వేయిపడగల విషసర్పంలా కాటేస్తున్న కరోనా మహమ్మారి
దేశంలో కరోనా సెకండ్‌వేవ్ బీభత్సాన్ని సృష్టిస్తోంది.. ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. మూడు లక్షలకు చేరువలో కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతుంది.
దేశంలో కరోనా సెకండ్‌వేవ్ బీభత్సాన్ని సృష్టిస్తోంది.. ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. మూడు లక్షలకు చేరువలో కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతుంది. రికవరీ రేటు కూడా తగ్గుతోంది. మరణాలు 16 వందలు దాటాయి. ఇక మహారాష్ట్రలో కరోనా వైరస్ అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తోంది. ఒక్క రోజే అక్కడ సుమారు 70 వేల కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో పాతికవేలకు పైగా కరోనా బారిన పడ్డారు. పగబట్టిన వేయిపడగల విష సర్పంలా కాటేస్తున్న కరోనా మహమ్మారిని ఎలా అదుపు చేయాలో తెలియక ప్రభుత్వాలు అల్లాడిపోతున్నాయి.. రెండు నెలల కిందటి వరకు కరోనాకు అదుపులోకి తెచ్చామని సంబరపడ్డాం కానీ, సెకండ్‌వేవ్ ఇంత భయానకంగా ఉంటుందని ఊహించలేదు.. కేసులు పెరుగుతున్నట్టే మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఫస్ట్‌వేల్‌లో కరోనా సృష్టించిన రికార్డులన్నీ సెకండ్‌వేవ్ బ్రేక్ చేస్తున్నది. ప్రాణాలను కూడా తుడిచిపెట్టేస్తున్నది.
సెకండ్‌వేవ్‌లో కరోనా వైరస్ జన్యుక్రమం మార్చుకుని కరాళనృత్యం చేస్తోంది. భారత్ వైరస్ సార్స్‌కోవ్-2 ద్వారానే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గమనించదగిన విషయమేమిటంటే సెకండ్‌వేవ్‌లో చాలా మందిలో కరోనా లక్షణాలు కనిపించకపోవడం. తమకు కరోనా లేదన్న తలంపుతో తమకు తెలియకుండా ఇతరులకు వైరస్ అంటిస్తున్నారు. ఈ కొత్త కరోనా నేరుగా ఊపిరితిత్తులపైనే దాడి చేస్తోంది.. అందుకే చాలా మంది మూడు నాలుగు రోజుల్లోనే కన్నుమూస్తున్నారు. నిరుడు వచ్చిన ఫస్ట్ వేవ్ కరోనాలో ఎక్కువగా వయసుమళ్లినవారే ఇబ్బంది పడ్డారు. వారికే కరోనా సోకింది.. యువత బాగానే ఉంది.. కానీ సెకండ్‌వేవ్‌లో యువతను పట్టి పీడిస్తున్నది. ఢిల్లీలో కరోనా సోకిన వారిలో 65శాతం మంది 45 కంటే తక్కువ వయసు ఉన్నవారు కావడం గమనార్హం. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ కూడా 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్నవారికే కరోనా ఎక్కువగా అంటుతున్నది. ఫస్ట్‌వేవ్‌లో కరోనా మరణాల్లో 60 ఏళ్లకు పైబడిన వారే ఎక్కువగా ఉన్నారు. ఎక్కువగా వృద్ధులకే కరోనా సోకింది. చిన్నపిల్లల జోలికి అంతగా వెళ్లలేదు. ఇప్పుడు మాత్రం అలా కాదు. పోయిన నెలలోనే 80 వేల మంది చిన్నారులకు కరోనా సోకింది. నిరుడు కరోనా వైరస్‌పై చాలా మందికి అంతగా అవగాహన లేదు. మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్లు ఉపయోగించడం ఇవన్నీ కొత్తే! క్వారంటైన్, లాక్‌డౌన్‌లు కూడా కొత్త. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత జనం కరోనా నిబంధనలకు తూట్లు పొడిచారు. ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం, వ్యాక్సిన్ వచ్చిందన్న ధీమాతో నిబంధనలకు పాతరవేశారు. వైన్‌షాపులు తెరుచుకున్నాయి. బార్లు ఓపెన్ అయ్యాయి. థియేటర్లను తెరచుకోనిచ్చింది ప్రభుత్వం. గుళ్లు, ప్రార్థనమందిరాలు తెరచుకున్నాయి. ఊరేగింపులు, ఉత్సవాలు యథావిధిగా జరిగాయి. వీటన్నింటితో పాటు ఎన్నికలు.. ఈ సమయం కోసమే కాచుకూర్చున్న కరోనా మళ్లీ ఒక్కసారిగా విజృంభించింది. కరోనా కట్టడి కోసం తమిళనాడు ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తారు. ఆదివారం పూర్తి లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. అలాగే ప్లస్ టూ పరీక్షలను వాయిదా వేసింది. కర్నాటక పరిస్థితి కూడా బాగోలేదు. అక్కడ కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బెంగళూరులో అయితే నిమిషానికి ఏడు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కరోనా విశ్వరూపం చూపిస్తుండటంతో దేశంలో మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఆక్సిజన్ ఉత్పత్తిని వెంటనే పెంచాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ప్రజారోగ్య కేంద్రాలలో పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటుకు అంగీకరించింది. ఈ ప్లాంట్ల ద్వారా హాస్పిటల్స్ తమకు అవసరమైన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసుకోగలవు. మధ్యప్రదేశ్‌లో అయిదు, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు, చండీగఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్‌లలో మూడేసి ప్రెజర్ స్వింగ్ అడ్‌సార్‌ప్షన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. బీహార్, కర్నాకట, తెలంగాణలలో రెండేసి ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కోటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకయ్యే భారాన్ని కేంద్రమే భర్తిస్తుంది. దీంతో పాటు పారిశ్రామిక అవసరాల కోసం ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది కేంద్రం.
మరిన్ని ఇక్కడ చూడండి: Coronavirus Masks: కరోనా నివారణ కోసం క్లాత్ మాస్కులను వాడుతున్నారా.. వాటిని శుభ్రం చేసుకునే పధ్ధతి ఏమిటో తెలుసా..!
Telangana corona: దేశం నలుమూలల కమ్మేసిన కరోనా మహమ్మారి.. తెలంగాణలో కొత్తగా 4,009 మందికి పాజిటివ్