిన నిర్లక్ష్యం ఫలితమా ఇది! వైరస్‌ను సమూలంగా నాశనం చేయడం సాధ్యం కాదా? వివిధ రాష్ట్రాలలో కరోనా కేసులు పెరగడం దేనికి సంకేతం? ఫోర్త్‌వేవ్ మొదలైందని అనుకోవాలా? ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాలలో కేసులు బాగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ. డాక్టర్లు చెబుతున్నట్టుగానే ఫోర్త్ వేవ్ మొదలయ్యిందనే అనుకోవాలి. పైగా ఈ నాలుగు రాష్ట్రాల నుంచే 81 శాతం కేసులున్నాయి. మిగతా రాష్ట్రాలు తక్షణమే మేలుకోవలసిన అవసరం అనివార్యంగా ఏర్పడింది. కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు హెచ్చరిక చేసింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తం కావాలని చెప్పింది. కోవిడ్ పరీక్షలు పెంచడంతో పాటు, ఇన్‌ఫ్లుయెంజా వంటి అనారోగ్యాలపై పర్యవేక్షణ పెంచాలని, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లపై అప్రమత్తంగా ఉండాలని, టెస్ట్ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని ఆదేశించింది.
మనకేం ప్రమాదం లేదని నిశ్చితంగా ఉంటే అది ప్రమాదం. ఎందుకంటే హైదరాబాద్‌లోనూ కేసులు బాగా పెరుగుతున్నాయి. అయినా చాలా మంది ఇంకా నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదు. మాస్క్‌లు తీసి అవతల పారేసి చాలా కాలామే అయ్యింది. భౌతిక దూరం విషయమే మర్చిపోయారు. రాబోయేది వర్షకాలం.. ఆల్‌రెడీ వర్షాలు కురవడం మొదలయ్యింది.. వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయంటే అందుకు కారణం ఒమిక్రాన్ సబ్ వేరియంటే! గత రెండు మూడు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సమ్మర్ హాలిడేస్‌లో విహార యాత్రలకు వెళ్లి వచ్చిన వారిలో కొందరు అనారోగ్యం బారిన పడుతున్నారు. వివిధ రుగ్మతల వల్ల ఆసుపత్రికి వచ్చే వారిలో 20 మందిలో ఒకరో ఇద్దరో కరోనాతో బాధపడుతున్నారు. వీరిలో చాలా మంది గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి వాటితో ఇబ్బందిపడుతున్నారు. సీజనల్ వైరస్ ఇన్ఫెక్షన్లేనని అనుకోవడానికి వీల్లేదు.. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. మూడో వేవ్‌లో లాగే కరోనా స్వల్ప లక్షణాలు ఉంటే మాత్రం అంతగా కంగారుపడాల్సిన అవసరం లేదు. పారాసిటమాల్, దగ్గు మందులతోనే నయం చేసుకోవచ్చు. అలాగని వైద్య సలహాలు తీసుకోకుండా ఉండకూడదు.
ఒకటి, రెండు కేసులు సెకండ్ వేవ్‌లోలా ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్ వంటివి వచ్చాయి. చిత్రమేమిటంటే వీరికి రెండు సార్లు ర్యాపిడ్ టెస్ట్ చేయిస్తే రెండుసార్లూ నెగిటివే వచ్చింది. ఇదే ఆందోళన కలిగిస్తోంది.