TDP – BJP Alliance: టీడీపీతో పొత్తుపై బీజేపీ పెద్దలకు ఫుల్ క్లారిటీ.. పవన్ ఒత్తిడి ఫలిస్తుందా?
తెలంగాణలో పొత్తులు ఆశజూపి ఏపీలోనూ బీజేపీతో కలిసి నడిచేందుకు ఎదురుచూస్తున్న తెలుగుదేశం పార్టీకి కమలనాథులు ప్రతిస్పందన ఏమాత్రం సానుకూలంగా లేదు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రాభవం తగ్గితే, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తమకు అవకాశం దొరుకుతుందని బీజేపీ ఎదురుచూస్తోంది.
AP – Telangana Politics: తెలంగాణ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) స్పష్టతనిచ్చింది. అక్కడైనా, ఇక్కడైనా ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్తామని తేల్చిచెప్పింది. తమతో చెలిమి కోసం ప్రేమలేఖలు, రాయబారాలు జరుగుతున్నప్పటికీ పొత్తులకు ‘క్లియర్ నో’ అని తెగేసి చెబుతోంది. తెలుగుదేశంతో పొత్తు గురించి ఆలోచిస్తున్నాం అంటూ వచ్చిన కథనాలను ఖండిస్తూ తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేయగా.. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు తమ వైఖరిని పంచుకున్నారు.
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను ఒంటరిగా బీజేపీ ఎదుర్కోవడం సాధ్యం కాదని, వారికి తెలుగుదేశం ఓటుబ్యాంకు కూడా తోడైతేనే అనుకున్నన్ని సీట్లు వస్తాయని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి గణనీయమైన ఓటుబ్యాంకు ఉందని, అది బీజేపీకి తోడవుతుందని ఊరించే ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ నేతలు మాత్రం ఈ ట్రాప్‌లో పడేదే లేదని తేగేసి చెబుతున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి 2018లో ఏ పరిస్థితి ఎదురైందో అందరికీ తెలుసని, తెలిసి తెలిసి తాము ఆ పొరపాటు చేయబోమని చెబుతున్నారు. టీడీపీతో కలిస్తే ఆ పార్టీ ఓటుబ్యాంకు అదనంగా వచ్చి చేరడం మాటేమో గానీ, ఉన్న ఓటుబ్యాంకు జారిపోతుందని స్పష్టమైన అంచనాకొచ్చింది. టీడీపీతో పొత్తు అన్న ఆలోచనే బీఆర్ఎస్‌కు ఆయుధాన్ని ఇచ్చినట్టవుతుందని విశ్లేషిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌కూ ఇదే సూత్రం..
తెలంగాణలో పొత్తులు ఆశజూపి ఏపీలోనూ బీజేపీతో కలిసి నడిచేందుకు ఎదురుచూస్తున్న తెలుగుదేశం పార్టీకి కమలనాథులు ప్రతిస్పందన ఏమాత్రం సానుకూలంగా లేదు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రాభవం తగ్గితే, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తమకు అవకాశం దొరుకుతుందని బీజేపీ ఎదురుచూస్తోంది. ఇప్పటికే తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన, తెలుగుదేశం గూటికి చేరుకుంటామని సంకేతాలిస్తున్నప్పటికీ, తాము మాత్రం టీడీపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని కమలనాథులు అంటున్నారు. నిజానికి పొత్తుల వ్యవహారాలు ఎన్నికల సమయంలోనే తెరపైకి వస్తుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అటు అసెంబ్లీలో, ఇటు లోక్‌సభ సీట్ల విషయంలో ఘోర పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీ, ఆ మరుక్షణం నుంచే బీజేపీతో చెలిమి కోసం అర్రులు చాస్తోంది. ఎన్నికలు ముగిసిన వెంటనే నలుగురు తెలుగుదేశం ఎంపీలు కట్టకట్టుకుని బీజేపీలో చేరడం, అందులోనూ తెలుగుదేశం పార్టీకి అన్నిరకాలుగా వెన్నుదన్నుగా నిలిచిన నేతలే పార్టీ మారడం అప్పట్లోనే అనేక సందేహాలకు తావిచ్చింది. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు తన మనుషులను బీజేపీలోకి పంపించారనే ప్రచారం కూడా జరిగింది. బీజేపీ కూడా వచ్చేవారిని కాదనడం ఎందుకన్నట్టుగా చేర్చుకుంది మినహా వారికి పార్టీలో ఇచ్చిన ప్రాధాన్యత పెద్దగా లేదనే చెప్పాలి. పార్టీలో చేరిన వెంటనే తమ సొంత అజెండాను అమలుచేయాలని చూసిన నేతలకు చెక్ పెడుతూనే వచ్చింది.
ఏపీలో ప్రత్యామ్నాయ హోదాపై కన్ను..
ఆ తర్వాత కొన్నాళ్లకు జనసేనాని తనంతట తానుగా వచ్చి బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కలిసి కూటమిలో చేరడంతో వెనుక కూడా చంద్రబాబు నాయుడి హస్తం ఉండొచ్చన్న చర్చ జరిగింది. అయితే కొన్ని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని జనసేన-బీజేపీ జట్టుకడితే ఉపయోగం ఉంటుందని కమలనాథులు భావించారు. అదే మాదిరిగా రాజకీయ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ పరోక్షంగా తాను టీడీపీతో పొత్తులు పెట్టుకుంటానంటూ తేల్చిచెప్పడంతో బీజేపీ నేతలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఏనాటికైనా సొంతంగా బలపడడమే అంతిమ లక్ష్యం అనుకున్నప్పుడు మరొకరికి మద్ధతిచ్చి సహకరించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ తెలుగుదేశం పార్టీ కనుమరుగైతేనే బీజేపీకి ప్రత్యామ్నాయ హోదా దక్కుతుందని బలంగా విశ్వసిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి