Delhi Assembly Election: త్రిముఖ పోరులో గెలిచేదెవరు..? ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

Delhi Assembly Election: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గెలుపుపై అటు ఆప్‌ నేతలు , ఇటు బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి 55 సీట్లలో బీజేపీ గెలుస్తుందన్నారు కేజ్రీవాల్‌. ఫిబ్రవరి 5వ తేదీన ఆప్‌కు గుణపాఠం తప్పదని, కేజ్రీవాల్‌ శీష్‌మహల్‌ను సామాన్య ప్రజల కోసం తెరుస్తామన్నారు అమిత్‌షా

Delhi Assembly Election: త్రిముఖ పోరులో గెలిచేదెవరు..? ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం
Delhi Elections
Follow us
Subhash Goud

|

Updated on: Feb 03, 2025 | 9:09 PM

దేశరాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి 70 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతుంది. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఆప్‌, బీజేపీ , కాంగ్రెస్‌ పార్టీల మధ్య త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మూడు పార్టీల తరపున అగ్రనేతలు చివరి రోజు కూడా సుడిగాలి ప్రచారం చేశారు.

ఆప్‌ అభ్యర్ధులకు మద్దతుగా కేజ్రీవాల్‌ , సీఎం ఆతిశీ రోడ్‌షో నిర్వహించారు. 2013 నుంచి ఢిల్లీలో ఆప్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈసారి కూడా ఢిల్లీలో తమదే విజయమన్నారు కేజ్రీవాల్‌. ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఈసారి 55 సీట్లు రావడం ఖాయమన్నారు. అయితే మహిళలు భారీగా ఓటేస్తే ఆ సంఖ్య 60కి చేరుతుందన్నారు కేజ్రీవాల్‌. తాము మూడు సీట్లు మాత్రమే గెలుస్తామని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.

బీజేపీ అభ్యర్ధుల తరపున కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ ప్రచారం చేశారు. కేజ్రీవాల్‌పై ఆఖరి ప్రచారసభలో విరుచుకుపడ్డారు అమిత్‌షా. ఈసారి బీజేపీ గెలుపు ఖాయమని, బీజేపీ అధికారం లోకి రాగానే శీష్‌మహల్‌ను సామాన్యప్రజల కోసం తెరుస్తామన్నారు. ఆప్‌ అవినీతికి ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు. బడ్జెట్‌లో 12 లక్షల వరకు ట్యాక్స్‌ ఫ్రీ చేయడంతో మధ్యతరగతి ప్రజల ఓట్లు తమకే భారీగా పోలవుతాయన్న అంచనాలో బీజేపీ నేతలు ఉన్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్ధుల తరపున ప్రియాంకాగాంధీ రోడ్‌షో నిర్వహించారు. ఆప్‌, బీజేపీ పార్టీల ప్రచారంతో పోలిస్తే కాంగ్రెస్‌ కాస్త వెనుకబడింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్మాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ కూడా బీజేపీ అభ్యర్థుల తరపున సుడిగాలి ప్రచారం చేశారు. ఎన్డీఏ పార్టీల నేతలు కూడా బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేశారు. యమునా కాలుష్యం పైనే మూడు పార్టీలు ప్రచారం చేశాయి. బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిత్రపక్షాలు జేడీయూ, ఎల్‌జేపీకి ఒక్కొక్క సీటు కేటాయించింది.

మూడు పార్టీలు కూడా ఓటర్లపై ఉచితాల మంత్రాన్ని ప్రయోగించాయి. ఉచితాలతో ఏ పార్టీ ఓటర్లను ఆకట్టుకుందన్న విషయం ఫిబ్రవరి 8వ తేదీన తేలబోతోంది. కోటి 50 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి