CBSE Exams: విద్యార్థులు పరీక్షా కేంద్రాలను మార్చుకోవచ్చు…స్పష్టం చేసిన సీబీఎస్‌ఈ
వచ్చే నెలలో ప్రారంభకానున్న 10, 12వ తరగతి సెమిస్టర్ పరీక్షల కోసం విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను మార్చుకోవచ్చని...
వచ్చే నెలలో ప్రారంభకానున్న 10, 12వ తరగతి సెమిస్టర్ పరీక్షల కోసం విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను మార్చుకోవచ్చని సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) స్పష్టం చేసింది. కరోనా కారణంగా చాలామంది విద్యా్ర్థులు ప్రస్తుతం తాము చదువుతున్న పాఠశాలలు ఉన్న నగరాల్లో కాకుండా వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నారని, వారు తమకు అనుకూలంగా ఉండేలా ఆయా ప్రాంతాల్లోనే పరీక్షలు రాసే సౌలభ్యం కల్పిస్తున్నట్లు బోర్డు తెలిపింది. ‘కరోనా ప్రభావంతో చాలామంది విద్యార్థులు తమ పాఠశాలలు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉంటున్నారు. అక్కడి నుంచే ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పరీక్షా కేంద్రాలను మార్చాలని పలువురు విద్యార్థులు మా దృష్టికి తీసుకొచ్చారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. పరీక్షా కేంద్రాలు మార్చుకోవడానికి త్వరలోనే సీబీఎస్‌ఈ అధికారిక వెబ్ సైట్‌లో ప్రత్యేక విండోను ప్రారంభించనున్నాం. అవసరమైన వారు ఈ విషయమై తమ రిక్వె్స్టులను పంపించవచ్చు. ఇందుకోసం విద్యార్థులు, పాఠశాలలు ఎప్పటికప్పుడు మా వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ ఉండాలి. అయితే స్కూల్ ఉన్న నగరంలోనే మరో పరీక్షా కేంద్రానికి మార్చాలన్న విజ్ఞప్తులను అంగీకరించం’ అని సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ భరద్వాజ్ తెలిపారు. సీబీఎస్‌ఈ పదో తరగతి మొదటి సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 11న ముగుస్తాయి. అదేవిధంగా 12వ తరగతి పరీక్షలు డిసెంబర్ 1న మొదలై అదే నెల 22న పూర్తవుతాయి.
Also Read:
Telangana: ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ల విడుదల: ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..