AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంచే చేను మేస్తే .. ఎయిర్‌పోర్ట్‌లో ఈ మస్కా యవ్వారం గురించి తెలిస్తే.. మీరు బిత్తరపోవడం ఖాయం!

దేశంలోని వివిధ ప్రాంతాలకు డొమెస్టిక్ ఫ్లైట్‌ల్లో ప్రయాణం చేసేవారికి అక్కడున్న భద్రత ప్రమాణాలు చూస్తే ఎంత కట్టుదిట్టమైన పరిస్థితులు ఉంటాయో అందరికీ తెలిసిందే! అలాంటిది ఇతర దేశాలకు ప్రయాణం చేసే సమయంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్ద భద్రత మరింత కట్టుదిట్టంగా ఉంటుంది.

కంచే చేను మేస్తే .. ఎయిర్‌పోర్ట్‌లో ఈ మస్కా యవ్వారం గురించి తెలిస్తే.. మీరు బిత్తరపోవడం ఖాయం!
Chennai Airport
Ch Murali
| Edited By: Balaraju Goud|

Updated on: Jul 18, 2024 | 12:07 PM

Share

దేశంలోని వివిధ ప్రాంతాలకు డొమెస్టిక్ ఫ్లైట్‌ల్లో ప్రయాణం చేసేవారికి అక్కడున్న భద్రత ప్రమాణాలు చూస్తే ఎంత కట్టుదిట్టమైన పరిస్థితులు ఉంటాయో అందరికీ తెలిసిందే! అలాంటిది ఇతర దేశాలకు ప్రయాణం చేసే సమయంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్ద భద్రత మరింత కట్టుదిట్టంగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి ప్రయాణాలు చేసేవారు నిషేధిత ప్రమాదకరమైన విలువైన వస్తువులు రవాణా చేయకుండా ఉండడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. బంగారం వజ్రాలు డ్రగ్స్ జరగకుండా ఉండేందుకు అనేక అంచెల భద్రత ఉంటుంది.

రెగ్యులర్‌గా ఉండే స్కానర్ల నుంచి కస్టమ్స్ అధికారుల వరకు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను అణువణువు తనిఖీ చేస్తుంటారు. అందులోనూ తరచూ ఒకే దేశానికి వెళ్లి వచ్చే ప్రయాణికులు పట్ల మరింత జాగ్రత్తగా వాళ్ళను ట్రాక్ చెక్ చేస్తూ ఉంటారు. ఇటీవల చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద నుంచి కొద్ది నెలల్లోనే దాదాపు రూ. 167 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే చెన్నై విమానాశ్రయంలో జరుగుతున్న బంగారం స్మగ్లర్లను కట్టడి చేసేందుకు ఇంటలిజెన్స్ అధికారుల హెచ్చరికలతో అంతర్జాతీయ ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు దాదాపు 60 మంది ప్రత్యేక సిబ్బందిని అదనంగా నియమించారు. అయితే ఆ తర్వాత కూడా విదేశాల నుంచి చెన్నై మీదుగా అక్రమ బంగారం తమిళనాడులోకి వస్తున్నట్లు గుర్తించారు. తనిఖీలు ముమ్మరంగా ఉన్న బంగారం బయటకు ఎలా వస్తోంది అన్న అనుమానంతో నిఘా పెంచిన ఐబి అధికారులకు ఎక్కడో అనుమానం మొదలైంది. దీంతో ఆ దిశగా విచారణ చేపట్టారు.

చెన్నై విమానాశ్రయం వేదికగా తరచూ జరుగుతున్న స్మగ్లింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన కస్టమ్స్ ఐబీ అధికారులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తరచూ తనిఖీల్లో పట్టుబడుతున్న బంగారమే కాకుండా ఎవరికి అనుమానం రాకుండా కొరియర్ సర్వీసుల ద్వారా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఎయిర్‌పోర్టులో పనిచేసే కస్టమ్స్ అధికారులే కొంతమంది సహకరిస్తున్నట్టు విచారణలో తేలింది. చెన్నై ఎయిర్‌పోర్టులో ఉండే సావనీర్ షాప్‌లో ఐటమ్స్ కొనుగోలు చేసి నేరుగా తీసుకెళ్లలేని వారికి పార్సెల్ డెలివరీ చేసే సదుపాయం ఉంటుంది. ఈ అవకాశాన్ని వాడుకుని ఆర్టికల్స్ డెలివరీ ఇస్తున్నట్టుగా కలరింగ్ ఇస్తూ అక్రమ బంగారాన్ని బయటకు పంపుతున్నట్టు విచారణలో తేలింది.

ఈ ప్రక్రియలో తనిఖీలు కఠినంగా లేకుండా, అంతంత మాత్రమే చేయడం ద్వారానే బంగారం పార్సిళ్ళ రూపంలో బయటకు వెళుతున్నట్లు తేలింది. దీంతో స్మగ్లింగ్‌కు సహకరించిన వారిని గుర్తించిన ఉన్నతాధికారులు, నలుగురు కస్టమ్స్ అధికారులను సస్పెండ్ చేసినట్టు తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. విచారణ పూర్తయితే ఇంకా ఇందులో ఉన్న వారి వివరాల కూడా తెలుస్తాయని చెబుతున్నారు. ముందుగానే విషయం బయటపడితే అసలు దొంగలు జాగ్రత్త పడతారన్న కారణంగానే విషయం బయటకు చెప్పనట్లు తెలుస్తోంది.

చెన్నై విమానాశ్రయంలో బయటపడ్డ కొత్త తరహా స్మగ్లింగ్ విధానం దేశంలోని మిగిలిన ఎయిర్‌నోర్ట్‌లో కూడా జరుగుతుందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా రహస్యంగా విచారణ జరుగుతుందన్న సమాచారం. ఒకవేళ అదే నిజమైతే ప్రయాణికుల రూపంలో పట్టుబడుతున్న బంగారం, వజ్రాల కంటే వంద రెట్ల ఎక్కువ స్మగ్లింగ్ ఆ రూపంలో జరిగే అవకాశం ఉందన్న అనుమానం తలెత్తుతోంది..!

 మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..