Congress: ఫిరాయింపులు సహజమే.. కానీ కాంగ్రెస్ ఇల్లు ఎందుకు ఖాళీ అవుతోంది..?

రాజకీయాల్లో నేతలు పార్టీలు మారడం కొత్త విషయమేమీ కాదు. ఎన్నికల వేళ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఫిరాయింపులు జరుగుతుంటాయి. ఈ మధ్య ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఫిరాయింపులు ఎక్కువే జరుగుతున్నాయి. ఏదేమైనా నేతల ఫిరాయింపులకు గతంలో మాదిరిగా సైద్ధాంతిక విబేధాలతో, అగ్రనాయకత్వంతో స్పర్థలో కారణం కాదు.. పదవులు, అధికారమే పరమావధిగా ఈ గోడ దూకడాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Congress: ఫిరాయింపులు సహజమే.. కానీ కాంగ్రెస్ ఇల్లు ఎందుకు ఖాళీ అవుతోంది..?
Sonia Rahul Kharge
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 28, 2024 | 1:15 PM

రాజకీయాల్లో నేతలు పార్టీలు మారడం కొత్త విషయమేమీ కాదు. ఎన్నికల వేళ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఫిరాయింపులు జరుగుతుంటాయి. ఈ మధ్య ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఫిరాయింపులు ఎక్కువే జరుగుతున్నాయి. ఏదేమైనా నేతల ఫిరాయింపులకు గతంలో మాదిరిగా సైద్ధాంతిక విబేధాలతో, అగ్రనాయకత్వంతో స్పర్థలో కారణం కాదు.. పదవులు, అధికారమే పరమావధిగా ఈ గోడ దూకడాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

గత పదేళ్లకాలంలో జరిగిన పార్టీ ఫిరాయింపులను ఓసారి పరిశీలిస్తే.. భారతీయ జనతా పార్టీ (BJP)లోకి అత్యధిక చేరికలు నమోదు కాగా, అత్యధిక సంఖ్యలో నేతలను కోల్పోయిన పార్టీగా కాంగ్రెస్(Congress) నిలిచింది. అంటే ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో జరుగుతున్న చెలగాటం కాంగ్రెస్ పార్టీకి ప్రాణసంకటంగా మారింది. 2014 నుంచి ఇప్పటి వరకు 399 మంది కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీ ఫిరాయించగా.. వారిలో ఎక్కువ మంది బీజేపీలో చేరారు. ఇందులో 11 మంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతలున్నారంటే అతిశయోక్తి కాదు. 2014 నుంచి 2021 మధ్య, గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నుంచి పార్టీ మారిన 399 మంది ముఖ్యనేతల్లో 177 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

తాజాగా కాంగ్రెస్ నేత, వ్యాపార దిగ్గజం నవీన్ జిందాల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ వెంటనే విడుదలైన బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు కనిపించింది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన 6 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం, ఆ వెంటనే అభ్యర్థులుగా ప్రకటించడం కూడా చకచకా జరిగిపోయాయి. ఇది కేవలం ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాలేదు. దేశమంతటా ఈ తరహాలో పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీని వీడిన కొందరు ప్రముఖ నేతలు

మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి 2020లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఈ చేరికతో మధ్యప్రదేశ్‍‌లో అప్పటి వరకు కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఇదే రాష్ట్రంలో సురేష్ పచౌరి అనేక ఇతర మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో పార్టీ మారారు. మహారాష్ట్రలో 2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మాజీ సిఎం నారాయణ్ రాణే, ఆయన క్యాబినెట్ సహచరుడు హర్షవర్ధన్ పాటిల్‌లు కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరారు. తాజాగా మాజీ సీఎం అశోక్ చవాన్, మిలింద్ దేవరా, బాబా సిద్ధిక్ వంటి నేతలు కాంగ్రెస్‌ను వీడి బీజేపీ సహా వేర్వేరు పార్టీల్లో చేరారు.

ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు జగదాంబిక పాల్‌ సహా రీటా బహుగుణ జోషి, రవి కిషన్, అమర్‌పాల్ త్యాగి, ధీరేందర్ సింగ్ వంటి నేతలు 2014, 2016. 2017లో జరిగిన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2021లో జితిన్ ప్రసాద సహా మరో 22 మంది ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టారు. 2022లో ఆర్‌పిఎన్ సింగ్ కాంగ్రెస్‌తో తన మూడు దశాబ్దాల బంధానికి ముగింపు పలికారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని వీడిన ముఖ్య నేతల్లో కపిల్ సిబల్, కృష్ణ తీరథ్, రాజ్ కుమార్ చౌహాన్, బర్ఖా సింగ్ తదితరులు ఉన్నారు.

గుజరాత్‌కు చెందిన అర్జున్ మోద్వాడియా 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ను వీడారు. అల్పేష్ ఠాకోర్, హార్దిక్ పటేల్, రోహన్ గుప్తా వంటి ప్రముఖ నేతలు కాంగ్రెస్ వీడినవారి జాబితాలో ఉన్నారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కూడా కాంగ్రెస్‌తో తన 50 ఏళ్ల అనుబంధానికి స్వస్తి పలికారు. పంజాబ్‌లో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్, సునీల్ జాఖర్, అశ్వనీ కుమార్, రవ్‌నీత్ సింగ్ బిట్టు పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి జరుగుతున్న వలసల ప్రవాహం ఇక్కడితో ఆగిపోలేదు. అదింకా కొనసాగుతూనే ఉంది. పార్టీ వీడి వెళ్లిన ప్రముఖ నేతల్లో..

జమ్మూ & కాశ్మీర్: గులాం నబీ ఆజాద్

ఒడిశా: భువనేశ్వర్ కలితా, హిరణ్య భూయాన్

ఆంధ్రప్రదేశ్: కిరణ్ కుమార్ రెడ్డి

తమిళనాడు: సీఆర్ కేశవన్

కేరళ: అనిల్ ఆంటోనీ, టామ్ వడక్కన్

ఛత్తీస్‌గఢ్: రామ్‌దయాల్ ఉయికే

ఉత్తరాఖండ్: విజయ్ బహుగుణ, సత్పాల్ మహారాజ్

గోవా: దిగంబర్ కామత్, రవి నాయక్

అస్సాం: హిమంత బిస్వా శర్మ, సుస్మితా దేవ్

మణిపూర్ – ఎన్ బీరెన్ సింగ్

అరుణాచల్ ప్రదేశ్ – పేమా ఖండూ

తెలుగు రాష్ట్రాల్లో…

తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి పదవి తనకు దక్కకుండా కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించడంతో రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వీడి బయటికొచ్చారు. ఆయన వెంట అనేక మంది పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం తలా ఓ పార్టీకి చెల్లాచెదురయ్యారు.

ఏకంగా అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డే స్వయంగా కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా సమైక్యాంధ్ర పార్టీ పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో ఓటమి అనంతరం రాజకీయాల నుంచి కొన్నేళ్లు దూరంగా ఉండి మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చారు. కానీ ఆ పార్టీలో మార్పు ఏమీ లేదనుకున్నారో.. లేక భవిష్యత్తు లేదు అనుకున్నారో తెలియదు.. చివరకు మరోసారి కాంగ్రెస్ పార్టీని వీడి ఈసారి బీజేపీలో చేరారు. ఇప్పుడు రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

అలాగే 2014 వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన దగ్గుబాటి పురందేశ్వరి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. గత పదేళ్లుగా బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేసి ప్రస్తుతం ఏపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. కేంద్ర మంత్రులు, సీఎం, పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారే కాదు.. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పనిచేసిన అనేక మంది కాంగ్రెస్ వీడి వేర్వేరు పార్టీల్లో చేరారు. సరిగ్గా లెక్కిస్తే ఆ సంఖ్య వందల్లో ఉంటుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన డి. శ్రీనివాస్, కే. కేశవరావుతో పాటు తెలంగాణ తొలి పీసీసీ చీఫ్‌గా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన డీకే అరుణ 2019లో బీజేపీలో చేరారు. ఇప్పుడు పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తూ.. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తెలంగాణలో కాంగ్రెస్ వీడినవారి సంఖ్య అంత ఎక్కువేమీ కాకపోయినా.. కీలక పదవుల్లో పనిచేసిన నేతలు పార్టీ వీడడం గమనార్హం.

ఎందుకిలా జరుగుతోంది అన్న ప్రశ్న తలెత్తితే.. కొన్ని వలసలకు స్థానికంగా, రాష్ట్ర స్థాయిలో నాయకత్వంతో విబేధాలు, ఇతర పార్టీల్లో మెరుగైన అవకాశాలు కారణమైతే.. ఓవరాల్‌గా జాతీయ స్థాయిలో నాయకత్వం తీరు కారణమన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గుండెకాయలాంటి గాంధీ-నెహ్రూ కుటుంబంలో రాహుల్ గాంధీ పార్టీలో పాత, కొత్త తరం నేతలకు కలుపుకునిపోలేకపోవడం, భవిష్యత్తుపై వారికి భరోసా కల్పించలేకపోవడం, దశాబ్దాలుగా పదవులు అనుభవిస్తున్న నేతలకే తప్ప కొత్తవారికి అవకాశాలు, బాధ్యతలు కల్పించలేకపోవడం వంటి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు వరుసగా ఎదురవుతున్న పరాజయాలు సైతం ఆ పార్టీలో ఉన్న నేతల్లో నైరాశ్యాన్ని నింపుతున్నాయి. దీంతో గెలిచే పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కాంగ్రెస్ వీడి బీజేపీ సహా దేశంలోని ఇతర పార్టీల్లో చేరుతున్నారు. అలా ఈ వలసల ప్రవాహం కొనసాగుతూ కాంగ్రెస్ ఇల్లు ఖాళీ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్ స్టా పోస్ట్..
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్ స్టా పోస్ట్..
పవన్‌ను అభిమానించే స్రవంతి..తన కొడుకుకు ఏం పేరు పెట్టిందో తెలుసా?
పవన్‌ను అభిమానించే స్రవంతి..తన కొడుకుకు ఏం పేరు పెట్టిందో తెలుసా?
ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. వీటిపై భారీ డిస్కౌంట్‌
ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. వీటిపై భారీ డిస్కౌంట్‌
ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి.. గెజిట్‌ విడుదల
ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి.. గెజిట్‌ విడుదల
పాపం.. డార్లింగ్.. ప్రభాస్ కష్టాలు చూస్తే నవ్వాగదు..
పాపం.. డార్లింగ్.. ప్రభాస్ కష్టాలు చూస్తే నవ్వాగదు..
మీ ఏసీ జీవిత కాలం ఎన్ని రోజులు? ఎన్నేళ్లు వాడవచ్చు?
మీ ఏసీ జీవిత కాలం ఎన్ని రోజులు? ఎన్నేళ్లు వాడవచ్చు?
మోటో నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. ప్రత్యేకమైన ఫీచర్‌తో
మోటో నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. ప్రత్యేకమైన ఫీచర్‌తో
ప్రాణంతీసిన ‘రీల్స్’సరదా.. ఉరి వేసుకుంటున్నట్లు వీడియో తీస్తుండగా
ప్రాణంతీసిన ‘రీల్స్’సరదా.. ఉరి వేసుకుంటున్నట్లు వీడియో తీస్తుండగా
ఐఏఎస్ అధికారుల బదిలీల్లో చంద్రబాబు మార్క్..
ఐఏఎస్ అధికారుల బదిలీల్లో చంద్రబాబు మార్క్..
డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారం..కోన వెంకట్ ఏమన్నారో తెలుసా?
డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారం..కోన వెంకట్ ఏమన్నారో తెలుసా?