BRS: బోర్డర్ రాష్ట్రాలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్.. రాష్ట్రాల వారీగా పార్టీలతో పొత్తులు.. ఎత్తులు ఇలా..
ఏ రాష్ట్రాల్లో మెుదట పోటీ చేస్తారు? తెలంగాణ-కర్ణాటక, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ఎంపీ స్థానాలపై బీఆర్ఎస్ మొదటి బాణం గురిపెడుతున్నట్టు తెలుస్తోంది.
కేసీఆర్ జాతీయపార్టీ ప్రకటించారు. మరి మెుదట బీఆర్ఎస్ ఎక్కడ పోటీ చేస్తుందనే ఆసక్తి మొదలైంది. ఇంతకీ ఏ రాష్ట్రాల్లో మెుదట పోటీ చేస్తారు? తెలంగాణ-కర్ణాటక, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ఎంపీ స్థానాలపై బీఆర్ఎస్ మొదటి బాణం గురిపెడుతున్నట్టు తెలుస్తోంది. దేశ ప్రజల ప్రయోజనాల కోసమే బీఆర్‌ఎస్ ఆవిర్భవించిందని, తెలంగాణ కోసం కష్టపడినట్లే దేశం కోసం పనిచేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్. కర్ణాటక, మహారాష్ట్ర తమ మొదటి కార్యక్షేత్రాలన్నారు కేసీఆర్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌తో కలిసి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరి కర్ణాటకలో ఆయా నియోజకవర్గాల్ని జీడీఎస్ మిత్రధర్మం పాటిస్తూ బీఆర్ఎస్‌కు ఇచ్చేస్తుందా..? లేక జెడీఎస్ అభ్యర్థుల్ని గెలిపించేందుకు బీఆర్ఎస్ కృషిచేస్తుందా..? అన్న విషయాలపై ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య ఓ అవగాహన కుదిరినట్టు సమాచారం.
డిసెంబర్ మొదటి వారంలో కేసీఆర్ దేశ రాజధానిలో ర్యాలీకి నాయకత్వం వహించనున్నారు. ఇందులో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్, RJD తేజస్వి యాదవ్, JDS కుమారస్వామి, JVM శంకర్‌సింగ్ వాఘేలా పాల్గొంటారు. ఇదే నెల 9న హస్తినలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
రాష్ట్రాల వారీగా పార్టీలు.. పొత్తుల విషయానికి వస్తే…
కర్ణాటక: బీజేపీ అధికారంలో ఉంది. గతంలో అక్కడ కాంగ్రెస్- జేడిఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ప్రస్తుతం సత్సంబంధాలు ఆ రెండు పార్టీలకు లేవు. అయితే.. జేడీఎస్ కేసీఆర్ మద్దతు పలికింది.
మహారాష్ట్ర: ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలైన శివసేన, ఎన్సీపీ ఇప్పటికే తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. మహారాష్ట్రాలో కేసీఆర్ పార్టీని ఆ రెండు ఆహ్వానిస్తాయా..? ప్రస్తుత పరిస్థితుల్లో లేదనే చెప్పుకోవాలి. ఎన్‌సీపీ,శివసేన పార్టీలు కాంగ్రెస్, బీజేపీల్ని కాదని బీఆర్ఎస్‌తో టైఅప్ పెట్టుకుంటాయా..? అనేది ఆలోచించాల్సిన విషయమే..
తమిళనాడు: సుదీర్ఘ చరిత్ర ఉన్న ద్రవిడ పార్టీలు కలిగిన తమిళనాడులో ఇప్పటికే అధికారంలో ఉన్న డీఎంకే కాంగ్రెస్‌తో పొత్తులో ఉంది. ఏఐడీఎంకే సొంత పార్టీలోనే లుకలుకలు ఉన్నాయి. ప్రస్తుతం ఆపార్టీ బీజేపీ జట్టులోనే ఉంది. మరి బీఆర్‌కి ఏ పార్టీ మద్దతు దొరుకుతుంది?
కేరళ: ఈ రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీల కూటమి అధికారంలో ఉంది. లెఫ్ట్ పార్టీలు తెలంగాణలో టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నాయనీ.. జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్‌తోనే వెళ్తామని చెప్పినట్టు సమాచారం. కేరళలో కూడా కేసీఆర్ పార్టీ శాఖలు ఏర్పాటు చేసుకోవడానికి కమ్యునిస్టులు ఒప‌్పుకుంటారా? అని కూడా పెద్ద ప్రశ్న.
ఒడిశా: ఇక రాష్ట్రంలో అక్కడ బీజూ జనతాదళ్ అధికారంలో వరుసగా కొనసాగుతూ వస్తుంది. నవీన్ పట్నాయక్ కేసీఆర్‌కు రెడ్ కార్పెట్ వేస్తారా? లేదా చూడాలి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ కూడా బలంగా ఉంది.
బీహార్: ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఆర్జేడీ, జేడియూ కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ సహకారం కూడా ఉంది. మరి కేసీఆర్‌తో చేయి కలిపే పార్టీ ఏదో తెలియాలి.
పశ్చిమ బెంగాల్: కమ్యూనిస్టుల కంచు కోటను కూల్చేసిన ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ.. వేరే ఏపార్టీ తన రాష్ట్రంలోకి రానిచ్చే పరిస్థితి లేదు.. ఉండదు. దీదీ కూడా దేశవ్యాప్తంగా చక్రం తిప్పాలని చూస్తున్న సమయంలో.. బీఆర్ఎస్‌ని ఏమాత్రం ఆహ్వానిస్తుందనేది కూడా పెద్ద ప్రశ్నే.
ఢిల్లీ: ఇక దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తానే సొంతంగా అన్నీ రాష్ట్రాల్లో పుంజుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ మధ్య పంజాబ్‌లో పవర్ దక్కించుకుంది. అందుకే సెంట్రల్ ఢిల్లీపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ ఎంత మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
కశ్మీర్: కశ్మీర్‌లో ఉన్నది పీడీపీ. కానీ జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కేసీఆర్‌కు మద్దతు తెలుపుతాయో లేదో తెలియదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన గులామ్ నబీ అజాద్ కేసిఆర్ సపోర్ట్ చేసే అవకాశం కనబడుతోంది.
గుజరాత్: మోదీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న కేసీఆర్.. ఏకంగా ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలనుకుంటున్నారు? ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ పైనే గురి పెట్టారు. ఇందుకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా సహకారం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ నుంచి వలస వెళ్లినవారు ఎక్కువగా నివసిస్తున్న సూరత్ జిల్లాలో మూడు స్థానాల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. 2023 మేలో జరిగే కర్ణాటక ఎన్నికల్లోనూ బరిలోకి దిగేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసుకుంటుంది. జేడీఎస్ సహకారంతో హైదరాబాద్, కర్ణాటక ప్రాంతంలోని రాయిచూర్, బీదర్, గుల్బర్గా, యాద్గిర్, కొప్పల్ జిల్లాల్లో పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్: కేసీఆర్ ఏపీపైనా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలువుని కీలక నేతల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. అంతేకాదు కేసీఆర్‌కు ఏపీలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా BRS పార్టీని ప్రకటిస్తున్న సందర్భంగా మద్దతు తెలుపుతూ విజయవాడలో ప్లెక్సీలు కూడా వెలిశాయి. ఏపీ నుంచి వస్తున్న మద్దతును దృష్టిలో ఉంచుకుని భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసేలా BRS ముఖ్యనేతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి తరువాత విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, సీమపై కూడా ఫోకస్ పెట్టినట్టు సమాచారం.
కేసీఆర్ BRS పార్టీ ఏపీలోకి ఎంట్రీ ఇస్తుందన్న వార్తల నేపథ్యంలో తెలుగు రాష్ర్టాల నేతలు స్పందించారు..వాళ్లు ఏమన్నారో ఓసారి చూద్దాం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం