గ్రూపు రాజకీయాలు, వర్గపోరుకు కేరాఫ్ ఆ పార్టీ.. ఏ రాష్ట్రంలో ఎన్ని వర్గాలు ఉన్నాయో తెలుసా?

వర్గ పోరు' అన్న మాట ఎక్కువగా వినిపించేది, కనిపించేది మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ పార్టీలో జాతీయ స్థాయిలో ఒక కుటుంబ పెత్తనం నడిచినా... రాష్ట్రస్థాయిలో మాత్రం ఎన్నో గ్రూపులు కనిపిస్తుంటాయి. ఇందుక్కారణం ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువగా ఉండడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉంటారు.

గ్రూపు రాజకీయాలు, వర్గపోరుకు కేరాఫ్ ఆ పార్టీ.. ఏ రాష్ట్రంలో ఎన్ని వర్గాలు ఉన్నాయో తెలుసా?
Congress President Mallikarjun Kharge with Congress Parliamentary Party (CPP) Chairperson Sonia Gandhi and party leader Rahul Gandhi
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 13, 2024 | 6:44 PM

రాజకీయ పార్టీల్లో అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు ఆ పార్టీని వర్గాలుగా చీల్చేస్తుంది. జాతీయ పార్టీల్లో ఈ తరహా వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లో ఒక కుటుంబమే ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటుంది కాబట్టి సాధారణ పరిస్థితుల్లో వర్గాలు కనిపించవు. అయితే ఆ కుటుంబంలో రాజకీయ వారసులు ఒకరి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీల్లో సైతం వర్గ పోరు తప్పదు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయ కహానీలు చూస్తూనే ఉంటాం. అయితే ‘వర్గ పోరు’ అన్న మాట ఎక్కువగా వినిపించేది, కనిపించేది మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ పార్టీలో జాతీయ స్థాయిలో ఒక కుటుంబ పెత్తనం నడిచినా… రాష్ట్రస్థాయిలో మాత్రం ఎన్నో గ్రూపులు కనిపిస్తుంటాయి. ఇందుక్కారణం ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువగా ఉండడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉంటారు. ఈ గ్రూపు రాజకీయాలు, వర్గపోరు చివరకు ఆ పార్టీ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీస్తూ ఉంటుంది. తాజాగా హర్యానాలో మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, ఎంపీ కుమారి శెల్జా గ్రూపుల కారణంగా పార్టీకి చాలా నష్టం జరిగిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. త్వరలో మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హర్యానా తరహా పరిస్థితులే ఆ రాష్ట్రాల్లోనూ కొనసాగితే.. ప్రత్యర్థుల పోరాట పటిమ కంటే స్వయంకృతాపరాధాలే పార్టీని పరాజయం వైపు పరుగులు తీయిస్తాయి.

కాశ్మీర్ నుంచి కర్ణాటక వరకు, యూపీ నుంచి రాజస్థాన్ వరకు అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాల సమస్యను ఎదుర్కొంటోంది. ఇది కొత్తగా ఏర్పడ్డ సమస్య కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. కాంగ్రెస్ అధిష్టానం ఆయా రాష్ట్రాల నాయకత్వాలను ఈ విషయంపై ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. 2022లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన ‘చింతన్ శిబిర్’లో సోనియా గాంధీ స్వయంగా గ్రూపు రాజకీయాల గురించి మాట్లాడారు. నేతలు త్యాగాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని, వ్యక్తిగత ప్రయోజనాలు విడనాడి పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇంతచెప్పినా.. చివరకు రాజస్థాన్‌లోనే అశోక్ గెహ్లాత్, సచిన్ పైలట్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఆగలేదు. ఫలితంగా ఆ రాష్ట్రంలో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరిన రాష్ట్రాల్లో పార్టీ తీవ్రంగా నష్టపోయింది. కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సాధారణ సమయంలో వర్గపోరు కనిపించినా.. ఎన్నికల సమయానికి అందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఐకమత్యంతో పనిచేయడంతో విజయాలు సాధ్యమయ్యాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్గపోరు సమస్యను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌లో.. ఏ రాష్ట్రంలో ఎన్ని వర్గాలున్నాయో తెలుసుకుందాం.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు…

1. కాశ్మీర్ నుంచి మొదలుపెడితే.. లోయలో కాంగ్రెస్ 3 వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు హమీద్ కర్రాకు చెందినది. రెండో వర్గానికి వికార్ రసూల్ వనీ నాయకత్వం వహిస్తుండగా.. మూడో గ్రూప్ గులాం అహ్మద్ మీర్‌ది. స్థానికంగా బలంగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తులో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. మొత్తం 37 స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం 6 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. అది కూడా నేషనల్ కాన్ఫరెన్స్ పుణ్యమేనని ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. వర్గపోరు కారణంగానే కాంగ్రెస్ తన ప్రత్యర్థిని ఢీకొట్టలేకపోయిందని అధిష్టానం భావిస్తోంది.

2. మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ 4 గ్రూపులుగా చీలిపోయింది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే అనుకూలవర్గం అందులో మొదటిది. రెండవ వర్గానికి బాలాసాహెబ్ థోరట్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ రెండు వర్గాలకు పోటీగా వర్షా గైక్వాడ్‌ కూడా ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిపక్ష నేత విజయ్‌ వాడెట్టివార్‌ సైతం తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని రాజకీయం చేస్తున్నారు. మరికొద్ది నెలల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ గ్రూపు రాజకీయాలు పార్టీ అధిష్టానాన్ని అసహనానికి గురిచేస్తున్నాయి. హర్యానాలో గెలుపు వాకిట బోల్తాపడడంతో ఈ రాష్ట్రంలో మిత్రపక్షాలతో ఎక్కువ సీట్లను డిమాండ్ చేసే పరిస్థితి కూడా లేకపోయింది. కనీసం పోటీ చేసే ప్రతి సీటునూ గెలవాల్సిన స్థితిలో వర్గపోరుతో ప్రత్యర్థులు లాభపడతారని అధిష్టానం పెద్దలు ఆందోళన చెందుతున్నారు.

3. మధ్యప్రదేశ్‌లోనూ 4 గ్రూపులున్నాయి. కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ వంటి జాతీయస్థాయి అగ్రనేతలు ఈ రాష్ట్రానికి చెందినవారే. ఈ ఇద్దరికీ చెరొక వర్గం ఉంది. వారితో పాటు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అరుణ్ యాదవ్‌కు ఒక వర్గం ఉంది. అలాగే మరో సీనియర్ నేత అజయ్ సింగ్ సైతం ఒక వర్గాన్ని నడుపుతున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర నాయకత్వంలో నెలకొన్న అనైక్యత కూడా పరాజయానికి కారణమని అధిష్టానం భావిస్తోంది. ఈ మధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సైతం పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.

4. చిన్న రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో కూడా కాంగ్రెస్ 3 వర్గాలుగా చీలిపోయింది. మాజీ సీఎం భూపేష్ బఘేల్, సీనియర్ నేతలు టీఎస్ సింగ్‌దేవ్, భక్తచరణ్ దాస్‌లు తలా ఒక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు సీఎం భూపేష్ భఘేల్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక సమీకరణాలు ఆ పార్టీని గెలిపిస్తాయన్న చర్చ కూడా జరిగింది. ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా పెద్దగా కనిపించలేదు. అయినా సరే ఎన్నికల్లో ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ (BJP) గెలుపొందింది. ఈ ఓటమికి పార్టీలోని అనైక్యతే కారణమన్న విశ్లేషణలు వచ్చాయి.

4. రాజస్థాన్‌లో 3 గ్రూపులు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఒక వర్గానికి మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ నాయకత్వం వహిస్తున్నారు. శాంతి ధరివాల్ వంటి నేతలు ఈ వర్గంలోనే ఉన్నారు. యువ నాయకులతో సచిన్ పైలట్ మరో వర్గాన్ని నడుపుతున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య నెలకొన్న వర్గపోరు గురించి యావద్దేశానికి తెలుసు. అంతగా రచ్చ చేసుకున్నారు. పార్టీ అధికారంలో ఉండగానే సచిన్ పైలట్ తన వర్గం నేతలతో క్యాంపులు పెట్టి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం కూడా చేశారు. అధిష్టానం బుజ్జగింపుతో దిగొచ్చినా.. వర్గపోరు మాత్రం ఆగలేదు. తమ పార్టీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు చేశారంటేనే ఈ వర్గపోరు ఎంతగా బజారున పడిందో అర్థమవుతుంది. సోనియా గాంధీ స్వయంగా రాజస్థాన్ వేదికగానే గ్రూపు రాజకీయాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ దిశానిర్దేశం చేశారు. అయినా సరే ఇద్దరిలో ఏ ఒక్కరూ రాజీ పడలేదు. ఫలితంగా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైంది. ఈ రెండు వర్గాలతో పాటు భన్వర్ జితేంద్ర సింగ్‌ కూడా మరో వర్గానికి ప్రాతనిధ్యం వహిస్తున్నారు. ఈ వర్గంలో ప్రతిపక్ష నేత టీకా రామ్ జూలీ ఉన్నారు.

5. పంజాబ్‌లోనూ అనేక వర్గాలున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజా వడింగ్, మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా, మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలున్నాయి. సుఖ్‌జీందర్ సింగ్ రంధావాతో సహా చాలా మంది నాయకులు, హైకమాండ్‌కు మద్దతుదారులు ఏ గ్రూపులోనూ లేరు. 2017 నుంచి 2022 వరకు ఇక్కడ అమరీందర్, నవజ్యోత్ వర్గం ఉండేది. అమరీందర్ సింగ్ కాంగ్రెస్ వీడి బయటికొచ్చిన తర్వాత పార్టీ మరిన్ని వర్గాలుగా చీలిపోయింది. ఫలితంగా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధికారంలోకి రాగలిగింది.

6. బీహార్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లోనూ గ్రూపులే. సాధారణంగా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి. అధికారం, పదవులు, ఆధిపత్యం కోసం గ్రూపులు ఏర్పడుతుంటాయి. బిహార్‌లో గత కొన్ని దశాబ్దాలుగా పార్టీ నేరుగా అధికారంలో లేదు. కానీ ఇక్కడ అనేక గ్రూపులుగా పార్టీ చీలిపోయింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్‌తో పాటు తారిఖ్ అన్వర్, మదన్ మోహన్ ఝా, మీరా కుమార్ వంటి నేతలు ఈ వర్గాలకు సారథులుగా ఉన్నారు.

జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమిలో భాగంగా అధికారంలో ఉంది. ఇక్కడ కూడా పార్టీ అనేక వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్‌కు చెందినది కాగా రెండో వర్గం మంత్రి రామేశ్వర్ ఓరాన్‌ది. వీరితో పాటు హైకమాండ్‌కు దగ్గరగా ఉన్న మంత్రి దీపికా పాండే వంటి నేతలు ఈ రెండు వర్గాలతో సంబంధం లేకుండా రాజకీయం చేస్తున్నారు.

7. హర్యానా – హిమాచల్‌ ప్రదేశ్‌లో రెండేసి వర్గాలున్నాయి. హర్యానాలో మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా , ఎంపీ కుమారి సెల్జా మధ్య పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. సెల్జా వర్గంలో రణదీప్ సింగ్ సుర్జేవాలా, కెప్టెన్ అజయ్ యాదవ్ వంటి నేతలు ఉన్నారు. హుడా గ్రూపులో చౌదరి ఉదయభాన్, వరుణ్ చౌదరి వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. సెల్జా వర్గం నేతలను ఓడించేందుకు భూపిందర్ సింగ్ రెబెల్ అభ్యర్థులను ప్రోత్సహించారని సెల్జా వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ రాష్ట్రంలో గెలవాల్సిన స్థితిలో ఉన్న పార్టీ స్వల్ప తేడాతో అనేక సీట్లను కోల్పోయింది. ఫలితంగా అధికారం చేతికి చిక్కకుండా పోయింది.

హర్యానా పొరుగున ఉన్న హిమాచల్‌లో కూడా కాంగ్రెస్ రెండు గ్రూపులుగా చీలిపోయింది. హిమాచల్‌లో కాంగ్రెస్‌లో సీఎం సుఖ్‌విందర్ సుఖు వెంట ఒక వర్గం ఉండగా, అంతే బలంగా ప్రతిభ వర్గం ఉంది.

8. అస్సాం-బెంగాల్ రాష్ట్రాల్లో సైతం పరిస్థితి మరోలా లేదు. అస్సాంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు భూపేన్ బోరా, లోక్‌సభలో ఉపనేత గౌరవ్ గొగోయ్ చెరొక వర్గం నడుపుతుండగా.. దేవవ్రత్ సకియా మూడో గ్రూపును నడుపుతున్నారు. ప్రతి గ్రూపులోనూ పార్టీలో పేరున్న నేతలు చాలా మందే ఉన్నారు.

బెంగాల్‌లో అధిర్ రంజన్ చౌదరికి ప్రత్యేక గ్రూపు ఉంది. అధిర్ గ్రూపులో ముర్షిదాబాద్, మాల్దా ప్రాంతాలకు చెందిన నేతలున్నారు. మరో వర్గానికి దీపాదాస్ మున్షీ నాయకత్వం వహిస్తున్నారు. గతంలో ప్రియరంజన్ దాస్ మున్షీతో కలిసి రాజకీయం చేసిన నేతలు దీపాదాస్ వర్గంలో ఉన్నారు. ఇలా ఆ రాష్ట్రంలో కూడా పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది.

9. ఉత్తరాఖండ్‌లో కూడా గ్రూపు విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. హిమాలయ పర్వతాల్లో కొలువుదీరిన ఈ రాష్ట్రంలో మాజీ సీఎం హరీశ్‌ రావత్‌‌తో పాటు కరణ్‌ మహరా, గణేష్‌ గొడియాల్‌ వంటి నేతలు తలా ఒక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

10. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వర్గ విబేధాలున్నాయి. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వర్గాలు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ రెండు గ్రూపులతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన కుమారుడు ప్రియాంక్ ఖర్గే ద్వారా ఒక వర్గాన్ని నడుపుతున్నారు. గత ఏడాది ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, వర్గ పోరు కారణంగా మరోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకుండా చేసుకుంటోంది.

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ వర్గాలుగా చీలిపోయిన పార్టీని ఏకతాటిపైకి తెచ్చారు. గత ఏడాది ఎన్నికలు జరిగే వరకు పార్టీలో రేవంత్ రెడ్డి వర్గం, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గంగా పార్టీ రెండుగా చీలిపోయి ఉండేది. కోమటిరెడ్డి వెంకట రెడ్డి, మధుయాష్కి గౌడ్ వంటి మరికొందరు సీనియర్ నేతలు ఈ రెండు వర్గాలతో సంబంధం లేకుండా నేరుగా ఏఐసీసీ పెద్దలకు దగ్గరగా ఉండేవారు. అయితే ఎన్నికల సమయంలో ఈ వర్గపోరు, గ్రూపు రాజకీయాలు పార్టీకి చేటు చేస్తాయని గ్రహించిన రేవంత్ రెడ్డి ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతూ, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ పార్టీ సీనియర్ల మధ్య ఐకమత్యాన్ని సాధించారు. ఫలితంగా కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తలా ఒక వర్గాన్ని నడుపుతున్నారని వార్తలు, విశ్లేషణలు ఉన్నప్పటికీ.. అవి బయటపడకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

11. దేశ రాజధాని ఢిల్లీలోనూ తప్పని వర్గపోరు. ఢిల్లీలో దేవేంద్ర యాదవ్ ఒక వర్గానికి నాయకత్వం వహిస్తుండగా.. ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకెన్ వర్గం కూడా ఢిల్లీలో కాంగ్రెస్ రాజకీయాలను శాసిస్తోంది. మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ (మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు)కు కూడా ఒక వర్గం ఉన్నప్పటికీ.. ఆ వర్గం బలహీన స్థితిలో ఉంది. ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వర్గపోరును ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తమకు అనుకూలంగా మార్చుకుని రాజధానిలో పాగా వేసింది.

12. అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో 3 వర్గాలు చాలా చురుగ్గా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు అజయ్ రాయ్‌ అనుకూలంగా ఒక వర్గం ఉండగా.. ఏఐసీసీలో కీలక బాధ్యతల్లో ఉన్న పీఎల్ పూనియా, ప్రమోద్ తివారీలకు కూడా చెరొక వర్గం ఉంది.

13. గుజరాత్‌లో కూడా కాంగ్రెస్ భరత్ సింగ్ సోలంకి, శక్తి సింగ్ గోహిల్ సహా మరికొన్ని గ్రూపులుగా చీలిపోయింది. గత 30 ఏళ్లుగా పార్టీ అధికారంలో లేనప్పటికీ పార్టీలో ఐక్యత మాత్రం సాధ్యం కావడం లేదు.

14. ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీలను అందించిన రాష్ట్రాల్లో ఒకటైన కేరళలో కూడా పార్టీ వర్గపోరుతో సతమతమవుతోంది. ఇక్కడ పార్టీ దాదాపు 3 వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గానికి రమేష్ చెన్నితల నాయకత్వం వహిస్తుండగా.. రెండో వర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు సుధాకరన్ నడుపుతున్నారు. వీరితో పాటు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్‌కు అనుకూలంగా ఆ రాష్ట్రంలో ఒక వర్గం ఏర్పాటైంది. అయితే ఈ వర్గపోరును ప్రత్యర్థులు అనుకూలంగా మలచుకోలేకపోవడమే ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడానికి కారణమైంది. కానీ రాష్ట్రంలో మాత్రం కమ్యూనిస్టు పార్టీల కూటమి అధికారంలో ఉంది.

ఇలా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా కాంగ్రెస్ పార్టీలో వర్గాలు, గ్రూపులు కనిపిస్తాయి. అలాగని ఈ పరిస్థితి కేవలం కాంగ్రెస్‌లో మాత్రమే ఉందనుకోడానికి వీల్లేదు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ (BJP) సహా కమ్యూనిస్టులు, ఇతర ప్రాంతీయ పార్టీల్లోనూ గ్రూపు తగాదాలు, వర్గ విబేధాలున్నాయి. అయితే కాంగ్రెస్ మాదిరిగా మరీ రచ్చ చేసుకోవడం లేదు. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం మోతాదు మించి మితిమీరిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటూ “పార్టీకి ఏం జరిగినా ఫరవాలేదు, తమ పంతం మాత్రం వీడేది లేదు” అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తున్నారు. వరుస ఓటములు వెంటాడుతున్న ఈ పరిస్థితుల్లోనైనా ఆ పార్టీ నేతల్లో మార్పు రావాలని అధిష్టానం ఆశిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు