BBC Documentary on PM Modi: నేడు తిరువనంతపురంలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన
ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని గురువారం (జనవరి 26) సాయంత్రం 5 గంటలకు కేరళలో ప్రదర్శించనున్నారు. ఈ మేరకు..
ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని గురువారం (జనవరి 26) సాయంత్రం 5 గంటలకు కేరళలో ప్రదర్శించనున్నారు. ఈ మేరకు తిరువనంతపురంలోని శంఘుముఖం బీచ్‌లో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) మీడియాకు తెలిపింది. ఈ డాక్యుమెంటరీని వీక్షించేందుకు బీచ్‌కు ఇప్పటికే ప్రజలు పెద్ద మొత్తంలో తరలివచ్చారు.
కాగా 59 నిమిషాల నిడివి కలిగిన బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీ గత వారం విడుదలైనప్పటి నుంచి పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002లో ఆ రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కొన్ని అంశాలను ఈ డాక్యుమెంటరీలో ఉటంకించింది. బీబీసీ డాక్యుమెంటరీ విడుదలైన తర్వాత దీనిపై వెలువడిన యూట్యూబ్ వీడియోలు, ట్విటర్ పోస్టులకు సంబంధించిన లింక్‌లను తక్షణమే బ్లాక్ చేయవల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ చర్యను ప్రతిపక్షాలు ‘సెన్సార్‌షిప్’గా వ్యాఖ్యానిస్తూ దుమ్మెత్తిపోశాయి.
అంతేకాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా, పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి దేశ వ్యాప్తంగా ఉన్న పలు విశ్వవిద్యాలయాల్లో బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఐతే జేఎన్‌యూ, జామియా యూనివర్సిటీల్లో హింసకు దారితీసింది. ఇన్ని వివాదాలకు కారణమైన బీబీసీ డాక్యుమెంటరీని కేరళలోని తిరువనంతపురంలో నేడు ప్రదర్శించడంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.