AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకినాడ AE నూకరాజు ఫ్యామిలీ సీన్‌ రిపీట్‌.. రిటైర్డ్‌ టీచర్‌ కుటుంబం మాస్‌ సూసైడ్‌!

కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్యల ఘటన మరువక ముందే బంగ్లాదేశ్‌లో అలాంటి మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. రంగ్‌పూర్‌ నగరంలోని దాస్‌పారా (మచ్చువాపారా) ప్రాంతంలో లాక్‌ చేసి ఉన్న ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో రిటైర్డ్‌ పాఠశాల ఉపాధ్యాయుడు, ఆయన భార్య, కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

కాకినాడ AE నూకరాజు ఫ్యామిలీ సీన్‌ రిపీట్‌.. రిటైర్డ్‌ టీచర్‌ కుటుంబం మాస్‌ సూసైడ్‌!
Bangladesh Family Death Mystery
Srilakshmi C
|

Updated on: Aug 23, 2026 | 5:34 PM

Share

బంగ్లాదేశ్‌, ఆగస్ట్‌ 23: శనివారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో పోలీసులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి మృతదేహాలను గుర్తించారు. మృతులను రంగ్‌పూర్‌ జిల్లా పాఠశాల రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత చక్రవర్తి (50), కుమార్తె అగామి చక్రవర్తి ప్రార్థి (23), కుమారుడు ప్రియమ్‌ చక్రవర్తి (12)గా గుర్తించారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోవడంతో బంధువులకు అనుమానం వచ్చింది. గణపతి భార్య ప్రీతిలత చెల్లెలు పూజా చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం చివరిసారిగా ఆమె తన సోదరితో మాట్లాడారు. ఆ తర్వాత కుటుంబంలోని నాలుగు మొబైల్‌ ఫోన్లు గురువారం రాత్రి నుంచి స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయి. దీంతో శనివారం రాత్రి బంధువులు దాస్‌పారాలోని వారి ఇంటికి వెళ్లారు. ఇంటి ప్రధాన ద్వారం తాళం వేసి ఉండగా, లోపల లైట్లు కూడా వెలగకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించగా నలుగురి మృతదేహాలు కనిపించాయి. తల్లి ప్రీతిలత, కుమార్తె అగామి మృతదేహాలు మెట్ల వద్ద లభించాయి. గణపతి మృతదేహం ఇంటి పైకప్పుపై కనిపించింది. 12 ఏళ్ల కుమారుడు ప్రియమ్‌ మృతదేహం మంచం కింద గుర్తించినట్లు రంగ్‌పూర్‌ మెట్రోపాలిటన్‌ సీఐడీ అధికారులు తెలిపారు.

ఇటీవలే రిటైర్‌ అయిన ఉపాధ్యాయుడు

గణపతి చక్రవర్తి గత ఏడాది డిసెంబర్‌ 31న రంగ్‌పూర్‌ జిల్లా పాఠశాల నుంచి పదవీ విరమణ చేశారు. అనంతరం హోమియోపతి వైద్యుడిగా పనిచేస్తున్నట్లు ఆయన బంధువులు తెలిపారు. ఆయన కుమార్తె అగామి ఈ ఏడాది రంగ్‌పూర్‌ కార్మైఖేల్‌ కళాశాల నుంచి ఇంగ్లిష్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసింది. కుమారుడు ప్రియమ్‌ రంగ్‌పూర్‌ జిల్లా పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. గణపతికి ఎలాంటి శత్రువులు లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. దాస్‌పారాలో కొత్తగా ఇల్లు నిర్మించుకుని కుటుంబంతో కలిసి అక్కడే నివసిస్తున్నారని చెప్పారు. రంగ్‌పూర్‌ మెట్రోపాలిటన్‌ కొత్వాలి పోలీస్‌ స్టేషన్‌ అధికారి నజ్ముల్‌ కాదర్‌ మాట్లాడుతూ..

ఇవి కూడా చదవండి

నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు, క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (CID), డిటెక్టివ్‌ బ్రాంచ్‌ (DB) అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. నలుగురి మృతికి కారణం ఏమిటి? వారిని ఎవరు హత్య చేశారు? ఘటన ఎప్పుడు జరిగింది? అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఆధారాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి హత్యకు గల కారణం, నిందితులు, మరణించిన సమయం వంటి అంశాలపై స్పష్టత రాలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Follow Us