Bank Account: బ్యాంక్ అకౌంట్లో అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ట్రబుల్స్ తప్పవ్.. ఐటీ శాఖ నోటీసులు వచ్చే ఛాన్స్..!
బ్యాంక్ అకౌంట్ నుంచి ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేయడం లేదా విత్ డ్రా చేయడం లాంటివి చేస్తున్నారా.. అయితే మీకు ఐటీ శాఖ నుంచి ఇబ్బందులు రావొచ్చు. ఐటీ శాఖ నోటీసులు పంపే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే..?

ప్రభుత్వ పథకాలు పొందేందుకు, ఆర్ధిక కార్యకలాపాలు సజావుగా నిర్వహించుకునేందుకు బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతీఒక్కరికీ తప్పనిసరిగా మారిపోయింది. బ్యాంక్ అకౌంట్ లేనివారంటూ ఎవరూ ఉండదు. ప్రతీఒక్కరికీ ఒక్క బ్యాంక్ ఖాతా అయినా ఉంటుంది. కొంతమంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కూడా వాడుతున్నారు. అయితే బ్యాంక్ అకౌంట్లలో ఎంతైనా నగదు డిపాజిట్ చేయడం లేదా విత్ డ్రా చేయడం లాంటివి చేసుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒకేసారి భారీ మొత్తంలో జమ అయినా లేదా విత్ డ్రా చేసినా బ్యాంకులు మీ సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖకు పంపుతాయి. ఎంత పరిమితి దాటితే ఐటీ శాఖకు పంపుతాయనే విషయం ఒకసారి చూద్దాం.
ఒక ఏడాదిలో ఇంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తున్నారా..?
ఒక ఆర్ధిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్ నుంచి రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్ డ్రా చేసినా లేదా జమ చేసినా ఐటీ శాఖ దృష్టికి వెళుతుంది. ఆర్ధిక సంవత్సరం మొత్తం ఎంత విత్ డ్రా చేశారు.. ఎంత డిపాజిట్ చేశారు అనే వివరాలను లెక్కిస్తారు. రూ.10 లక్షలు దాటితే బ్యాంకులు ఐటీ శాఖకు పంపుతాయి. డిపాజిట్లకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం అధిక విలువ గల లావాదేవీలు ఆర్ధిక లావాదేవీల నివేదిక, SFT కింద రిపోర్ట్ చేస్తాయి బ్యాంకులు, పోస్టాఫీసులు. బ్యాంకులు మీ ట్రాన్సాక్షన్లను పాన్ కార్డుతో అనుసంధానించి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కి పంపుతాయి. ఆదాయపు పన్ను శాఖ ఈ సమాచారాన్ని ఇతర ఆర్థిక పత్రాలతో పోలుస్తుంది. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR), వార్షిక సమాచార నివేదిక (AIS), TDS రికార్డులు, ఇతర ఆర్థిక వివరాలతో పోల్చుతుంది.
ఆధారాలు ముఖ్యం
ఒక వ్యక్తి తాను ప్రకటించిన ఆదాయంతో పోలిస్తే.. బ్యాంక్ ఖాతా నుంచి చేసిన విత్‌డ్రాలు,డిపాజిట్లు వారి ఆదాయానికి అనుగుణంగా లేకపోయతే ఆదాయపు పన్ను శాఖ విచారణ జరపవచ్చు. అందుకే మీరు పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుపుతుంటే సరైన డాక్యుమెంట్స్, ఆదాయ వనరుల సమాచారాన్ని భద్రపర్చుకోవాలి. భవిష్యత్తులో ఐటీ శాఖ నుండి ఏదైనా నోటీసు వచ్చినా మీకు ఇబ్బంది ఉండదు. ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం పంపిన నోటీసుకు మీరు ఆధారాలతో సహా సమాధానమిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందుకే ఒకేసారి బ్యాంక్ అకౌంట్లో మీ ఆదాయానికి మంచి నగదు డిపాజిట్, విత్ డ్రా చేస్తుంటే ప్రూఫ్స్ మీ దగ్గర ఉంచుకోండి.
