పెట్రోలు ధర పెరిగిందంటూ, ఎలెక్ట్రిక్ స్కూటర్ పై రయ్యిమని ప్రయాణించిన దీదీ, వావ్ !
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం స్కూటర్ ఎక్కి తన కార్యాలయానికి చేరుకొని సంచలనం సృష్టించారు. పెట్రోలు ధర పెరిగిపోయిందంటూ ఎలెక్ట్రిక్ స్కూటర్ పై..
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం స్కూటర్ ఎక్కి తన కార్యాలయానికి చేరుకొని సంచలనం సృష్టించారు. పెట్రోలు ధర పెరిగిపోయిందంటూ ఎలెక్ట్రిక్ స్కూటర్ పై తన ఆఫీసుకు చేరుకున్నారు. మున్సిపల్ వ్యవహారాలశాఖ మంత్రి ఫిర్హాద్ హకీం ఈ వాహనం నడుపుతుండగా ఆమె వెనుకే కూర్చుని అందరి దృష్టినీ ఆకర్షించారు. కోల్ కతా లోని హజ్రా మోర్ లొకాలిటీ నుంచి సెక్రటేరియట్ వరకు హుగ్లీ నది బ్రిడ్జి ద్వారా 5 కిలోమీటర్ల దూరం ఈ ‘స్కూటీ ప్రయాణం ,’ సాగింది. బీహార్ లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నిన్న తమ రాష్ట్ర అసెంబ్లీకి ట్రాక్టర్ పై ప్రయాణించి రాగా ఇప్పుడు మమతా బెనర్జీ తాను కూడా తక్కువతినలేదన్నట్టు గురువారం ఎలక్ట్రిక్ స్కూటీని ఆశ్రయించారు. ఈమె ప్రయాణించినదంతా ఫేస్ బుక్ లైవ్ గా టెలికాస్ట్ చేయడం విశేషం.
తమ రాష్ట్రంలో కిరోసిన్ ని వినియోగించే ప్రజలు కోటిమందికి పైగా ఉన్నారని, కానీ వారికీ కిరోసిన్ దొరకడంలేదని మమత ఆ తరువాత తెలిపారు. ఇక దేశంలో పెట్రోలు, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగాయని, గత రాత్రి నుంచి వంట గ్యాస్ ధర కూడా పెరిగిందని దీదీ అన్నారు. అందుకే ఈ స్కూటీ ప్రయాణం చేశానని చెప్పారు. హెల్మెట్, మాస్క్ కూడా ధరించి ఆమె ఈ ”విచిత్ర యాత్ర’ చేశారు. ప్రధాని మోదీ ఈ దేశాన్ని అమ్మివేస్తున్నారని, ఈ ప్రభుత్వం రైతుల, ప్రజల, మహిళల, యువత వ్యతిరేక ప్రభుత్వమని ఆమె ఆరోపించారు. ఈ సర్కార్ గద్దె దిగాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఈ ప్రభుత్వానికి సామాన్య ప్రజల గోడు పట్టదని, పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచడం దారుణమని ఆమె అన్నారు. బెంగాల్ లో వచ్ఛే ఏప్రిల్-మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా బీజేపీని ఎదుర్కొనేందుకు మమత ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతోంది. రాష్ట్రంలో తృణమూల్, కాంగ్రెస్, బీజేపీ మధ్య రోజురోజుకీ ఆరోపణలు ప్రత్యారోపణలు సర్వ సాధారణమయ్యాయి. ఇటీవల హుగ్లీ జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఈ రాష్ట్రంలో టీఎంసీ పాలనను తీవ్రంగా దుయ్యబట్టారు. కేంద్రం బెంగాల్ కు 1700 కోట్ల గ్రాంటును ఇస్తే అందులో 608 కోట్ల గ్రాంటును మాత్రమే ఖర్చు చేసిందని, మిగిలిన సొమ్మంతా ఏమైందని ఆయన ప్రశ్నించారు. అటు నిన్నటికి నిన్న మమతా బెనర్జీ.. తమ తల్లులు, మహిళలను బొగ్గు దొంగలంటారా అని మోదీని ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యానించారు. మీకసలు చరిత్ర అంటూ లేదని, తమకు అన్నీ తెలుసునని, కానీ సంయమనం వహిస్తున్నామని ఆమె చెప్పారు.
తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్యపై బొగ్గు కేసు పెట్టి సీబీఐ సమన్లు జారీ చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. మీకు ఈ రాష్ట్రంలో సింగిల్ గోల్ కూడా రాదని, ఎన్నికల్లో మీ ఓటమి ఖాయమని ఆమె చెప్పారు. రానున్న నెలల్లో బీజేపీ, తృణమూల్ మధ్య మాటల యుధ్ధం మరింత పెరగవచ్ఛునని భావిస్తున్నారు.
#WATCH | West Bengal Chief Minister Mamata Banerjee travels on an electric scooter in Kolkata as a mark of protest against rising fuel prices. pic.twitter.com/q1bBM9Dtua
— ANI (@ANI) February 25, 2021
Read More :
నక్క తోక తొక్కాడా..? ఏకంగా వజ్రమే దొరికింది ..!