ఆందోళనలోనూ అన్నదాతల ఉదారత, పోలీసు బ్యారికేడ్లను తొలగించి అంబులెన్స్ కి దారి ఇచ్చిన ‘మానవత’
తమ డిమాండ్లపై ఉద్యమించిన అన్నదాతలు కొన్ని సందర్భాల్లో వాటిని కూడా పక్కనపెట్టి తమ మానవతను చాటుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణగా ..
తమ డిమాండ్లపై ఉద్యమించిన అన్నదాతలు కొన్ని సందర్భాల్లో వాటిని కూడా పక్కనపెట్టి తమ మానవతను చాటుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణగా …ఢిల్లీ-హర్యానా బోర్డర్ లో టిక్రి వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన పొడవాటి బ్యారికేడ్లను వారు బలవంతంగా పక్కకు నెట్టివేసి ఓ అంబులెన్స్ వెళ్లేందుకు దారి ఇచ్చారు. హర్యానా నుంచి ఢిల్లీ వస్తున్న ఈ వాహనంలో తీవ్రంగా గాయపడి విషమ స్థితిలో ఉన్న అజ్ఞాత వ్యక్తి ఎవరో ఉన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరో వీరికి తెలియదు. కానీ అంబులెన్స్ అనగానే అత్యవసర వైద్య చికిత్స అవసరమని భావించిన రైతులు పోలీసు బ్యారికేడ్లను కూడా తొలగించారు. అంతా కలిసి ఆ వాహనం సజావుగా ముందుకు వెళ్లే అవకాశం కల్పించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రైతు చట్టాలను ఉపసంహరించాలని కోరుతున్న అన్నదాతలు ఇలా వ్యవహరించడం మానవతావాదులను కదిలిస్తోంది.
పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి రెండు రోజులుగా గజగజ వణికించే చలిని కూడా లెక్క చేయకుండా వీరు చలో ఢిల్లీ బాట పట్టడం విశేషం. ‘ మాకు ఏ మాత్రం ఉపయోగపడని చట్టాలను కేంద్రం రద్దు చేయాల్సిందే.. అంతవరకూ వెనక్కి తగ్గం, మా దగ్గర ఆరు నెలలకు సరిపడా రేషన్ సరకులు ఉన్నాయి. ఈ నల్ల వ్యవసాయ చట్టాల వల్ల మాకు ఒరిగేదేమీ లేదు’ అని ఓ రైతు ఉద్రేకంగా తెలిపాడు. ట్రాక్టర్లు, ట్రాలీలపై వేలాదిగా వస్తున్న వీరిపై పోలీసులు వాటర్ క్యానన్లను, బాష్పవాయువును ప్రయోగిస్తున్నా వీరు తగ్గడంలేదు. హర్యానా లోని కురుక్షేత్ర వద్ద ఖాకీలు వీరిని అడ్డుకునేందుకు రోడ్లు, కందకాలు కూడా తవ్వారు. అటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల అన్నదాతలు కూడా వీరితో జత కలవడంతో ఢిల్లీ బోర్డర్ ఓ మహా రైతులోకంలా కనిపిస్తోంది.