కోవిడ్ భయం, ఇండియాతో సరిహద్దులను మూసివేసిన బంగ్లాదేశ్, రెండువారాల పాటు అమలు
ఇండియాతో సరిహద్దులను మూసివేస్తున్నామని బంగ్లాదేశ్ ప్రకటించింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని విదేశాంగ మంత్రి అబ్దుల్ మూమెన్ తెలిపారు. ఇండియాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల...
ఇండియాతో సరిహద్దులను మూసివేస్తున్నామని బంగ్లాదేశ్ ప్రకటించింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని విదేశాంగ మంత్రి అబ్దుల్ మూమెన్ తెలిపారు. ఇండియాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా ఈ చర్య తీసుకుంటున్నామని, 14 రోజులపాటు సరిహద్దులు మూసి ఉంటాయని ఆయన చెప్పారు. ఇండియా నుంచి రోడ్డు మార్గాన వచ్చే ప్రయాణికులపై కూడా ఆంక్షలు విధిస్తున్నామని అన్నారు. సోమవారం నుంచి ఇవి 14 రోజులపాటు అమలులో ఉంటాయన్నారు. ప్రస్తుతానికి ల్యాండ్ రూట్స్ ని క్లోజ్ చేస్తున్నాం అని అన్నారు. అయితే ఉభయ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయని మూమెన్ స్పష్టం చేశారు. రవాణా వాహనాలపై ఎలాంటి ఆంక్షలూ ఉండబోవన్నారు. భారత-బంగ్లాదేశ్ మధ్య విమాన ప్రయాణాలను ఈ నెల 14 నుంచే నిలిపివేశారు. ఇండియాలో ఆదివారం నాటికి 3,49,691 కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. 24 గంటల్లో మృతి చెందిన వారి సంఖ్య కూడా రెండు వేలకు పైగా పెరిగింది. కాగా ప్రధాని మోదీ గత మార్చి నెలాఖరులోనే బంగ్లాదేశ్ ను రెండు రోజులపాటు విజిట్ చేసి ఆ దేశ నేషనల్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో సమావేశమై 5 ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఆ దేశ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ కి నివాళులు అర్పించారు కూడా.. ఇప్పుడు ఇండియాలో కోవిద్ కేసులు పెరిగిపోగానే మన దేశానికి బంగ్లాదేశ్ ముఖం చాటేస్తోందన్న విమర్శలు వినవస్తున్నాయి.
అయితే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయని బంగ్లా ప్రభుత్వం స్పష్టం చేయడం చూస్తే ఇండియా నుంచి దిగుమతులను తాము అడ్డుకోవడం లేదని, తమ దేశ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకొంటామని ప్రకటించినట్టేనని భావిస్తున్నారు.