AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సికింద్రాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతిరోజూ ఉదయాన్నే ఉచితంగా టిఫిన్..

సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద గత 5 సంవత్సరాలుగా నిత్యం 500 నుంచి 600 మంది పేదలు, వలస కార్మికులకు ఉచితంగా టిఫిన్లు అందిస్తున్నారు. ఇడ్లీ, ఉప్మా, ఊతప్పతో పాటు అరటిపండును కూడా ఇస్తారు. సీజన్‌ను బట్టి సమయాలు మారుతూ ఉంటాయి. ఈ మహత్తర సేవ వేలమంది ఆకలి తీరుస్తోంది.

సికింద్రాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతిరోజూ ఉదయాన్నే ఉచితంగా టిఫిన్..
Free Tiffin
Ram Naramaneni
|

Updated on: Jul 09, 2026 | 12:32 PM

Share

హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ క్లాక్ టవర్ ప్రాంతం, గత నాలుగు సంవత్సరాలుగా నిస్వార్థ సేవకు నిలయంగా మారింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు అతి చేరువలో ఉన్న ఈ ప్రాంతంలో, నిత్యం వందలాది మందికి ఉచితంగా టిఫిన్లు అందిస్తున్నారు. ప్రతిరోజూ 365 రోజులూ ఈ సేవ నిరాటంకంగా కొనసాగుతోంది. కేవలం ఒక రకం టిఫిన్ కాకుండా, మూడు రకాల టిఫిన్లతో పాటు ఒక అరటిపండును కూడా అందిస్తున్నారు. ఈ సేవ ప్రధానంగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చి, సరైన పని దొరకక, తిరిగి సొంత ఊరికి వెళ్లడానికి కూడా డబ్బులు లేక ఇక్కడే ఉండిపోయిన వలస కార్మికులు, నిరాశ్రయులను లక్ష్యంగా చేసుకుని కొనసాగుతోంది. క్లాక్ టవర్ చుట్టూ ప్రతిరోజు ఉదయం 300 నుంచి 400 మంది లబ్ధిదారులు ఈ ఉచిత టిఫిన్ కోసం వేచి చూస్తుంటారు. వాతావరణ పరిస్థితులను బట్టి టిఫిన్ అందించే సమయాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు, చలికాలంలో ఉదయం 7:00 గంటల నుంచి 8:00 గంటల మధ్య టిఫిన్లను అందిస్తే, ఎండాకాలంలో త్వరగా పొద్దు రావడం వల్ల ఉదయం 6:00 గంటల నుంచి 7:00 గంటల మధ్య అందిస్తారు. వర్షాకాలంలో మాత్రం ఉదయం 7:00 గంటల నుంచి 8:00 గంటల మధ్యే టిఫిన్లు అందుబాటులో ఉంటాయి. ఇక శీతాకాలంలో 7:00 నుండి 8:00 మధ్య టిఫిన్లు అందిస్తున్నారు.

ఈ ఉచిత టిఫిన్ సేవలో భాగంగా ఊతప్ప, ఉప్మా, ఇడ్లీ వంటి సాంప్రదాయ భారతీయ అల్పాహార వంటకాలను అందిస్తారు. వాటితో పాటు ఒక అరటిపండును కూడా ఇస్తారు. ఈ సేవను శామ్యూల్ అనే వ్యక్తి అందిస్తున్నారు. తాను ఎలాంటి విరాళాలు ఆశించడం లేదని.. కేవలం దేశ బాగు కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తమ కుమారుడు చనిపోయిన తర్వాత ఈ టిఫిన్ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు శామ్యూల్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో, వలస కార్మికులు దొంగతనాలకు గురై, తమ వద్ద ఉన్న ఆధార్ కార్డులు, డబ్బులు పోగొట్టుకుని ఇంటికి వెళ్లలేని పరిస్థితిలో ఉండిపోతారు. అలాంటి వారిని గుర్తించి, సొంత ఊరు తిరిగి వెళ్లడానికి కొంత డబ్బును కూడా అందిస్తామని ఆయన వెల్లడించారు. అంతేకాదు ఎవరైనా పేదవారు గాయలైనవారు అక్కడ తిరుగుతుంటే వారికి సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయించి.. వారికి కొత్త జీవితాన్ని ఇస్తున్నారు. కాగా ఇక్కడ టిఫిన్లు తినడానికి వచ్చినవారు.. అక్కడ ఆహారం చాలా బాగుంటుందని సంతోషంగా చెబుతున్నారు. ఆకలితో ఉన్నవారికి ఏది పెట్టినా అమృతంగానే ఉంటుందన్నట్లు, ప్లేట్‌లో ఏమీ మిగల్చకుండా శుభ్రంగా తింటున్నారు. ఈ సేవ సికింద్రాబాద్‌లోని పేద, వలస వర్గాలకు ఆకలి తీర్చి, వారికి ఆసరాగా నిలుస్తోంది.  కాగా ప్రస్తుతం ట్రాఫిక్, ఇతర కారణాల వల్ల.. ఈ టిఫిన్ వితరణ కార్యక్రమం లాలాపేట్ స్టేడియం వద్దకు షిప్ట్ చేసినట్లు తెలిసింది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని కరోనా సమయంలోనూ కొనసాగించి.. ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్న గొప్ప మనిషి శామ్యూల్ ( 8500800777) గారిని అభినందించాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us