Asaduddin owaisi: భారతరత్నకు మచ్చ తెచ్చారు.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
భారతరత్నను మోదీ ప్రభుత్వం కించపరుస్తోందన్నారు. అద్వానీలాంటి వ్యక్తులకు ఈ గౌరవం ఇచ్చి భారతరత్న ప్రాధాన్యతను దిగజారుస్తోందని అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. పాకిస్థాన్‌లోని జిన్నా సమాధి దగ్గరకి అద్వానీ వెళ్లి దేశం విడిపోవడానికి కారణమైన జిన్నాని పొగిడారని, అంతేకాకుండా అద్వానీ రథయాత్ర చేసిన..

దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు లాల్‌కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా మన ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అద్వానీ భారతరత్నకు ఎంపిక అవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాకుండా పలువురు ప్రముఖులు అద్వానీకి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ అభివృద్ధికి అద్వానీజీ చేసిన కృషిని మరువలేమంటూ కొనియాడారు. దేశ రాజకీయాల్లో కార్యకర్త స్థాయి నుంచి ఉప ప్రధానమంత్రిగా సేవలు చిరస్మరణీయం అన్నారు.
ఈ సందర్భంగా అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు. కృతజ్ఞతతో ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నానని చెప్పారు. తన ఆదర్శాలు, సిద్ధాంతాలకు దక్కిన గౌరవమని అన్నారు. కేవలం వ్యక్తిగా మాత్రమే కాదని, జీవిత ప్రయాణంలో తన సామర్థ్యానికి తగినట్టుగా చేసిన సేవలకు దక్కిన మంచి గౌరవం అని అద్వానీ చెప్పారు. అద్వానీకి భారతరత్న ప్రకటించడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతుంటే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రం ఖండించారు. అంతేకాకుండా అద్వానీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
భారతరత్నను మోదీ ప్రభుత్వం కించపరుస్తోందన్నారు. అద్వానీలాంటి వ్యక్తులకు ఈ గౌరవం ఇచ్చి భారతరత్న ప్రాధాన్యతను దిగజారుస్తోందని అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. పాకిస్థాన్‌లోని జిన్నా సమాధి దగ్గరకి అద్వానీ వెళ్లి దేశం విడిపోవడానికి కారణమైన జిన్నాని పొగిడారని, అంతేకాకుండా అద్వానీ రథయాత్ర చేసిన ప్రతీచోటా మతకల్లోలాలు జరిగాయని, ఎంతో మంది ప్రాణాలు పోయాయని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. అద్వానీకి భారతరత్న ఇచ్చి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని దుయ్యబట్టారు.
గతంలో యశ్వంత్‌సింగ్ మహ్మద్ అలీ జిన్నాపై ఓ పుస్తకం రాశారని, మోదీ ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధం విధించిన విషయాన్ని గుర్తుచేశారు. అద్వానీ చరిత్ర చూసుకుంటే ఆయన రథయాత్ర నిర్వహించిన ప్రతి చోటా గొడవలు జరిగాయని, ఎంతో మంది అమాయకులు చనిపోయారని, 23 సెప్టెంబర్ నుంచి 5 నవంబర్ 1990 వరకు బాబ్రీ మసీదును ధ్వంసం చేయడం కోసం రథయాత్ర నిర్వహించారని, అహ్మదాబాద్ నుంచి మొదలుపెట్టి దేశంలోని అనేక ప్రాంతాల్లో యాత్ర చేశారని అసదుద్దీన్ మండిపడ్డారు.
కర్నాటకలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని, హైదరాబాద్‌లో కూడా పెద్ద ఎత్తున మతకల్లోలాలు జరిగాయని అసదుద్దీన్ అన్నారు. భారతరత్నలాంటి అత్యున్నత పురస్కారాన్ని ఇలాంటి వ్యక్తికి ఇచ్చి ఏం లాభమని, పురస్కారానికి ఉన్న ప్రాధాన్యత తగ్గిపోతుందని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, విశ్వహిందూపరిషత్, భజరంగ్‌దళ్ వంటి సంస్థలు భారత్‌లో ఉన్న ముస్లింలను పాకిస్థాన్ వెళ్లాలని ప్రతిరోజూ ఇబ్బందులకు గురిచేస్తుంటారని, కనీసం అవార్డు ఇవ్వకముందు ఈ పరిస్థితిని ఎందుకు గమనించలేదని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




