AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Elections 2022: ఉచిత హామీలు హస్తం పార్టీని గట్టెక్కిస్తాయా.. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ భయం..?

గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వంపై సాధారణంగా ఉండే వ్యతిరేకతతో పాటు.. పేద, మధ్య తరగతి ప్రజలను ఆకర్షించడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. దీనిలో భాగంగా గుజరాత్‌లో..

Gujarat Elections 2022: ఉచిత హామీలు హస్తం పార్టీని గట్టెక్కిస్తాయా.. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ భయం..?
Gujarat Assembly Election
Amarnadh Daneti
|

Updated on: Nov 13, 2022 | 2:06 PM

Share

గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వంపై సాధారణంగా ఉండే వ్యతిరేకతతో పాటు.. పేద, మధ్య తరగతి ప్రజలను ఆకర్షించడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. దీనిలో భాగంగా గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. యువకులు, గృహిణులు, రైతులను ఆకర్షించే విధంగా ఎన్నికల ప్రణాళికను రూపొందించింది. ఇప్పటికే పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణంతో పాటు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి హామీలను ఆమ్ ఆద్మీ పార్టీ ఇవ్వడంతో దీనికి మించి కాంగ్రెస్ హామీలను గుప్పించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగులకు నెలకు రూ.3వేల భృతి, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతులకు రూ.3లక్షల వరకు రుణమాఫీ వంటి హామీలను ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చినట్లు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీని కాంగ్రెస్ పార్టీ సైతం ఇచ్చింది. ఈ హామీలకు ప్రజలు ఆకర్షితులవుతారా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అనేది మాత్రం ఫలితాల తర్వాతే తేలనుంది. గుజరాత్‌లో వరుసగా 25 ఏళ్లకు పైగా అధికారంలో ఉండటంతో బీజేపీ ప్రభుత్వంపై సాధారణంగా కొంత ప్రజావ్యతిరేకత ఉండే అవకాశం ఉంటుందని, అయితే ప్రభుత్వాన్ని మార్చాలనేంత ఉండకపోవచ్చనేది రాజకీయ పండితుల అంచనా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు చీలిస్తే బీజేపీకి కలిసివచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీకి సంప్రాదాయ ఓటు బ్యాంకు ఉంది. ఆ ఓటర్లంతా బీజేపీకి మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చని, దానికి తోడు కేంద్రంలో బీజేపీ ఉండటం, ప్రధాని నరేంద్రమోదీ, హోమంత్రి అమిత్‌ షా సొంత రాష్ట్రం కావడంతో.. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే గుజరాత్‌లోనూ బీజేపీ ఉంటే బెటర్ అనే ఆలోచనలో ప్రజలు ఉన్నట్లు కొన్ని సర్వే సంస్థలు గతంలోనే అంచనావేశాయి. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీలో ఉండటం, అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక దృష్టిసారించడం ద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకుకే ఇబ్బందులనే చర్చ సాగుతోంది. మొత్తం మీద గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల ఏ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనేది మాత్రం ఫలితాల తర్వాత తెలియనుంది.

మరోవైపు ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ముచ్చటగా మూడో రాష్ట్రంగా గుజరాత్ లో పాగా వేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎలాగైనా పాగా వేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ తనదైన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. గుజరాత్‌ వ్యాప్తంగా ఇప్పటికే విస్తృతంగా పర్యటించిన ఆయన గ్రామీణ ప్రజలను ఆకట్టుకోవడం కోసం అనేక హామీల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఎన్నికలు వీరిద్దరికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక్కడి గెలుపు, ఓటములు జాతీయ స్థాయిలోనూ ప్రభావం చూపించే అవకాశం ఉంది.

ఈనెల 12వ తేదీన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు హిమాచల్ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసినప్పటికి.. అరవింద్ కేజ్రీవాల్ ఎక్కువ దృష్టి గుజరాత్ పైనే కేంద్రీకరించారు. హిమాచల్ ప్రదేశ్ ను అంత సీరియస్‌ గా తీసుకోనట్లు కన్పించింది. గుజరాత్ లో బీజేపీని బలహీనపర్చి తన బలాన్ని పెంచుకోవడం ద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని, తద్వారా జాతీయ రాజకీయ అరంగ్రేటం చేయాలనే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే గుజరాత్ ను ప్రధానంగా కేజ్రీవాల్ టార్గెట్ గా పెట్టుకున్నారు. కాంగ్రెస్ బలహీనపడిన నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేసి.. గెలవకపోయినా ప్రతిపక్ష స్థానానికి ఎదగాలని కేజ్రీవాల్ ప్లాన్ గా తెలుస్తోంది. మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరి కొంపలు ముంచుతుందనేది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ హామీలు ఆ పార్టీకి ఏ మేర లాభం కలిగిస్తాయనేది వేచిచూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..