Lalu Prasad Yadav: లాలూను వెంటాడుతున్న సీబీఐ.. మా నాన్నకు ఏమైనా జరిగితే అంటూ కుమార్తె వార్నింగ్..

ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసులో బీహార్‌ మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌ను సీబీఐ విచారించింది. ఢిల్లీ లోని లాలూ కూతురు మీసాభారతి నివాసంలో లాలూ యాదవ్‌ను సీబీఐ రెండు గంటల పాటు విచారించింది.

Lalu Prasad Yadav: లాలూను వెంటాడుతున్న సీబీఐ.. మా నాన్నకు ఏమైనా జరిగితే అంటూ కుమార్తె వార్నింగ్..
Lalu Prasad Yadav
Follow us
Janardhan Veluru

|

Updated on: Mar 07, 2023 | 3:12 PM

ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసులో బీహార్‌ మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌ను సీబీఐ విచారించింది. ఢిల్లీ లోని లాలూ కూతురు మీసాభారతి నివాసంలో లాలూ యాదవ్‌ను సీబీఐ రెండు గంటల పాటు విచారించింది. ఇటీవల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న లాలూ.. మీసా భారతి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.  లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలున్నాయి. దీనికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం లాలూ విచారణను ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఉదయం రెండుకార్లలో ఐదుగురు సీబీఐ అధికారులు మీసా భారతి నివాసానికి చేరుకున్నారు. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసులో లాలూను ప్రశ్నించారు.

2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదుచేసింది. బీహార్‌ మాజీ సీఎం లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, మరో 14 మందిపై ఛార్జిషీటు దాఖలు చేసింది. సోమవారం రబ్రీ దేవిని ఆమె నివాసంలో ఐదు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ.. లాలూను కూడా ఇవాళ విచారించింది.

ఢిల్లీ పీఠం కదిలిపోతుంది..

విచారణ పేరుతో తన తండ్రిని సీబీఐ వేధిస్తే ఢిల్లీ పీఠం కదిలిపోతుందని లాలూ కూతురు రోహిణి ట్వీట్‌ చేశారు. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ మండిపడ్డారు.  తన తండ్రి ప్రాణాలకు ఏమైనా జరిగితే దీనికి కారణమైన ఎవరినీ తాను విడిచిపెట్టబోనని ఆమె హెచ్చరించారు. అదే పనిగా తన తండ్రి లాలూను వేధిస్తున్నారని ఆరోపించారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. టైమ్ చాలా శక్తివంతమైనదని అందరూ గుర్తించుకోవాలన్నారు. తన తండ్రి లాలూకి రోహిణి  కిడ్నీ దానం చేసిన ఆయన ప్రాణాలు కాపాడటం తెలిసిందే.

తేజస్వి యాదవ్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు..

తేజస్వి యాదవ్‌ను తన దారిలోకి తెచ్చేందుకు సీబీఐని కేంద్రం పావుగా వాడుకుంటోందని కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ ఆరోపించారు. ఇలాంటి చర్యలతో కేంద్రం పట్ల ప్రజల్లో అసంతృప్తి మరింత పెరుగుతుందని వ్యాఖ్యానించారు.

రాజకీయ కారణాలతో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ రెండ్రోజుల క్రితం తీవ్ర ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్‌లో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ఆరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్ష నేతలను కేంద్రం వేధిస్తోందని ఆరోపించారు.