వారిద్దరూ కలవడానికి కరోనా సాయపడింది.. దాదాపు 33 సంవత్సరాల తర్వాత తండ్రిని కలుసుకున్న కూతురు..
దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. పలు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది.
దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. పలు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఇంతమందికి నష్టాన్ని చేకూర్చిన వైరస్ మాత్రం ఒక మహిళకు సాయపడింది. చనిపోయాడు అనుకున్న తండ్రిని తనకు దగ్గర చేసింది. దాదాపు 33 సంవత్సరాల తర్వాత ఆ మహిళ తన తండ్రిని కలిసింది. వివరాల్లోకెలితే…
పాలక్కడ్ కు చెందిన అజిత చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి లేకుండానే పెరిగింది. ఆమెకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు తన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అజిత తండ్రి శివాజీ ఓ రాజకీయ పార్టీ కార్యకర్త. అయితే రాజకీయ కక్షలలో భాగంగా శివాజీ తన 32వ ఏట ఓ హత్య చేశాడని అభియోగంతో పోలీసులు పట్టుకెళ్లారు. దీంతో ఆయన భార్య మతిస్థిమితం కోల్పోయి మరణించింది. ఇక అప్పటి నుంచి అజితను తన అమ్మమ్మ వాళ్లు పెంచుకోసాగారు. రాజకీయ పార్టీలలో తిరిగి తమ ఇంటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడనే కోపంతో వారు శివాజీ గురించి అజితకు ఏం చెప్పలేదు. దీంతో తన తండ్రి కూడా మరణించాడు అని అనుకుంది అజిత. ఆమె వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే ఇటీవల లాక్ డౌన్ సమయంలో టీవీ చూస్తున్న అజితకు గత సంవత్సరం ఖైదీల ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ప్రస్తావన వచ్చింది. తండ్రి పేరు, హత్య కేసు వివరాలు ఓకే విధంగా ఉండడంతో జైలులో ఉన్న వ్యక్తి తన తండ్రే అని అజితకు తెలిసింది. ఇంకేముందు వెంటనే తన తండ్రిని కలుసుకోవడానికి జైలుకు పరుగులు తీసింది.
ఇక తన తండ్రిని కలిసి అజిత అసలు విషయం తెలుసుకుంది. శివాజీ యావజ్జీవ శిక్ష 2006లోనే పూర్తయ్యింది. అయిత శిక్షాకాలంలో అతను పారిపోయే ప్రయత్నం చేయడంతో.. ఇప్పటికీ జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఇక తండ్రిని విడిపించుకోవడానికి అజిత ఎంతోమందిని కలిసింది. కానీ ఫలితం లేకపోయింది. చివరకు తనకు కరోనా సాయపడింది. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జైలులో ఉన్న ఖైదీలకు పెరోల్ ఇవ్వడంతో శివాజీకి 3 నెలలు పెరోల్ ఇచ్చారు. ఇక అజిత వెంటనే తన తండ్రిని తన ఇంటికి తీసుకువచ్చింది. శివాజీ వయసు ప్రస్తుతం 65 సంవత్సరాలు.. జైలు నుంచి బయటకు వచ్చాననే సంతోషం.. మరోవైపు కూతురితో ఉన్నానన్న ఆనందం శివాజీకి మిగిలింది.