రాష్ట్రంలో 15,982 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. సెప్టెంబరులోగా నియామకాలు పూర్తి!
రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను సెప్టెంబరు నెలాఖరులోగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా 3,100 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 12,882 హెల్పర్ పోస్టులు కలిపి 15,982 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జిల్లా స్థాయిలో నియామక ప్రక్రియ చేపట్టాలని..

హైదరాబాద్, ఆగస్ట్ 28: తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను సెప్టెంబరు నెలాఖరులోగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా 3,100 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 12,882 హెల్పర్ పోస్టులు కలిపి 15,982 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జిల్లా స్థాయిలో నియామక ప్రక్రియ చేపట్టాలని అధికారులను సూచించింది. అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయాలని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని రెండు జోన్ల పరిధిలో అంగన్‌వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..
- జోన్ 1లో 1853 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 7,737 హెల్పర్ పోస్టులు
- జోన్ 2లో 1247 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 5,145 హెల్పర్ పోస్టులు
జిల్లా స్థాయిలోనే నియామకాలు
అభ్యర్థుల ఎంపికలో ఇంటర్ మార్కులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మొత్తం ఎంపిక ప్రక్రియలో ఇంటర్ మార్కులకు 70 శాతం వెయిటేజీ కేటాయించారు. అదేవిధంగా ఇంటర్వ్యూకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది. ప్రత్యేక కేటగిరీలకు కూడా వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ కల్పించనున్నారు. అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియను జిల్లా స్థాయిలో చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అర్హత కలిగిన అభ్యర్థులను గుర్తించి, నిర్దేశిత నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించింది.
ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులను ఎక్కువ కాలం ఖాళీగా ఉంచకుండా సెప్టెంబరు నెలాఖరులోగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో తెలంగాణలో అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంటర్ ఉత్తీర్ణ అభ్యర్థులకు ఈ నియామకాలు కీలక అవకాశంగా మారనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా పలు జిల్లాల్లో నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. మరికొన్ని జిల్లాల్లో విడుదల చేయాల్సి ఉంది.




