అస్సాం-మిజోరాం మధ్య మళ్ళీ ఉద్రిక్తత ..? సరిహద్దుల్లో బాంబు పేలుడు.. స్కూలు ధ్వంసం
కొన్ని రోజులుగా ప్రశాంతత నెలకొన్న అస్సాం-మిజోరాం రాష్ట్రాల మధ్య ,మళ్ళీ ఉద్రిక్తత తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం రాత్రి అస్సాం లోని హైలాకంది జిల్లాలో జరిగిన బాంబు పేలుడులో ఓ ప్రైమరీ స్కూలు ధ్వంసమైంది.
కొన్ని రోజులుగా ప్రశాంతత నెలకొన్న అస్సాం-మిజోరాం రాష్ట్రాల మధ్య ,మళ్ళీ ఉద్రిక్తత తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం రాత్రి అస్సాం లోని హైలాకంది జిల్లాలో జరిగిన బాంబు పేలుడులో ఓ ప్రైమరీ స్కూలు ధ్వంసమైంది. ఈ జిల్లాలోని సాహెబ్ మీరా ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే.. అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ దీనిపై మిజోరాం ముఖ్యమంత్రితో సంప్రదిస్తానని తెలిపారు.తక్షణమే దర్యాప్తు జరిపించాలని ఆయనను కోరుతానని అలాగే ఈ ఘటన అస్సాంలో జరిగింది గనుక ఇక్కడ పోలీసు ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుందని ఆయన చెప్పారు. సరిహద్దుల్లో అక్కడక్కడా చెదురుమదురుగా చిన్నపాటి హింసాత్మక ఘటనలు జరగవచ్చునని ఇంటెలిజెన్స్ నివేదికలు సూచించాయని ఆయన చెప్పారు. ఉభయ రాష్ట్రాల మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాల్సిన బాధ్యత తమ ఇద్దరిమీదా ఉందని ఆయన చెప్పారు. ఇటీవల హిమంత శర్మ ..ఢిల్లీకి వెళ్లి.. సరిహద్దుల్లోని పరిస్థితిపై హోమ్ శాఖ అధికారులతోను, బీజేపీ నేతలతోనూ చర్చించారు.
గత నెలలో రెండు రాష్ట్రాల పోలీసులు, స్థానికుల మధ్య జరిగిన ఘర్షణల్లో అస్సాంకు చెందిన ఏడుగురు పోలీసులు మరణించగా.. ఉభయ రాష్ట్రాల ప్రజల్లో సుమారు 80 మందికి పైగా గాయపడ్డారు. అస్సాం సీఎం హిమంత శర్మపై మిజోరాం పోలీసులు కేసు పెట్టగా మిజోరాం ఎంపీపై అస్సాం పోలీసులు కేసు పెట్టారు. ఇలా కొన్ని రోజులపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. అయితే హోం మంత్రి అమిత్ షా జోక్యంతో పరిస్థితి సద్దు మణిగింది. ఇలా ఉండగా హైలాకంది జిల్లా సరిహద్దుల్లో మిజోరాం వాసులు నిర్మాణ పనులు ప్రారంభించారని, దీన్ని నిలిపివేయాలని సంబంధిత ప్రాంత ఎమ్మెల్యే సుదామ్ ఊదిన్ లష్కర్ కోరారు. ఇది మళ్ళీ టెన్షన్ ని పెంచే చర్య అని ఆయన ఆరోపించారు. అయితే అలాంటి నిర్మాణాలేవీ జరగడం లేదని మిజోరాం అధికారులు ఖండించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: యూపీలో బీజేపీ ఎమ్మెల్యే కారుపై రైతుల దాడి.. బురద జల్లి, నల్లసిరా పూసిన స్థానికులు
యూపీలో బీజేపీ ఎమ్మెల్యే కారుపై రైతుల దాడి.. బురద జల్లి, నల్లసిరా పూసిన స్థానికులు