Women’s Reservation: సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తున్న మహిళా ఎంపీలు.. ఎక్కడో తెలుసా?
Women's Reservation: భారతదేశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచిన జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లోనైనా.. గత నెలలో జరిగిన భారత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనైనా లింగ సమానత్వం, మహిళా సాధికారత అంశాలే ప్రధాన అజెండాగా మారాయి. చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలని, చట్టాల రూపకల్పనలో వారి భాగస్వామ్యం పెరగాలన్నదే 'మహిళా రిజర్వేషన్ల బిల్లు' ఉద్దేశం.

Women’s Reservation: భారతదేశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచిన జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లోనైనా.. గత నెలలో జరిగిన భారత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనైనా లింగ సమానత్వం, మహిళా సాధికారత అంశాలే ప్రధాన అజెండాగా మారాయి. చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలని, చట్టాల రూపకల్పనలో వారి భాగస్వామ్యం పెరగాలన్నదే ‘మహిళా రిజర్వేషన్ల బిల్లు’ ఉద్దేశం. మరి సంఖ్య పెరిగితే సరిపోతుందా? మహిళా సాధికారతకు ఇదే కొలమానమా? సంఖ్య పెరిగితే లింగ సమానత్వం సాధించినట్టేనా? ఇలాంటి ప్రశ్నలెన్నో ఉత్పన్నమవుతున్నాయి.
మిగతా రంగాల సంగతెలా ఉన్నా రాజకీయాల్లో మహిళల పాత్రపై అనేక సందేహాలు ఉన్నాయి. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ చాలా చోట్ల మహిళలకు రిజర్వు చేసిన స్థానాల్లో గెలిచిన మహిళ కంటే ఆమె కుటుంబ సభ్యులదే పెత్తనం కనిపిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అని తేడా లేదు. భర్త, కొడుకు, సమీప బంధువులు గెలిచిన మహిళ తరఫున రాజకీయం చేస్తున్నారు. అక్షరాస్యత పెరిగి మహిళల్లోనూ రాజకీయ చైతన్యం పెరిగిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తున్నా.. ఇంకా రావాల్సిన మార్పు చాలానే ఉందని చెప్పడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయాల్లో, చట్ట సభల్లో మహిళా సాధికారతను చాటిచెప్పే కొన్ని ఉదంతాలు భవిష్యత్తుపై ఆశలు పెంచుతున్నాయి. పార్లమెంటులో రానురాను మహిళల సంఖ్య పెరగడమే కాదు, పార్లమెంటరీ ప్రక్రియలో భాగమైన జవాబుదారీతనాన్ని మహిళా ఎంపీలు నిలబెడుతున్నారు. తమ సొంత ప్రభుత్వంపైనే ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్లమెంటరీ చర్చల్లో గతం కంటే చురుగ్గా పాల్గొంటున్నారు. సాధికారత అంటే ఇదీ అని చాటుతున్నారు.
ప్రజాస్వామ్యానికి అనేక నిర్వచనాలు ఉన్నప్పటికీ, ప్రశ్నించడం అనేదే అందులో ప్రధానాంశంగా మారింది. భయం, సంకోచం లేదా ఫోబియా లేకుండా అభిప్రాయాలు చెప్పడం, ప్రశ్నలు అడగడం ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతం. ప్రభుత్వాన్ని సొంత పార్టీకి చెందిన పార్లమెంటేరియన్లు ప్రశ్నిస్తున్నప్పుడు, దేశంలో ప్రజాస్వామ్యం శక్తివంతంగా ఉందని చెప్పొచ్చు. అలాగే ఈ ప్రశ్నలు సంధిస్తున్నది అధికార పార్టీకి చెందిన మహిళా ఎంపీలైతే ఆ ప్రజాస్వామ్యం పూర్తి ఆరోగ్యవంతంగా ఉందని చెప్పొచ్చు.
‘ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నారు’ అని తరచుగా ఆరోపిస్తూ, ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు’ చేతులు కలిపామని ఓవైపు ప్రతిపక్షాలు చెబుతుంటే.. 16వ లోక్‌సభలో (2014-19) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి చెందిన మహిళా ఎంపీలు తమ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచే క్రమంలో మంత్రులపై పదునైన ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టినట్టు పార్లమెంట్ రికార్డులు చెబుతున్నాయి. 16వ లోక్‌సభకు సంబంధించి పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు (32 మంది) మొత్తం ఐదేళ్లకాలంలో తమ ప్రభుత్వంపై దాదాపు 346 ప్రశ్నలు సంధించారు. 15వ లోక్‌సభ (2009-14)తో పోల్చితే నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో మహిళా ఎంపీలు అడిగిన ప్రశ్నల సగటు సంఖ్య కేవలం 58 మాత్రమే. పార్లమెంటులో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 25 మంది మహిళా ఎంపీలు ఉన్నారు.
ఇది దేనికి సంకేతం అంటే.. యూపీఏ హయాం కంటే ఎన్డీఏ హయాంలోనే మహిళా ఎంపీలకు స్పష్టమైన సాధికారత, పార్లమెంటరీ ప్రక్రియలో మరింత భాగస్వామ్యం, ప్రోత్సాహం ఉన్నాయని అర్థమవుతోంది. మహిళా ఎంపీల భాగస్వామ్యాన్ని మగవారితో పోల్చినప్పుడు 15వ లోక్‌సభ కంటే 16వ లోక్‌సభలోనే మెరుగ్గా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. 15వ లోక్‌సభలో పురుష సహచరులతో పోల్చితే మహిళా ఎంపీలు చాలా తక్కువ ప్రశ్నలు అడిగారు. అదే 16వ లోక్‌సభలో పురుషులతో దాదాపు సరిసమానంగా మహిళా ఎంపీలు ప్రశ్నలు అడిగారు. 15వ లోక్‌సభలో పురుష ఎంపీలు 250 ప్రశ్నలు అడగ్గా, మహిళా ఎంపీలు అడిగిన ప్రశ్నల సంఖ్య 134 మాత్రమే. 16వ లోక్‌సభలో పురుష ఎంపీలు అడిగిన ప్రశ్నలు 219 కాగా, మహిళా ఎంపీలు అడిగిన ప్రశ్నలు 218.
పీఆర్ఎస్ సంస్థ చేసిన అధ్యయనంలో పురుషులు అడిగిన ప్రశ్నలు, మహిళలు అడిగిన ప్రశ్నలను పరిశీలిస్తే.. ప్రాధాన్యతల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మహిళా ఎంపీలు ఆరోగ్యం, రోడ్లు, విద్య, MSMEలు (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్)కు సంబంధించిన సమస్యలపై ప్రశ్నలు సంధించగా, పురుష ఎంపీలు ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు మొదలైన వాటిపై దృష్టి సారిస్తున్నట్టు తేలింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు పాసైనప్పటికీ చట్టసభల్లో చట్టబద్ధంగా మహిళల సంఖ్య పెరగడానికి కనీసం మరో పదేళ్లు పడుతుంది. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో ఒకే ఒక మహిళా ప్రధానిని చూశాం. రానున్న 75 ఏళ్లలో మరింత మంది మహిళా ప్రధానులను చూడొచ్చని ఆశిద్దాం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..








