అంతా రామమయం అనుకుంటే.. విరాళాల చోరీతో మొదలై భారీ స్కామ్‌గా మారిన అయోధ్య కేసు.. రోజుకో కొత్త ట్విస్ట్!
Ayodhya Ram Temple Scam: అయోధ్య రామాలయంలో భక్తుల విరాళాల చోరీ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. రూ.24 లక్షల అనుమానాస్పద లావాదేవీలు, 125 అక్రమ ఉద్యోగ నియామకాలు, నకిలీ హుండీ, ఎస్‌బీఐ ఉద్యోగుల ప్రమేయం వంటి సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. జూలై 15లోగా ప్రభుత్వం ముందుకు పూర్తి నివేదిక సమర్పించనుంది.

ప్రసిద్ధ అయోధ్య రామాలయంలో భక్తులు సమర్పించిన విరాళాల చోరీ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ మహా కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) , పోలీసులు జరుపుతున్న విచారణలో రోజుకో షాకింగ్ నిజం వెలుగులోకి వస్తోంది. విరాళాల దొంగతనంతో పాటు అక్రమ ఉద్యోగ నియామకాలు, నకిలీ హుండీల నిర్వహణ వంటి అనేక అక్రమాలు బయటపడటంతో అధికారులు విస్తుపోతున్నారు. సిట్ అధికారుల బృందం అయోధ్యలోనే మకాం వేసి మరిన్ని ఆధారాలను సేకరిస్తోంది.
ఐదేళ్ల ఆడిట్‌పై నిఘా పెట్టిన సిట్..!
అయోధ్య విరాళాల చోరీ కేసులో ప్రాథమిక విచారణలో భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించడంతో, అయోధ్య శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’కు సంబంధించిన గత ఐదేళ్ల ఆడిట్ రికార్డులను పూర్తిగా పరిశీలించాలని సిట్ నిర్ణయించింది. ఆలయ నిర్మాణ పనుల్లో జరిగిన లావాదేవీలపై కూడా నిఘా పెట్టారు. ఈ కుంభకోణం వెనుక ట్రస్ట్‌కు చెందిన కొందరు సీనియర్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు సిట్ బలంగా అనుమానిస్తోంది. ఇప్పటికే సేకరించిన ప్రాథమిక ఆధారాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు, జూలై 15 లోగా ప్రభుత్వానికి పూర్తి దర్యాప్తు నివేదికను సమర్పించనున్నారు.
నిందితుడి భార్య ఖాతాలో రూ. 24 లక్షల ఆర్థిక లావాదేవీలు
ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు లవకుష్ భార్య సుప్రియ బ్యాంక్ ఖాతాను పరిశీలించిన పోలీసులకు దిమ్మతిరిగే నిజం తెలిసింది. ఒక సాధారణ గృహిణి అయిన ఆమె ఖాతా ద్వారా ఏడాదికి సుమారు రూ. 24 లక్షల వరకు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ డబ్బుకు మూలాధారం ఏంటనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బుధవారం నిందితుల స్వగ్రామాలైన మిల్కీపూర్, ఖండా, రుదౌలీలలోని వారి ఇళ్లపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు ఉన్న ఒక పెట్టెను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆలయ నిర్వాహకుడు (మేనేజర్) గోపాల్ రావు సహా 10 మందిని పోలీసులు సుదీర్ఘంగా విచారించగా, నిందితుడు లవకుష్ తండ్రి బచ్చులాల్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు.
విరాళాల చోరీ మాత్రమే కాదు.. భారీ జాబ్ స్కామ్!
విరాళాల చోరీ దర్యాప్తులో భాగంగా కీలక నిందితుడు అవినాష్ శుక్లాను విచారించగా ఆలయంలో జరిగిన మరో పెద్ద దందా బయటపడింది. మందిరంలో వివిధ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి దాదాపు 125 మందిని అక్రమంగా నియమించినట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే, వీరికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్లు కానీ, సర్వీస్ అగ్రిమెంట్లు కానీ ఆలయ రికార్డుల్లో ఎక్కడా లభించకపోవడం గమనార్హం. ఈ నియామకాల వెనుక అనుకల్ప్ మిశ్రా, లవ్ కుశ్ మిశ్రాలు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలపై కూడా అధికారులు దృష్టి పెట్టారు.
రామరాజ్య కోశ్ పేరుతో నకిలీ హుండీ.. ఈడీ ఎంట్రీ?
గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సమయాన్నే నిందితులు విరాళాలు దోచేందుకు అనుకూలంగా మార్చుకున్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు అవినాశ్ శుక్లా గత పదేళ్లుగా నివసిస్తున్న ఒక యోగా కేంద్రంపై పోలీసులు దాడి చేయగా, అక్కడ రామరాజ్య కోశ్ పేరుతో ఉన్న ఒక నకిలీ విరాళాల హుండీ లభ్యమైంది. భక్తులను మోసం చేయడానికి ఆ హుండీపై పేటీఎం క్యూఆర్ కోడ్‌ను కూడా ఏర్పాటు చేయడం అధికారులను షాక్‌కు గురిచేసింది.ఈ భారీ కుంభకోణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగుల హస్తం కూడా ఉన్నట్లు ఆధారాలు లభించడంతో, ఈ కేసులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)ను రంగంలోకి దించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సమగ్ర దర్యాప్తు కోరుతూ ఈడీకి పోలీసులు లేఖ రాశారు.
అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో పెద్ద తలకాయలను కాపాడే ప్రయత్నం?: ప్రధాని మోదీకి కేసీ వేణుగోపాల్ బహిరంగ లేఖ !
అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాలలో జరిగిన భారీ చోరీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ, పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ కేసీ వేణుగోపాల్.. ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రామ మందిర విరాళాల చోరీ వ్యవహారంపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలన్నారు. విరాళాల చోరీ కేసును సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారించాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామాలయం విరాళాల చోరీ వందల కోట్ల రూపాయలతో సంబంధం ఉన్న భారీ మోసంగా పేర్కొన్న కేసీ వేణుగోపాల్.. ఇది హిందూ విశ్వాసం, మతం, జీవన విధానానికి జరిగిన పెద్ద ద్రోహంగా పేర్కొన్నారు. ప్రస్తుత విచారణ కేవలం ఆధారాలను తుడిచిపెట్టడానికి, అసలైన పెద్ద తలకాయలను కాపాడటానికే ఉపయోగపడుతోందని ఆరోపించారు.
ఆలయ పవిత్రతను కాపాడటం, దేశంలోని 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసాన్ని పునరుద్ధరించడం ప్రభుత్వం, ప్రధాని మోదీ నైతిక బాధ్యతగా పేర్కొన్నారు. శ్రీరాముడిని మనం న్యాయానికి, ధర్మానికి ప్రతీకగా ఆరాధిస్తాం. విరాళాల చోరీ ఆరోపణలను నిష్పక్షపాతంగా విచారించకుండా తొక్కిపెట్టాలని చూస్తే.. అది రామ భక్తులకు, ఆయన విలువలకు ఘోరమైన అన్యాయంగా అని వేణుగోపాల్ లేఖలో పేర్కొన్నారు. 2020లో భారత ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను పబ్లిక్ ట్రస్ట్‌గా ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఈ ట్రస్ట్ పని చేస్తోంది. విరాళాల దుర్వినియోగం కేసు దర్యాప్తు అత్యున్నత ప్రమాణాలతో, పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరగాలని వేణుగోపాల్ డిమాండ్ చేశారు.




