తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ, జీఎస్టీ వసూళ్లు..
దేశీయంగా పెరుగుతున్న డిమాండ్, పటిష్టమైన పెట్టుబడుల అండతో భారత్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. జూన్ 2026 నాటికి విడుదలైన ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం.. జీడీపీ, జీఎస్టీ వసూళ్లు, మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ రంగాలు సాధించిన అద్భుతమైన వృద్ధి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, అంతర్జాతీయ సవాళ్ల మధ్య భారత ఆర్థికవ్యవస్థ సరికొత్త రికార్డులతో దూసుకుపోతుంది. దేశీయ డిమాండ్, పటిష్టమైన పెట్టుబడుల అండతో భారత్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రభుత్వ తాజా ఆర్థిక గణాంకాల ప్రకారం.. జీడీపీ, జీఎస్టీ వసూళ్లు, మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ రంగాలు జూన్ 2026 నాటికి బంపర్ గ్రోత్‌ను నమోదు చేశాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ ఏకంగా 7.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు గతేడాది 7శాతం నుండి 7.8 శాతానికి చేరింది. మాన్యుఫ్యాక్చరింగ్, సేవా రంగాలు, వినియోగం, పెట్టుబడులు ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
రికార్డు స్థాయిలో జీఎస్టీ, పన్ను వసూళ్లు
దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఎంత జోరుగా సాగుతున్నాయో చెప్పడానికి పన్ను వసూళ్లే నిదర్శనం.
జీఎస్టీ కలెక్షన్స్: జూన్ 2026 లో స్థూల జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే 13.9శాతం పెరిగి ఏకంగా రూ.1.95 లక్షల కోట్లకు చేరాయి.
డైరెక్ట్ టాక్స్: జూన్ 17 వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.64శాతం వృద్ధితో రూ.5.21 లక్షల కోట్లకు చేరాయి.
తయారీ, సేవా రంగాల్లో జోరు
మాన్యుఫ్యాక్చరింగ్ PMI: జూన్ 2026 లో హెచ్ఎస్బీసి ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పిఎమ్‌ఐ 54.2 గా నమోదైంది. వరుసగా 37వ నెలలోనూ ఇది 50 పాయింట్ల కంటే పైనే కొనసాగుతూ స్థిరమైన వృద్ధిని చాటుతోంది.
సర్వీసెస్ PMI: సేవా రంగం ఇండెక్స్ మే నెలలో 59.8కి చేరింది. కొత్త క్లయింట్లు, ఎగుమతుల డిమాండ్ పెరగడంతో నవంబర్ 2025 తర్వాత ఇదే అత్యుత్తమ వృద్ధి.
5 నెలల గరిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి
- భారత పారిశ్రామిక ఉత్పత్తి సూచీ మే నెలలో 5.1 శాతానికి చేరి ఐదు నెలల గరిష్టాన్ని తాకింది.
- విద్యుత్, గ్యాస్ సరఫరా రంగం 9.9శాతం వృద్ధి చెందింది.
- మోటారు వాహనాల రంగం 14.5శాతం, ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ రంగం 20.8శాతం చొప్పున భారీ గ్రోత్ సాధించాయి.
ఇన్ఫ్రాస్ట్రక్చర్‌పై కేంద్రం భారీ వ్యయం
దేశంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఏప్రిల్-మే 2026 లోనే రూ.2.51 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చేసింది. రైల్వే భద్రత, సిగ్నలింగ్, కొత్త లైన్ల కోసం ఏప్రిల్-మే నెలల్లోనే ఏకంగా రూ.84,000 కోట్లకు పైగా ఖర్చు చేయడం గమనార్హం.
జోరుగా ఆటోమొబైల్స్, పెరిగిన గ్రామీణ డిమాండ్
ఆటోమొబైల్స్: ఏప్రిల్ నెలలో 26.11 లక్షల యూనిట్ల సేల్స్‌తో దేశీయ ఆటోమొబైల్ రంగ చరిత్రలోనే బెస్ట్ ఏప్రిల్ నమోదైంది. మే నెలలో కూడా 25.31 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఎస్‌యూవీలు, ఈవీలు, టూ వీలర్లకు భారీ డిమాండ్ ఉంది. మే నెలలో గ్రామీణ ప్రాంతాల్లో వాహనాల విక్రయాలు 7.8% పెరిగాయి, ఇది రూరల్ ఎకానమీ బలంగా ఉందనడానికి స్పష్టమైన సంకేతం. దేశంలో వస్తు రవాణాకు అద్దం పట్టే ఈ-వే బిల్స్ జనరేషన్ మే నెలలో 10.9శాతం పెరగ్గా, విద్యుత్ డిమాండ్ 11.2శాతం పెరిగింది. పోర్ట్ ట్రాఫిక్ కూడా 6.6శాతం వృద్ధి సాధించింది.
