కాంగ్రెస్ నేతల ప్రచారం పచ్చి అబద్దం… ఇదీ వాస్తవం అంటూ వీడియో షేర్ చేసిన బీజేపీ…
రాహుల్, ప్రియాంక షేర్ చేసిన వెంటనే స్పందించిన బీజేపీ ఐటీ సెల్ ఛీప్ అమిత్ మాలవియ.. అది పూర్తి అవాస్తవం అంటూ..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఓ వృద్ధ రైతుపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నట్లు ఉన్న ఫోటోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ షేర్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఆ ఫోటోను రాహుల్, ప్రియాంక షేర్ చేసిన వెంటనే స్పందించిన బీజేపీ ఐటీ సెల్ ఛీప్ అమిత్ మాలవియ.. అది పూర్తి అవాస్తవం అంటూ సదరు ఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ షేర్ చేసిన పోటో పూర్తి అవాస్తవం అని, అక్కడ జరిగింది ఇదీ అంటూ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. తప్పుడు ఫోటోను షేర్ చేసి వారు మరోసారి దేశ వ్యాప్తంగా అపఖ్యాతి పాలయ్యారని అమిత్ విమర్శలు గుప్పించారు. అసలు పోలీసు అధికారి ఆ రైతును కనీసం టచ్ కూడా చేయలేదని, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.
Rahul Gandhi must be the most discredited opposition leader India has seen in a long long time. https://t.co/9wQeNE5xAP pic.twitter.com/b4HjXTHPSx
— Amit Malviya (@amitmalviya) November 28, 2020
తొలుత రైతులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారంటూ వృద్ధుడిపై పోలీసులు లాఠీ చేస్తున్నట్లు ఉన్న ఫోటోను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘ఇది చాలా దారుణం. మన నినాదం ‘జై జవాన్, జై కిసాన్’. కానీ ప్రధాని నరేంద్ర మోదీ దానిని పూర్తిగా మార్చేసి రైతులకు వ్యతిరేకంగా విధానాలను అవలంభిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం’ అంటూ విమర్శించారు.
ఇక కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ సైతం ఆ ఫోటోను షేర్ చేశారు. రైతుల పట్ల పోలీసులు అనుసరిస్తున్న విధానాలను ఆమె తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వంలో ఇలాంటి విధానాలే ఉంటాయని విమర్శలు గుప్పించారు. బీజేపీ మిత్రులైన ధనవంతులు(అంబాని, అదానిని ఉద్దేశించి) ఢిల్లీకి వస్తే రెడ్ కార్పేట్ వేసి స్వాగతం పలికే కేంద్ర ప్రభుత్వం.. రైతులు వస్తే మాత్రం రోడ్లన్నీ మూసివేస్తోందంటూ చురకలంటించారు.