Rahul Gandhi: ‘పేద విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోవాలని బీజేపీ కోరుకోవడంలేదు’.. జోడో యాత్రలో కీలక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత
భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్కూల్ విద్య విషయంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. విద్యాలయాల్లో సామాన్య విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలని బీజేపీ ప్రభుత్వం..
భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్కూల్ విద్య విషయంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. విద్యాలయాల్లో సామాన్య విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలని బీజేపీ ప్రభుత్వం అనుకోవడంలేదు కానీ ఆ పార్టీ నాయకుల పిల్లలందరూ ఇంగ్లీష్ చదువులే చదువుతున్నారని అన్నారు. సోమవారం రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఇంగ్లీష్ విద్య ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. ‘‘పాఠశాలల్లో విద్యను ఇంగ్లీష్ మీడియంలో నేర్పించాలని బీజేపీ నాయకులు కోరుకోవడం లేదు. కానీ వారి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు. పేద రైతులు, కూలీల పిల్లలు ఇంగ్లీష్ విద్యను నేర్చుకుని ఉన్నత స్థాయికి వెళ్లడం బీజేపీకి ఇష్టం లేదు’’ అని రాహుల్ ఆ ర్యాలీలో అన్నారు.
ఇంకా రాహుల్ తన మాటలను కొనసాగిస్తూ ‘‘ ప్రపంచంలోని ఇతర భాషలవారితో మాట్లాడాలని మీరు అనుకుంటే మీకు హిందీ పనికిరాదు, కానీ మీకు ఇంగ్లీష్ పని చేస్తుంది. దేశంలోని రైతులు, కూలీల పిల్లలు ఇంగ్లీష్ విద్యను నేర్చుకొని అమెరికన్లతో పోటీపడాలని, వారిని వారి భాషతోనే ఓడించాలని మేము కోరుకుంటున్నాము’’ అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వంలోని కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా బీజేపీ నేతలందరి పిల్లలు ఇంగ్లీషు మీడియం స్కూళ్లకు వెళతారు. ‘‘ రైతుల పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవకూడదని బీజేపీ కోరుకుంటోంది. ఎందుకంటే మీరు చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవడం ఆ పార్టీకి ఇష్టం లేదు’’ అని రాహుల్ అభిప్రాయపడ్డారు.
LIVE: कांग्रेस अध्यक्ष श्री @kharge जी एवं श्री @RahulGandhi जी की मालाखेड़ा (अलवर) में विशाल जनसभा#AlwarBoleBharatJodo#BharatJodoYatrahttps://t.co/U6rBARph50
— Govind Singh Dotasra (@GovindDotasra) December 19, 2022
అయితే ఇంగ్లీష్ చదువులపై రాహుల్ గాంధీ తాను చేసిన వ్యాఖ్యలను వివరిస్తూ ‘‘హిందీ, తమిళం వంటి ఇతర ప్రాంతీయ భాషలలో చదవకూడదని నేను చెప్పడం లేదు. కానీ ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి’’ అని అన్నారు. రాజస్థాన్‌లో దాదాపు 1,700 ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ప్రారంభించినట్లు రాహుల్ తెలిపారు. ‘‘ పేద విద్యార్థులు ఇంగ్లీష్ విద్యను అభ్యసించి అమెరికన్లతో పోటీ పడాలి. రాజస్థాన్‌లో 1700 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది” అని కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..