AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబై మెట్రోకు కొత్త బాస్‌.. గుండవాలి స్టేషన్‌లో ‘చీఫ్ ఫెలైన్ ఆఫీసర్’గా పిల్లి!

ముంబై మెట్రోలో ఓ ప్రత్యేకమైన నియామకం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా స్టేషన్‌లో ప్రయాణికుల భద్రత, నిర్వహణను చూసేందుకు సిబ్బంది ఉంటారు. కానీ ముంబైలోని గుండవాలి మెట్రో స్టేషన్‌కు మాత్రం నాలుగు కాళ్లతో ఉండే ఓ ‘అధికారి’ వచ్చాడు. లేత గోధుమ రంగులో ఉండే ఈ పిల్లికి మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (MMMOCL) సరదాగా చీఫ్ ఫెలైన్ ఆఫీసర్ (CFO) అనే హోదాను ఇచ్చింది.

ముంబై మెట్రోకు కొత్త బాస్‌.. గుండవాలి స్టేషన్‌లో ‘చీఫ్ ఫెలైన్ ఆఫీసర్’గా పిల్లి!
Light Brown Cat Gets A Job
Balaraju Goud
|

Updated on: Aug 23, 2026 | 1:08 PM

Share

ముంబై మెట్రోలో ఓ ప్రత్యేకమైన నియామకం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా స్టేషన్‌లో ప్రయాణికుల భద్రత, నిర్వహణను చూసేందుకు సిబ్బంది ఉంటారు. కానీ ముంబైలోని గుండవాలి మెట్రో స్టేషన్‌కు మాత్రం నాలుగు కాళ్లతో ఉండే ఓ ‘అధికారి’ వచ్చాడు. లేత గోధుమ రంగులో ఉండే ఈ పిల్లికి మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (MMMOCL) సరదాగా చీఫ్ ఫెలైన్ ఆఫీసర్ (CFO) అనే హోదాను ఇచ్చింది.

ముంబై మెట్రో లైన్‌ 7 (Red Line)లోని గుండవాలి స్టేషన్ ప్రవేశద్వారం వద్ద ఈ పిల్లి తరచూ కనిపిస్తుంటుంది. స్టేషన్ పరిసరాల్లో తిరుగుతూ.. ప్రయాణికులను గమనిస్తూ.. తనదైన శైలిలో ‘గస్తీ’ కాస్తుంటుంది. దాని ప్రశాంతమైన, ఏమాత్రం హడావుడి లేని స్వభావం ప్రయాణికులను ఆకట్టుకుంటోంది.

ఈ పిల్లికి అధికారిక హోదా రావడానికి కారణం ఓ ప్రయాణికుడి సరదా సూచనే. సందేశ్ సమంత్ అనే ప్రయాణికుడు స్టేషన్ వద్ద పిల్లిని ఫొటో తీసి, జీతం లేకుండా సేవలందిస్తున్న ఈ ‘స్టేషన్ మాస్టర్‌’కు అధికారిక పదవి ఇవ్వాలని మెట్రో అధికారులను కోరుతూ మెసేజ్ పంపాడు. దీనికి MMMOCL కూడా సరదాగా స్పందించి.. పిల్లిని ‘చీఫ్ ఫెలైన్ ఆఫీసర్‌’గా ప్రకటించింది.

Mumbai Metro Resident Light Brown Cat Gets A Job

Mumbai Metro Resident Light Brown Cat Gets A Job

మెట్రో అధికారులు ఈ హోదా పూర్తిగా సరదా కోసమే ఇచ్చినప్పటికీ.. పిల్లి మాత్రం తన బాధ్యతలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోందని తెలిపారు. స్టేషన్‌ను పరిశీలించడం, ప్రయాణికులపై ఓ కన్నేసి ఉంచడం దాని అనధికారిక విధుల్లో భాగమని చెప్పారు. స్టేషన్లలో అప్పుడప్పుడు పిల్లులు, కుక్కలు, కోతులు వంటి జంతువులు కనిపిస్తుంటాయని అధికారులు తెలిపారు. అయితే అవి శాశ్వతంగా స్టేషన్లలో ఉండవని, తమకు నచ్చినప్పుడు వచ్చి.. వెళ్లిపోతుంటాయని వివరించారు. పిల్లులను ఇష్టపడని ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఈ ‘సీఎఫ్‌ఓ’కు పేరు, వయస్సు, లింగం వంటి వివరాలు కూడా తెలియవు. అయినప్పటికీ గుండవాలి స్టేషన్‌లో మాత్రం అది సుపరిచితమైన ముఖంగా మారిపోయింది. ఇలాంటి ‘జంతు అధికారులు’ అంతర్జాతీయంగానూ ఉన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో 2011 నుంచి లారీ అనే పిల్లి ‘చీఫ్ మౌజర్‌’గా కొనసాగుతోంది. మరో పిల్లి పామర్‌స్టన్ కూడా బ్రిటన్ విదేశాంగ కార్యాలయంలో చీఫ్ మౌజర్‌గా పనిచేసి 2020లో పదవీ విరమణ చేసింది.

మొత్తానికి గుండవాలి మెట్రో సీఎఫ్‌ఓకు డెస్క్‌ లేదు.. ఐడీ కార్డు లేదు.. జీతం లేదు.. అధికారిక పనివేళలు కూడా లేవు. కానీ స్టేషన్‌పై మాత్రం ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచే ‘బాస్’ మాత్రం ఉన్నాడన్నమాట!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us