AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జల వివాదాలకు చెక్.. దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపుతున్న మోదీ సర్కార్..

దశాబ్దాలుగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదాలకు కేంద్ర ప్రభుత్వం పరిష్కార మార్గం చూపుతోంది. యమునా, నర్మదా, సోన్, కృష్ణా జలాల పంపిణీపై రాష్ట్రాల మధ్య అలాగే, కావేరి వివాదంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్యలతో సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం కావడంతో పాటు రైతులకు నీటి భద్రత, ప్రజలకు తాగునీటి సౌకర్యం మెరుగుపడనుంది.

జల వివాదాలకు చెక్.. దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపుతున్న మోదీ సర్కార్..
India
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Jul 09, 2026 | 4:31 PM

Share

దశాబ్దాలుగా నలుగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదాలకు తెరపడే సమయం ఆసన్నమైంది. కేంద్ర ప్రభుత్వం చొరవతో ‘నీటి యుద్ధాలు’ ఆగి, సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం కాబోతున్నాయి. అపారమైన జల వనరులున్నా.. కేవలం వివాదాల వల్ల ఆగిపోయిన ప్రాజెక్టులకు ఈ ఒప్పందాలు కొత్త ఊపిరి పోస్తున్నాయి. దేశ అభివృద్ధిని కుంటుపరుస్తున్న కీలక అంశాల్లో అంతర్రాష్ట్ర జల వివాదాలు ఒకటి. దశాబ్దాల పాటు సాగిన న్యాయ పోరాటాల వల్ల రైతులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రధాని మోదీ సూచనల మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ రంగంలోకి దిగి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరపడంతో పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది.

గత నెల రోజుల్లో సాధించిన మైలురాళ్లు:

యమునా జలాల ఒప్పందం (జూన్ 29): దాదాపు 30 ఏళ్ల నాటి హరియాణా-రాజస్థాన్ యమునా జల వివాదం పరిష్కారమైంది. ఈ ఒప్పందంతో రాజస్థాన్‌లోని షెకావతి, హరియాణా సరిహద్దు ప్రాంతాలకు అదనపు నీటి లబ్ధి చేకూరుతుంది.

నర్మదా ప్రాజెక్టుల పరిష్కారం (జూలై 7): గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య సర్దార్ సరోవర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల పునరావాసం, ఆర్థిక అంశాలపై ‘వన్‌-టైమ్ సెటిల్‌మెంట్’ పూర్తయింది.

రాబోయే కీలక ఒప్పందాలు:

కిషౌ బహుళార్థసాధక ప్రాజెక్టు (జూలై 15): హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హరియాణా రాష్ట్రాల మధ్య కీలక భేటీ జరగనుంది. టోన్స్ నదిపై కిషౌ ఆనకట్ట నిర్మాణంతో లక్షలాది మందికి తాగునీరు, విద్యుత్ అందుబాటులోకి రానున్నాయి.

సోన్ నది వివాదం: బీహార్, జార్ఖండ్ మధ్య సోన్ నది జలాల పంపిణీకి అంగీకారం కుదిరింది. ఒప్పందం ప్రకారం.. 7.75 MAF (Mean Annual Flow) నీటిలో జార్ఖండ్‌కు 2 MAF, బీహార్‌కు 5.75 MAF నీరు లభిస్తుంది. దీనివల్ల ఇంద్రపురి జలాశయ ప్రాజెక్టు మార్గం సుగమమైంది.

కృష్ణా జలాలు: కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కూడా సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మధ్యనే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రం ఒక వేదికపైకి తీసుకొచ్చింది.

కావేరిపై సందిగ్ధత.. కానీ ఆశాజనకం:

తమిళనాడు, కర్ణాటక మధ్య దశాబ్దాలుగా రగులుతున్న ‘కావేరి జల వివాదం’ ఇప్పటికీ అత్యంత సున్నితంగా ఉంది. అయితే, ఈ అంశాన్ని కూడా చర్చల ద్వారా పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, శాస్త్రీయమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ప్రయోజనం ఎవరికి?

కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం.. ఈ పరిష్కారాల వల్ల ప్రత్యక్షంగా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు, రాష్ట్రాలకు విద్యుత్ అందుతాయి. దశాబ్దాలుగా ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టులు తిరిగి పట్టాలెక్కడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ ‘కోఆపరేటివ్ ఫెడరలిజం’ (సహకార సమాఖ్య స్ఫూర్తి) విధానం దేశవ్యాప్తంగా సానుకూల మార్పులకు నాంది పలకనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us